ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, రాజకీయ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే అందుకు కారణం. పవన్ గెలుపు కోసం జన సైనికులు.. సినీ, టీవీ ఆర్టిస్టులు ప్రచారాన్ని హోరెత్తించారు. మరోవైపు పిఠాపురంలో పవన్‌ను ఓడిస్తానని.. ఒకవేళ ఓడించకపోతే తాను పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని వైసీపీ నేత, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ చేయడం సంచలనం రేపింది.
అయితే సోమవారం పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పిఠాపురంలో వందలాది మంది క్యూలైన్లలో వేచి ఉండి ఓటుహక్కు వినియోగించుకోవడం ఆసక్తిగా మారింది. మొత్తంగా పిఠాపురంలో 80శాతానికి మించి పోలింగ్ నమోదైందని తెలుస్తోంది. ఈ ఓటింగ్ అంతా పవన్ కళ్యాణ్‌కే పడిందని జన సైనికులు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే భారీ మెజార్టీతో పవన్ గెలుపు ఖాయమని జనసేనతో పాటు ప్రజల్లోనూ చర్చ నడుస్తోంది.
ఈ క్రమంలోనే కొందరు జనసైనికులు ముద్రగడ పద్మనాభాన్ని టార్గెట్ చేశారు. పవన్ గెలుపు ఖాయమైంది.. పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండు అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. నామకరణ ఆహ్వాన పత్రిక అంటూ సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ ఆహ్వానపత్రికలో.. ‘అందరికీ నమస్కారం అండి.. నూతన నామకరణ మహోత్సవం.. కాపు సోదర సోదరీమణులందరికి ప్రత్యేక ఆహ్వానం అండి. 2024 జూన్ 4న సాయంత్రం ఆరు గంటల నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో.. ఏమండీ మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత, తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్దాయన, అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి. కావున అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన. గమనిక మీ ఉప్మా కాఫీలు మీరే తెచ్చుకోవాలండి’అంటూ సెటైర్లు పేల్చారు.
వైసీపీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ పేరెత్తితేనే ముద్రగడ అంతెత్తున లేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానని.. తన పేరును పద్మనాభం బదులు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. అక్కడితో ఆగకుండా.. పవన్ ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన కాపుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం సరికాదని.. పవన్ సినిమాలలో నటించాలని.. రాజకీయాల్లో కాదు అని ఎద్దేవా చేశారు. త్వరలోనే జనసేన పార్టీ ప్యాకప్ కావడం ఖాయమన్నారు.
మరోవైపు తన కూతురు క్రాంతి.. పవన్ కళ్యాణ్‌కు మద్దతు ప్రకటించడాన్ని ముద్రగడ పద్మనాభం జీర్ణించుకోలేకపోయారు. తన కుటుంబాన్ని పవన్ విడిదీశారని.. కూతురితో తనకు తెగదెంపులు అయిపోయినట్లేనని ప్రకటించారు. మొత్తానికి ముద్రగడ తన పేరు మార్చుకోవాల్సి వస్తుందా? లేదా? అన్నది తేలాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.