నాయుడు ‘ది కింగ్ మేకర్’… జాతీయస్థాయిలో మోతెక్కిపోతోంది

Telugu BOX Office

ఇది ఊహించని ఫలితం. అడక్కుండానే వచ్చిన అద్భుత అవకాశం. లోకల్‌గా గెలిస్తే చాలనుకుంటే.. కేంద్రంలో చక్రం తిప్పే ఓ బంపర్‌ ఆఫర్‌ దక్కింది. సెంట్రల్‌లో మళ్లీ బీజేపీనే గెలుస్తుందనేది అంతా ఊహించిందే. ఎన్ని సీట్లు వస్తాయన్నది పక్కన పెడితే.. బీజేపీకే సొంతంగా మెజారిటీ వచ్చేస్తుంది.. ఇక కూటమిలోని పార్టీలన్నీ ఉన్నా లేనట్టే అనుకున్నారంతా. కాని, అనుకోని సువర్ణావకాశం చంద్రబాబు చేతికి చిక్కింది. కేంద్రంలో చక్రం తిప్పేందుకు చంద్రబాబుకు మరోసారి అవకాశం దానంతట అదే హస్తిన నుంచి అడ్రస్‌ వెతుక్కుంటూ వచ్చింది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు ఉన్నట్టు.. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న సమయంలోనే.. అయాచితంగా ఎన్డీయేలో కింగ్‌ మేకర్‌గా నిలిచారు చంద్రబాబు.

నారా చంద్రబాబునాయుడు.. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లోనూ ఈ పేరు చాలా ఫేమస్. వాజ్‌పేయ్ హయాంలో ఎన్డీయే కన్వీనర్‌గా ఉంటూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఘనుడాయన. అయితే అలాంటి అవకాశమే ఇప్పుడు మళ్లీ ఆయన దరికి చేరింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలవడమే కాకుండా ఏకంగా 16 ఎంపీ సీట్లు గెలిపించుకున్న చంద్రబాబు మరోసారి ఎన్డీయే కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్డీయే బొటాబొటీ మెజార్టీ మాత్రమే ఉండటంతో.. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.


ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీ టీడీపీనే. ఒకప్పుడు ఈమాట అనగానే పగలబడి నవ్వుకున్నారంతా. సోషల్‌ మీడియాలో తెగ వెక్కిరించారు. పాతిక సీట్లకు కూడా పోటీ చేయని టీడీపీ.. ఎన్డీయేలో అతిపెద్ద పార్టీగా ఉండడం ఏంటని ఒకవిధంగా ఎగతాళిగానే మాట్లాడారంతా. కాని, ఇప్పుడు నిజంగానే బిగ్గెస్ట్ పార్టీ ఇన్ ఎన్డీయేగా అవతరించింది టీడీపీ. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ఎన్డీయేలో.. ఇప్పుడు చంద్రబాబే అత్యంత కీలకం. ‘నాయుడు ది కింగ్‌మేకర్‌’ అంటూ నేషనల్‌ మీడియా మొత్తం హోరెత్తిపోయింది. నితీష్‌ కుమార్‌ కూడా కింగ్‌ మేకర్‌లో ఒకరు. ఈ ఇద్దరే ప్రస్తుత ఎన్డీయే కూటమిని రక్షించేది. కాకపోతే.. జేడీయూతో పోల్చితే టీడీపీకి వచ్చిన సీట్లే ఎక్కువ. సో, కేంద్రంలో చక్రం తిప్పే పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే.

టీడీపీ కూటమి గెలవగానే.. ప్రధాని మోదీ, అమిత్‌షా నుంచి శుభాకాంక్షలు వచ్చాయి. ‘ఒకసారి కలుద్దాం’ అనే కబురు ఢిల్లీ పెద్దల నుంచే వచ్చింది. పైగా ఎన్డీయే కన్వీనర్‌గా మరోసారి చంద్రబాబు పేరు తెరపైకి వచ్చింది. అదే నిజమైతే.. ఎన్డీయేలో చక్రం తిప్పే అవకాశాన్ని బీజేపీనే చంద్రబాబు చేతిలో పెట్టినట్టు లెక్క. చంద్రబాబు చాణక్యం గురించి రాజకీయ విశ్లేషకులందరికీ తెలుసు. టీడీపీనే కీ-ఫ్యాక్టర్‌గా మారడంతో రేప్పొద్దున కేంద్ర క్యాబినెట్‌లోనూ కీలక పదవులు దక్కించుకోవచ్చంటున్నారు. మొత్తానికి, బీజేపీకి టీడీపీ అవసరమే ఉందనిపించేలా.. పరిస్థితులు మారడం టీడీపీ కూడా ఊహించని ఓ పరిణామమే అని చెప్పాలి.

Share This Article
Leave a comment