దీపాల కాంతితో కళకళలాడే ఆలయాలతో… శివనామస్మరణ చేస్తూ ఉపవాస దీక్షను చేపట్టే భక్తులతో… కార్తీక మాసం పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. హరిహరులకు ఇష్టమైన మాసంగా పరిగణించే ఈ నెలలో చేసే పూజలకూ, వ్రతాలకూ విశేషమైన ఫలితం ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి.
దీపావళి తరువాతి రోజునుంచీ మొదలయ్యే కార్తికం సంవత్సరంలో వచ్చే ఎనిమిదో నెల. చంద్రుడు పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ నెలకు కార్తికమనే పేరు వచ్చింది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఎవరిని పూజించినా ఇద్దరూ సంతోషిస్తారని అంటున్నాయి శాస్త్రాలు. ఈ నెలలో చేసే జపం, ధ్యానం, నదీస్నానం, దానం, ఆరాధనతో సకల శుభాలూ కలుగుతాయి. కార్తిక సోమవారాలకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.
సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం అంటే శివుడికీ ఇష్టం కాబట్టి ఈ నెలలో వచ్చే సోమవారాల్లో ఉపవాసం ఉండి, శివుడిని ఆరాధించి సాయంత్రం నక్షత్ర దర్శనం తరువాత దీపాలను వెలిగించి భోజనం చేస్తే సకల శుభాలూ కలుగుతాయని అంటారు. అలాగే కార్తిక శుక్ల పక్ష విదియనాడు భగినీహస్త భోజనం పేరుతో ప్రతి సోదరుడు తమ సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం తిని కానుకలు ఇవ్వడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. చవితినాడు నాగుల చవితిగా పరిగణించి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని కొలుస్తారు. ఇవి కాకుండా మరికొన్ని పర్వదినాలూ ఈ మాసంలో ప్రత్యేకతల్ని సంతరించుకుంటాయి.
మాలధారణ చేపట్టే మాసం
ఈ కార్తికంలోనే అయ్యప్పదీక్షను స్వీకరించడం వెనుకా కారణం లేకపోలేదు. అయ్యప్పను హరిహరసుతుడిగా భావిస్తారు. మకర సంక్రమణ సమయంలో స్వామి మకరజ్యోతి రూపంలో ఆవిర్భవిస్తాడని ఓ నమ్మకం. ఆ జ్యోతిని చూసేందుకు మండలంపాటు దీక్షను చేపట్టి స్వామి సన్నిధానానికి చేరుకుంటారు భక్తులు.
ద్వాదశికి ప్రాధాన్యం
కార్తికంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశిని… క్షీరాబ్ది ద్వాదశి, పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి వంటి పేర్లతో పిలుస్తారు. ఈ రోజునే అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించారని పురాణాలు చెబుతున్నాయి. యోగులూ, మునులూ తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కూడా ఇదే. ఆ రోజునే విష్ణుమూర్తి-తులసిలకు కల్యాణాన్ని జరిపించి దీపాలను వెలిగిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన మహావిష్ణువు కార్తిక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొని ద్వాదశి నాడు లక్ష్మీదేవిని పరిణయమాడతాడని విష్ణు పురాణం పేర్కొంటోంది. అందుకే ద్వాదశినాడు సాయంత్రం తులసిని లక్ష్మీదేవిగా అలంకరించి, ఉసిరిచెట్టును శ్రీమన్నారాయణుడిగా భావించి కల్యాణం జరిపించి, దీపాలతో అలంకరిస్తారు.
పౌర్ణమిరోజు ఏం చేస్తారంటే..
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి శివరాత్రితో సమానమైనదిగా చెబుతారు. ఈ రోజునే త్రిపురాసురుడు అనే రాక్షసుడి వధ కూడా జరిగిందట. శంకరుని గురించి నారదుని ద్వారా విన్న త్రిపురాసురుడు కైలాసంపైకి దండెత్తి వెళ్లాడట. మూడురోజుల భీకర యుద్ధం అనంతరం శంకరుడు త్రిపురాసురుడిని సంహరించడంతో దేవతలంతా స్వామిని పూజించారనీ అందుకే ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమిగా పిలుస్తారనీ పురాణగాథ. ఈ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో దీపాలను వెలిగించాలనీ… ఇవి రోజుకో వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయనీ చెబుతారు.
కార్తీక పౌర్ణమి నాడు కొన్ని ప్రాంతాల్లో సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేసుకుంటారు. ఈ రోజున శివాలయాల్లో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతల్నీ పూజించిన ఫలితం లభిస్తుందని ప్రతీతి. అరుణాచలంలో ఈ రోజున వెలిగించే దీపాన్ని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ నెల మొత్తం శివాభిషేకాలూ, రుద్ర పఠనం, లలిత-విష్ణు సహస్రనామ పారాయణాలూ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరి, సకల శుభాలూ కలుగుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు.