dont pluck flowers in evening for these reasons
మనిషి దైనందిన కార్యక్రమాలు, జీవితంలో జరిగే ముఖ్య ఘట్టాలకు.. పూలకు చాలా సంబంధం ఉంది. పుట్టినప్పటి నుంచి జీవితంలో జరిగే ప్రతి తంతుకు పూలు అవసరం. ఒక్కో మతంలో పూలకు ఒక్కో రకమైన ప్రాధాన్యత ఉంది. హిందూ సంప్రదాయంలో అయితే పూలకు ప్రముఖ స్థానం ఉంటుంది. పూజలు, పెండ్లి, చావు, పుట్టినరోజు ఇలా ఏ కార్యక్రమం చేసినా పూలు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే.. చాలామంది పూలు ఎప్పుడు పడితే అప్పుడు తెంపుతుంటారు. కానీ చీకటి పడ్డ తర్వాత, సూర్యుడు అస్తమించిన తర్వాత పూలు తెంపొద్దని పెద్దలు చెబుతుంటారు. అసలు సాయంత్రం పూలు ఎందుకు తెంపకూడదు? అలా తెంపితే ఏం జరుగుతుంది?
పెద్దలు సాయంత్రం సమయంలో పూలు కోయొద్దని హెచ్చరిస్తారు. అసలు సాయంత్రం సమయంలో పువ్వులు కోయటం వల్ల కీడు జరుగుతుందా? అంటే దీనికి ఓ కారణం ఉందంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. ప్రకృతి పరంగా, శాస్త్రీయ పరంగా పలు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక సైన్స్ ఉందనేది అందరూ ఒప్పుకునే వాస్తవం. వాటి వెనుక కారణాలు తెలుసుకోకుండా గుడ్డిగా పాటిస్తే అవి మూఢనమ్మకాలుగా మారే అవకాశం ఉంది. వాటిలో సాయంత్రం అయిన తర్వాత పూలు కోయకూడదు అనేది కూడా ఒకటి. సాయంకాలం పూలు కోయరాదు అని చెప్పడంలో ప్రకృతి పరమైన కారణాలు ఉన్నాయి.
సాయంత్రం సమయంలో కొన్ని పనులు చేయడం నిషిద్ధంగా కొన్ని వందల ఏండ్ల నుంచి పాటిస్తున్నారు భారతీయులు. అందులో ఒకటి.. చీకటి పడిన తరువాత చెట్ల మీద చేయి వేయకూడదు అని. అంటే పూలు కూడా తెంపకూడదని అర్ధం. సాయంత్రం సమయంలో సూర్యుడు పూర్తిగా అస్తమిస్తాడు. క్రమంగా వెలుతురు కూడా తగ్గిపోతుంది. వాతావరణం క్రమంగా చల్లబడుతుంది. మొక్కలు, చెట్లు కిరణజన్య సంయోగ క్రియను ఆపేస్తాయి. అంతేకాదు. వాతావరణం చల్లబడి, చీకటి పడుతుండటంతో విష పురుగులు, పాములు వంటివి చెట్ల మీద, పొదల్లోకి చేరిపోతుంటాయి. మళ్లీ ఉదయం వరకు అవే వాటి నివాస స్థానాలు. ఆ సమయంలో చెట్ల వద్దకు వెళ్లి పూలుకోస్తే విష జీవుల బారిన పడాల్సి వస్తుందని పెద్దలు చీకటి పడ్డాక పూలు కోయొద్దని చెప్తారు.