Budget 2025 : వేతన జీవులకు గుడ్‌న్యూస్.. రూ.12లక్షల వరకు నో ట్యాక్స్!

Telugu BOX Office

 

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంతా వేతనజీవులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించక్కర్లేదని వెల్లడించారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించనవసరం లేదని చెప్పారు. అయితే రూ.12 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూనే రూ.4 – 8 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను వర్తిస్తుందని చెబుతుండడంతో పలువురు అయోమయానికి లోనవుతున్నారు. ఇది తెలియాలంటే పన్ను లెక్కింపు విధానం గురించి తెలుసుకోవాలి.

కొత్త పన్ను విధానంలో మార్చిన శ్లాబ్‌లు..
రూ.0-4 లక్షలు – సున్నా
రూ.4-8 లక్షలు – 5%
రూ.8-12 లక్షలు – 10%
రూ.12-16 లక్షలు – 15%
రూ.16-20 లక్షలు – 20%
రూ.20-24 లక్షలు – 25%
రూ.24 లక్షల పైన 30 శాతం

కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. ఒక ఏడాదిలో వచ్చే స్థూల ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం ఏడాదికి రూ.12.75 లక్షలు అనుకుంటే అందులో ప్రామాణిక తగ్గింపు రూ.75 వేలు తొలగిస్తారు. ఇప్పుడు రూ.12 లక్షలను పన్ను ఆదాయంగా (ఇంతకుముందు రూ.7.75 లక్షలు) పరిగణిస్తారు. ఈ పరిమితి వరకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 87ఏ కింద రిబేట్‌ మినహాయిస్తారు. అంటే మాఫీ చేసినట్లే. ప్రస్తుతం రూ.25 వేలుగా ఉన్న మొత్తాన్ని తాజా బడ్జెట్‌లో రూ.60 వేలకు పెంచారు. అంటే రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే స్థూల ఆదాయం రూ.12.75 లక్షలకు ఒక్క రూపాయి దాటినా రిబేటు వర్తించదు. కాబట్టి పన్ను చెల్లించాల్సి వస్తుంది.

భారీగా రీబేట్!
రూ.8 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు ఇప్పుడు ఏడాదికి రూ.30 వేలు పన్ను కడుతున్నారు. ఇక మీదట రూ.20 వేలు కడితే చాలు. కొత్త ట్యాక్స్ శ్లాబ్ కింద పది వేలు తగ్గింపు దొరికినట్లే. దీనికి తోడు కట్టిన రూ.20 వేల పన్ను కూడా రీబేట్ కింద ప్రభుత్వం తిరిగి మన అకౌంట్‌లో వేసేస్తుంది. ఆ లెక్కన మొత్తంగా రూ.30 వేల వరకు ప్రయోజనం చేకూరుతుంది. రూ.9 లక్షల ఆదాయం కలిగిన వారు ప్రస్తుతం రూ.40 వేల ట్యాక్స్ చెల్లిస్తున్నారు. ఇకపై వాళ్లు రూ.30 వేలు కడితే చాలు. దీంతో రూ.10 వేల బెనిఫిట్ కలుగుతోంది. దీనికి తోడు రీబేట్ కింద కట్టిన రూ.30 వేలు తిరిగి ఖాతాలో పడతాయి. కాబట్టి మొత్తంగా రూ.40 వేల వరకు ప్రయోజనం చేకూరుతుంది.

రూ.10 లక్షల శ్లాబ్‌లో ఉన్నవారు ప్రస్తుతం ఏడాదికి రూ.50 వేల పన్ను కడుతున్నారు. ఇక మీదట రూ.40 వేలు చెల్లిస్తే చాలు. ఈ శ్లాబ్‌లోనూ రూ.10 వేల మినహాయింపు ఇస్తున్నారు. ట్యాక్స్ కింద కట్టిన రూ.40 వేలు కూడా రీబేట్ కింద రిటర్న్ అవుతాయి. కాబట్టి మొత్తంగా ట్యాక్స్ పేయర్స్‌కు రూ.50 వేలు బెనిఫిట్ అవుతుంది. రూ.11 లక్షల శ్లాబ్ వారు ప్రస్తుతం రూ.65 వేల ట్యాక్స్ కడుతున్నారు. ఇక మీదట రూ.50 వేలు చెల్లిస్తే చాలు. తగ్గిన పన్ను మొత్తం 15 వేలకు తోడు రీబేట్ అయ్యే 50 వేలు కలిపి ఓవరాల్‌గా రూ.65 వేల వరకు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది.


వాళ్లకు నో రీబేట్!

రూ.12 లక్షల శ్లాబ్ వారికి ఏడాదికి రూ.80 వేల వరకు బెనిఫిట్ లభిస్తుంది. రూ.16 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు శ్లాబ్‌లో ఉన్నవారికి రీబేట్ కింద అమౌంట్ ఏమీ రాదు. కానీ ఆ శ్లాబ్‌ల పన్నులు తగ్గించడంతో ఏటా వారికీ భారీగా ప్రయోజనం చేకూరనుంది. రూ.16 లక్షల ఆదాయం కలిగిన వారికి రూ.50 వేలు, రూ.20 లక్షల ఆదాయం కలిగిన వారికి రూ.90 వేలు, రూ.24 లక్షల ఆదాయం కలిగిన వారికి రూ.1,10,000 మేర ప్రయోజనం చేకూరనుంది.

Share This Article
Leave a comment