భారతీయ సంప్రదాయంలో రక్తసంబంధాలకీ, అనుబంధాలకీ ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రాధాన్యతను ఇవ్వడమే కాదు, వాటిని కలకాలం నిలుపుకొనేందుకు చక్కటి ఆచారాలను కూడా అందించారు మన పెద్దలు. అందుకు గొప్ప ఉదాహరణే యమవిదియ. ఇది దీపావళి నుంచి రెండోరోజున వస్తుంది.
చారిత్రక గాథ
ఓసారి యమ ధర్మరాజు సోదరి యమునా నదికి తన అన్నను చూడాలని అనిపించింది. తన ఇంటికి వచ్చి చాలా రోజులైంది కాబట్టి, ఓసారి వచ్చి వెళ్లమని గంగానది ద్వారా యముడికి కబురుపెట్టింది. ఆ కబురు వినగానే యముడు.. యమునాదేవి ఇంటికి వెళ్లాడు. తన అన్నను సాదరంగా ఆహ్వానించి, కడుపునిండా భోజనం పెట్టింది. చెల్లెలి అనురాగానికి సంతోషించిన యముడు, ఏం వరం కావాలో కోరుకోమన్నాడట. అందుకు యమున నువ్వు ఏటా ఇదే రోజున మా ఇంటికి వస్తే చాలు… అదే గొప్ప వరం అని చెప్పింది.
యముడు ఆ వరానికి తథాస్తు చెప్పడమే కాకుండా ఎవరైతే ఆ రోజున తన సోదరి ఇంట్లో భోజనం చేస్తారో వాళ్లు అకాలమృత్యువు నుంచి, నరక లోకం నుంచీ శాశ్వతంగా తప్పుకుంటారని చెప్పాడట. ఆ రోజున తన సోదరులని సేవించుకున్న సోదరికి వైధవ్యం ప్రాప్తించదని కూడా వరాన్ని అందించాడు. అందుకే ఈ రోజుని యమద్వితీయం అని పిలుస్తారు. నరకాసురుని సంహరించి వచ్చిన శ్రీకృష్ణుని అతని సోదరి సుభద్ర సాదరంగా ఈ రోజునే ఆహ్వానించిందనీ, అందుకు గుర్తుగా భాతృ విదియ మొదలైందని కూడా చెబుతారు.
ఆడపిల్లలకి పెళ్లి అయిపోగానే తమ పుట్టింటి నుంచి దూరం అవుతారు. పురుళ్లూ పుణ్యాలకు హడావిడిగా రావడమే కానీ, తల్చుకున్నప్పుడు ఓసారి తన పుట్టింటివాళ్లను చూసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇక వాళ్ల సోదరుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. బావమరదులుగా ఎంత బతకకోరినా, వీలైనప్పుడల్లా సోదరి ఇంటికి వెళ్లే స్వాతంత్ర్యం, అవకాశం ఉండకపోవచ్చు. తన సోదరి కాపురం ఒక్కసారి చూడాలని వారికీ, తన సోదరునికి ఒక్కసారి కడుపారా భోజనాన్ని పెట్టాలన్న తపన వీరికీ తీరని కోరికగానే మిగిలిపోతుంది. అందుకే ఈ భాతృ విదియను ఏర్పరిచారు మన పెద్దలు. దక్షిణాదిన ఈ పండుగను కాస్త తక్కువగానే ఆచరిస్తారు కానీ, ఉత్తరాదికి వెళ్లే కొద్దీ ఈ పండుగ ప్రాముఖ్యం మరింతగా కనిపిస్తుంది. నేపాల్లో అయితే ఆ దేశ ముఖ్య పండుగలలో దీన్ని కూడా ఒకటిగా ఎంచుతారు. ఉత్తరాదిన ఈ పండుగను భాయిదూజ్, భాయిటీకా, భాయితిహార్… వంటి భిన్నమైన పేర్లతో పిలుచుకుంటారు. దీపావళి పండుగ వీరికి భాతృ విదియతోనే ముగుస్తుంది.