ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగియడంతో పోలింగ్ శాతం ఎంత అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇందు కారణం పోలింగ్ కోసం ఓటర్లు పోటెత్తడమే. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా వచ్చి 6 లోపు క్యూలైన్లో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో ఆయా ప్రాంతాల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ కొనసాగడం గమనార్హం.
ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలిరావడంతో ఈసారి పోలింగ్ శాతం భారీగానే నమోదైంది. ఈ క్రమంలో ఏపీ పోలింగ్ శాతంపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో 81.76 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు. 2019 ఎన్నికల్లో 79.88 శాతం పోలింగ్ నమోదు అవగా.. 2014 ఎన్నికల్లో 77.96శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం రికార్డ్ పోలింగ్ శాతం నమోదు అయ్యినట్లు ఈసీ వర్గాలు చెబుతున్నాయి.
1957వ సంవత్సరం నుంచి చూస్తే ఈసారి అత్యధికంగా పోలింగ్ రికార్డ్ అయిందని ఈసీ వర్గాలు తెలిపాయి. దేశంలో నాలుగవ దశ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ అయిన రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు లభించింది. యువత, మహిళల్లో అత్యధిక శాతం ఓటింగ్లో పాల్గొన్నట్లు రాజకీయ పక్షాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో 87.06 పోలింగ్ శాతం నమోదైంది. ఇక రెండవ స్థానంలో చిత్తూరు జిల్లా నిలవగా.. అక్కడ 85.77 పోలింగ్ శాతం నమోదు అయ్యింది. అలాగే మూడవ స్థానంలో 85.48 శాతం ఓట్లతో బాపట్ల నిలిచింది. అయితే అత్యల్పంగా విశాఖపట్నంలో 71. 11 పోలింగ్ శాతం నమోదు అయినట్లు ట్విట్టర్ వేదికగా సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.