పేదరికం నుంచి బయటపడి ధనికులుగా మారిన వ్యక్తుల కథలు మనం ఎన్నో వింటాం. కానీ ఒక దేశం మొత్తం పేదరికాన్ని జయించి, ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలవడం అరుదైన విషయం. అటువంటి అద్భుతాన్ని సాధించిన దేశమే లిక్టెన్‌స్టెయిన్. జనాభా కంటే ఉద్యోగాలు ఎక్కువ, అప్పుల్లేని ఆర్థిక వ్యవస్థ, ప్రతి పౌరుడూ కోటీశ్వరుడే అన్నంత స్థాయి—ఈ దేశాన్ని ఒక కలల ప్రపంచంలా మార్చాయి.

ఈ దేశం పరిమాణం చూస్తే పెద్ద పట్టణంతో పోలిస్తే కూడా చిన్నదే. మొత్తం జనాభా 40 వేలు మాత్రమే. కారులో కూర్చుంటే అరగంటలో దేశం మొత్తం తిరిగేయొచ్చు. అయినప్పటికీ ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన దేశాలలో ఇది ముందంజలో ఉంటుంది. ఒక్కో వ్యక్తి సంవత్సరాదాయం దాదాపు రెండుకోట్లను దాటుతుంది. నేరాలు దాదాపు లేని దేశంగా ప్రపంచంలో పేరుంది. మొత్తం పోలీసుల సంఖ్య మూడు వందలైతే, నేరచరిత్ర ఉన్న వారి సంఖ్య ఒక్క అంకెల్లోనే నిలిచిపోయింది. లిక్టెన్‌స్టెయిన్‌లో భద్రత అంతగా ఉండటంతో చాలా ఇళ్లకు తాళాలు కూడా వేయరు. ఇదంతా వింటే ఆశ్చర్యం కలిగించొచ్చు కానీ ఈ దేశానికి సొంత సైన్యమే లేదు. ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌లతో శాంతియుత సంబంధాలు ఉండటంతో ఆయుధ బలగాల అవసరం లేదనేది వారి నిర్ణయం.
ఈ రోజైనా ఈ దేశం ప్రకృతి సంపదలో ముందుందని అనుకుంటే అది తప్పు. మంచు పర్వతాలు, రాతి కొండలు తప్ప ఇక్కడ సహజ వనరులు అరుదు. వ్యవసాయం చేయడానికి అనుకూల పరిస్థితులు కూడా లేవు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందువరకు ఇది తీవ్ర పేదరికంతో కొట్టుమిట్టాడిన దేశం. కానీ పరిస్థితులను అదుపులోకి తెచ్చుకోవడంలో ఈ దేశం చూపిన తెలివితేటలు ప్రపంచం చూడాల్సిందే.
సహజ వనరులపై ఆధారపడకుండా, ఆవిష్కరణలపై పెట్టుబడి పెట్టడం లిక్టెన్‌స్టెయిన్‌ను మార్చేసింది. తమ విద్య, నైపుణ్యాలనే పెట్టుబడిగా తీసుకుని సరికొత్త పరిశ్రమలు ప్రారంభించారు. అందులో ముఖ్యమైనది దంత పరిశ్రమ. కృత్రిమ దంతాలు, బ్రిడ్జ్‌లు, ఫిల్లింగ్ మెటీరియల్స్ తయారీలో ప్రపంచానికి సరఫరాదారుగా నిలిచింది. హాలీవుడ్ నటుల దంతాల నుంచి సాధారణ ప్రజల అవసరాల దాకా ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలకు ఉత్పత్తులు పంపే కేంద్రంగా ఎదిగింది. “డెంటల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్” అనే బిరుదు కూడా అందుకుంది.

దంత పరిశ్రమ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది ఫైనాన్షియల్ సేవలు. ప్రపంచంలో కోట్లాది డాలర్ల ఆస్తులు నిర్వహించే 400 కన్నా ఎక్కువ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, బీమా సంస్థలు, బ్యాంకులు—అన్నీ లిక్టెన్‌స్టెయిన్‌ను ప్రపంచ ధనవంతుల ప్రాధాన్య కేంద్రంగా మారుస్తున్నాయి. ఐటీ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే—లిక్టెన్‌స్టెయిన్‌కు సొంత కరెన్సీ లేదు, స్విస్‌ఫ్రాంక్ వినియోగిస్తారు. అంతేకాదు సొంత విమానాశ్రయం కూడా లేదు. పక్క దేశాల్లో దిగిన తర్వాతే ఇక్కడికి చేరుకోవాలి.
వినోదం కోసం ఇక్కడికొచ్చే పర్యాటకులను ఆకర్షించేది ఇంట్రస్టింగ్ కోటలు, తెల్లని మంచుతో కప్పబడిన పర్వతాలు, ప్రకృతి అందాలు మరియు లగ్జరీ రిసార్టులు. ఒక సమయంలో ఈ దేశం మొత్తాన్ని రోజుకి అద్దెకు ఇవ్వడమన్న సర్వీస్ కూడా ఉండేది. ఇంకో ఆర్థిక ఆదాయ వనరు — పోస్టల్ స్టాంప్స్. బంగారం, ప్రత్యేక 3D డిజైన్‌లతో రూపొందించిన స్టాంపులు ప్రపంచవ్యాప్తంగా కలెక్టర్లకు అమ్మి మంచి ఆదాయం తెచ్చుకుంటారు. ఇంతటి అభివృద్ధి సాధించిన ఈ దేశానికి ఒక్క రూపాయి అప్పు కూడా లేదు.చిన్న దేశమన్నా, అవకాశాలు పెద్దవిగా సృష్టించుకోవడమే లిక్టెన్‌స్టెయిన్ విజయ రహస్యం అని చెప్పవచ్చు.
