ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం.. భవద్భువ్యతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీశాన మీడే..
అని శివుడుని కొలుస్తారు భక్తులు. అసలే బోళా శంకరుడు ఆపైన భక్తుల కోసమే వెలసిన మహాదేవుడు. అలాంటి శివదేవుడి ప్రఖ్యాత క్షేత్రాల్లో.. నేపాల్ దేశంలోని పశుపతి నాథ్ ఆలయం అత్యంత ప్రముఖమైంది. ఇంతకీ ఈ నేపాల్ దేవుడి విశిష్టతలేమిటి? ఇక్కడీ శివుడెలా వెలిశాడో తెలుసుకుందాం…
శివుడంటే పిలిస్తే పలికే దైవం…శివుడంటే అభయంకరుడు. భక్తజన ప్రియంకరుడు. ఆపత్కాలంలో శంభోశంకర అని అర్చించిన వెంటనే ఆదుకునే అపర భక్తవ శంకరుడు. ఉండేది లింగాకారం. మహత్యం చూపడంలో అనంతాకారం. శివుడ్ని కొలిస్తే ఆపదలు మటుమాయం. శివుడి గురించి విన్నా.. కొలిచినా.. స్మరించుకున్నా పుణ్యమే. శివుడంటే మాటలకందని మహిమాన్విత దేవుడు. శివుడంటే కొలిచేకొద్దీ కొంగుబంగారమయ్యే శక్తి స్వరూపుడు.
పశుపతినాథ్ దేవాలయం నేపాల్ దేశ రాజధాని కాట్మండు నగరం ఈశాన్య దిక్కు పొలిమేర్లలో బాగమతి నది ఒడ్డున ఉంది. పశుపతి (శివుడు) ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు. ఇక్కడి శివుడు నేపాల్ జాతీయ దైవంగా కొలవబడుతున్నాడు. యునెస్కో ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా కొనసాగుతున్న ఈ దేవాలయానికి నిత్యం దేశ విదేశాలనుంచీ వేలాది మంది భక్తులు వస్తుంటారు. సుప్రసిద్ధ 275 శైవక్షేత్రాల్లో పశుపతినాథ్ ఆలయం కూడా ఒకటి. ఈ దేవాలయంలోకి హిందువులకు మాత్రమే అనుమతి. ఇతర మతస్థులు పశుపతిని దర్శించాలంటే భాగమతి నదీ తీరం నుంచి చూసి తరించాల్సిందే. ప్రపంచంలో హైందవ దేశం ఏదైనా వుందంటే అది నేపాల్ అన్న పేరుంది. నేపాళీయులకు పశుపతి అంటే ఎంతో భక్తి.
పరమేశ్వర అంశతో భువిపై జన్మించిన ఆదిశంకరుడు ప్రారంభించిన సంప్రదాయం ప్రకారం.. పశుపతి పూజలు జరుగుతాయి. దక్షిణ భారతదేశానికి చెందిన పూజారులే పశుపతినాథ్‌కు నిత్యం పూజా కైంకర్యాలు నిర్వహిస్తుంటారు. ఎందుకంటే నేపాల్ సంప్రదాయం ప్రకారం రాజు మరణించినప్పుడు ఇక్కడి ప్రజలకు శివ పూజలు చేసే అర్హత వుండదు. రాజును తండ్రిగా భావించడం ఇక్కడి వారి ఆచారం. దాని ప్రకారం పశుపతి నిత్య పూజలకు ఆటంకం ఏర్పడుతుంది. తమకెంతటి కష్టం కలిగినా.. పరమేశ్వరుడి నిత్యకైంకర్యాలకు లోపం రానివ్వకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేశారు నేపాలీయులు.
ఆదిశంకరుడు కొలిచిన పశుపతినాథ తత్త్వం.. అనన్య సామాన్యం. ఎందుకంటే మనిషిలోని పశుత్వాన్ని జయించి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడానికి.. దివ్యత్వపు వెలుగులు పొందడానికి అర్హత సాధించాలంటే పశుపతిని కొలవాలి. మోక్షానికి దగ్గరి దారి చూపడం పశుపతినాథుడికి మాత్రమే సాధ్యం. అందుకే దూరా భారం లెక్కించకుండా ఆయన దర్శనం కోరి వస్తుంటారు దేశ విదేశీ భక్తులు. పశుపతినాథ్ ఆలయం ఇక్కడ ఎప్పుడు వెలిసిందో స్పష్టమైన కాలం తెలీదు. కానీ కొన్ని శాసనాల ప్రాకారం ఆలయనిర్మాణం గురించిన వివరాలు దొరుకుతాయి.
చారిత్రక ఆధారాల ప్రకారం… క్రీస్తు శకం 753వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. శుశూపదేవ మహారాజు అధ్వర్యంలో ఈ నిర్మాణం సాగినట్టు 11జయదేవ ఆలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. 1416వ సంవత్సరంలో.. రాజా జ్యోతిమల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని అంటారు. 1697వ సంవత్సరంలో రాజాభూపేంద్ర ఈ దేవాలయాన్ని పునర్నించాడని తెలుస్తోంది. ఖాట్మండులో పశుపతినాథుడు లింగాకారంలో దర్శనమివ్వడానికి కొన్ని ఇతిహాస కథనాలు ప్రచారంలో వున్నాయి.
గో ఇతిహాసం ప్రకారం ఒకప్పుడు శివుడు జింక వేషం ధరించి భాగమతీ తీరాన విహరిస్తుండగా దేవతలు ఆ కొమ్ము పట్టుకున్నారు. అప్పుడా కొమ్ము విరిగింది. దాన్నిక్కడ పూడ్చి పెట్టారు. తర్వాతికాలంలో ఆ కొమ్ము లింగాకారంలోకి రూపాంతరం చెందింది. అక్కడి భూమి లోపలున్న లింగాన్ని గుర్తించి ఒక ఆవు తన పాలనక్కడ కురిపించింది. ఆ వింత చూసిన పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని తవ్వగా ఒక శివలింగం బయట పడిందట. అదే పశుపతినాథ లింగమని చెబుతారు.