ప్రపంచంలోనే అత్యంత పురాతన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో ఉంది. ఇది క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులంటున్నారు. 1911లో గోపీనాధరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల ఈ శివ లింగంపై ఒక చేత్తో పశువును,మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు. తలపాగా, దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ రుగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. ప్రాచీన శైవ పూజా విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆలయ గర్భగుడి సైతం గజ పుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది. ఆలయంలో దొరికిన శాసనాల్లో దీన్ని పరమేశ్వరాలయంగా పేర్కొన్నారు. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాల్లో క్రీస్తు శకం రెండో శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయటపడ్డాయి.
చోళ, పల్లవ, గంగ పల్లవ, రాయల కాలంలో నిత్యం ధూప, దీప, నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి. చాలా విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఆర్కియాలజీ వెబ్సైట్లో ఇంత ప్రముఖమైన శివలింగం గురించి కనీస సమాచారం లేదు. గుడి చుట్టూ పచ్చిక పెంచడం మినహా ఆ శాఖ సాధించిన మార్పు ఏమీ లేదు.
గుడిమల్ల గ్రామస్తుల్లో ఒకరైన వున్నం గుణశేఖర నాయుడు 2006 నుంచి 2008 వరకు డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీతో సమాచార చట్టం ఆయుధంగా యుద్దం చేసి వారిని కేంద్ర సమాచార చట్టం ముందు నిలబెట్టాడు. ఈ గుడికి సంబంధించిన ఆస్తుల వివరాలు అటుంచితే కనీసం గుడికి సంబంధించిన సాహిత్యం కూడా వారి దగ్గర లేదనే నగ్నసత్యం బయట పడింది. ఈ క్రమంలో గుణశేఖర నాయుడు చేసిన కృషి ఫలితంగా 2009లో గుడిలో పూజలు జరిపేందుకు గ్రామస్తులకు అనుమతి సాధించాడు.
గతంలో ఎప్పుడో ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇట్లాంటి శిల్పం ఉంది. ఇంగువ కార్తికేయ శర్మ రాసిన ‘పరమేశ్వర టెంపుల్ ఎట్ గుడిమల్లం’ ‘డెవలప్ మెంట్ ఆఫ్ ఎర్లీ శైవ ఆర్ట్ అండ్ అర్కిటెక్చర్ ‘ అనే రెండు పుస్తకాలు ,మరి కొన్ని శిల్ప,కళా చరిత్ర పరిశోధన పత్రాలు మినహా ఈ గుడి గురించి మరే ఇతర సమాచారం లేదు.
ప్రపంచంలోని ఏడు వింతలకు పదిమెట్లు పైనుండే ఈ శివలింగం కాల ప్రభావాన్ని సవాలు చేస్తూ అనేక సంవత్సరాలు చెక్కుచెదరకుండా అచంచలంగా నిలిచి ఉంది. ఎపుడో భూమి మీద వశించి గతించి పోయిన ఒకానొక మానవ సమాజపు సామూహిక ధార్మిక అలౌకిక విశ్వరూపం. ఈ క్షేత్రం రేణిగుంట నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.