ఓటమికి తలొంచని ధీరుడు.. ఈసారి మంగళగిరి లోకేష్‌దే

Telugu BOX Office

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ప్రజ‌ల ఆశీస్సులు.. ఎన్నిక‌ల మూడ్ వంటివి నాయ‌కుల‌ గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఎవ‌రూ ఎప్పుడూ విఫ‌లం కావాల‌ని కూడా ఉండ‌దు. ఇదే ఫార్ములాను.. ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ యువ నాయ‌కుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ ఫాలో అవుతున్నారు. 2019లో తొలిసారి ఆయ‌న మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేశారు. అప్పటి అంచ‌నాల మేర‌కు.. లోకేష్ విజ‌యం పక్కా అని టీడీపీ నాయ‌కులు రాసిపెట్టుకున్నారు. రాజ‌ధానిగా ఇక్కడి అమ‌రావ‌తి ప్రాంతాన్ని ఎంపిక‌ చేయ‌డం.. యువ నాయ‌కుడిగా ప్రజ‌ల్లో ఉండడం. హైప్రొఫెల్ నాయ‌కుడిగా నారా చంద్రబాబుకు భారీ గుర్తింపు ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న‌ వార‌సుడిగా లోకేష్ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని టీడీపీ నాయకులతో పాటు రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.

అయితే 2019లో ఈ లెక్కలు తారుమారయ్యాయి. అప్పటి ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి చేతిలో లోకేష్ ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నిక‌ల్లో త్రిముఖ పోరు సాగింది. టీడీపీ, వైఎస్సార్ సీపీల‌తో పాటు.. జ‌న‌సేన‌, క‌మ్యూనిస్టుల మిత్రప‌క్షం త‌ర‌ఫున ముప్పాళ్ల నాగేశ్వర‌రావు పోటీ చేశారు. దీంతో ఓట్లు చీలిపోయి.. నారా లోకేష్ 5,333 ఓట్ల తేడాతో ప‌రాజ‌యం పాల‌య్యారు. దీంతో ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి వరుసగా రెండోసారి విజ‌యం దక్కించుకున్నారు.

అయితే ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే దక్కించుకోవాలన్న స్ఫూర్తితో ఈసారి కూడా మంగళగిరి నుంచే లోకేష్ బరిలోకి దిగారు. గతంలో మాదిరిగా విశ్లేషణలు, అంచనాలను నమ్ముకోకుండా నేరుగా ప్రజలతో మమేకవుతున్నారాయన. కాలనీలు, అపార్ట్‌మెంట్లు చుట్టేస్తూ తనను గెలిపిస్తే ఏం చేస్తారో తడబాబు లేకుండా చెబుతున్నారు. 2019లో ఓడిపోయినా లోకేష్ అనేక సహాయకార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు దగ్గరగానే ఉన్నారు. అదే ఇప్పుడు ఆయన విజయానికి బాటలు వేస్తోంది.

చేనేత కార్మికులు ఎక్కువగా ఉండే మంగళగిరి నియోజకవర్గంలో ఈ ఐదేళ్లు లోకేష్ వారికి అండదండగా నిలబడ్డారు. వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు ఇచ్చారు. తాగునీటి సమస్య ఎదుర్కొనే ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్లు పంపించేవారు. నియోజకవర్గంలో ఏ కష్టమొచ్చినా ఎమ్మెల్యే కంటే ముందే తానున్నానంటూ వచ్చేవారు లోకేష్. దీంతో మంగళగిరి ప్రజల్లో ఆయన పట్ల సానుకూలత విపరీతంగా పెరిగింది. దీంతో ఈసారి లోకేష్ విజయం ఖాయమని టీడీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి.

లోకేష్ బలాలు
గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయార‌న్న సానుభూతి
అమ‌రావ‌తి రైతుల ఉద్యమానికి మ‌ద్దతు
యువ‌గ‌ళం పాద‌యాత్ర తాలూకు సింప‌తీ
బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తార‌నే చ‌ర్చ
సొంత ఖర్చులతో అన్నా క్యాంటీన్ నిర్వహణ
యువతను ప్రోత్సహించేలా కార్యక్రమాలు

బలహీనతలు
స్థానికుడు కాకపోవడంతో గెలిచినా ప్రజలకు అందుబాటులో ఉండరంటూ ప్రత్యర్థుల ఆరోపణలు
చేనేతల ఓట్లను తనవైపు తిప్పుకోలేకపోయారన్న వాదన

Share This Article
Leave a comment