వేదానికి సరైన అర్ధం చెప్పి, విశిష్టద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు శ్రీరామానుజాచార్యుడు. మోక్షం ఒక వర్గానికే చెందినదికాదని సర్వులకు దానిని పొందే అర్హత ఉందని చెప్పిన సమతామూర్తి. తిరుమలలో నేడు జరుగుతున్న శ్రీవారి నిత్య కైంకర్యాలను, సేవలను నిర్ధారించింది కూడా ఆయనే. మంత్రం, మోక్షం అందరిదీ అంటూ తిరుకొట్టియూర్ ఆలయ గోపురం పైకి ఎక్కి ద్వయ మంత్రాన్ని ప్రకటించిన మహనీయుడు ఆయన. ఇలా చెప్పుకుంటూ వెళితే కొందరికే పరిమితమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచేందుకు తన జీవితాంతం కృషి చేశారు. అటువంటి గొప్ప ఆధ్యాత్మిక సంస్కర్త, మానవతావాది అయిన శ్రీరామానుజాచార్యులు శరీరాన్ని విడిచి పెట్టి సుమారు 1000 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన శరీరం మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండా భద్రపరచబడింది. ఇది నిజంగా ఒక అద్భుతం అని చెప్పవచ్చు.
సాధారణంగా ఒక మనిషి మరణిస్తే శరీరం కొద్ది రోజులకు కుళ్లిపోయి నశిస్తుంది. కానీ శ్రీరామానుజాచార్యుల శరీరం మాత్రం జ్ఞాన కాంతులతో ఇప్పటికీ వెలిగిపోతూ కనిపిస్తుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు చూడాలనుకుంటే తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగానికి వెళ్లాల్సిందే. అవును పరమ పవిత్రమైన శ్రీరంగం క్షేత్రంలోనే రామానుజాచార్యుల శరీరం ఉంది. సాధారణంగా ఈ ఆలయానికి వెళ్లే చాలా మందికి అక్కడ భగవత్ రామానుజుల శరీరం ఉందని తెలియదు. శ్రీరంగంలో ఉన్న రామానుజుల శరీరాన్ని చూసిన వారెవరైనా ఆశ్చర్యపడకమానరు. ఎందుకంటే ఆయన శరీరం ఇప్పటికీ పద్మాసనంలో కూర్చుని ఉన్న ఒక విగ్రహంలా కనిపిస్తుంది. 1017 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూరులో జన్మించిన ఆయన దాదాపు 123 ఏళ్లు జీవించినట్లు చరిత్ర చెబుతోంది. పద్మాసన స్థితిలోనే ప్రాణం విడిచిపెట్టిన ఆయన శరీరాన్ని ప్రత్యేక లేపనాలను అద్ది భద్రపరిచారు. ప్రతి ఏటా ఆయన దివ్య దేహానికి ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కర్పూరం, కుంకుమ పువ్వు కలిపిన లేపనాన్ని ఆయన శరీరానికి రాస్తారు. ఈ ప్రక్రియ కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతుంది. అందుకే రామానుచార్యుల శరీరం ఎర్రని వర్ణంలో ఒక విగ్రహంలా మెరిసిపోతుటుంది.
రామానుజుల ఆలయం
శ్రీరంగం ఆలయాన్ని సందర్శించే వారు ఏడు ప్రాకారాల గుండా వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకుంటారు. అయితే ఆ మార్గంలో నాలుగవ ప్రాకారంలోకి ప్రవేశించగానే కుడి చేతి వైపు రామానుజుల ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని చాలా మంది భక్తులు దర్శించి వెళుతుంటారు. కానీ అక్కడ భద్రపరిచిన ఆయన శరీరాన్ని ఎవరూ గుర్తించలేరు. ఒకవేళ చూసినా అది విగ్రహం అనుకుని నమస్కరించి వెళిపోతారు. కానీ తెలిసిన వారు మాత్రం అర్చకులను అభ్యర్ధించి హారతి వెలుగులలో రామానుజుల శరీరాన్ని చూసి తన్మయత్వాన్ని పొందుతారు. హారతి ఇచ్చే సమయంలో భక్తులు సరిగ్గా గమనిస్తే ఆయన ప్రకాశవంతమైన కళ్లు, గోర్లు కనిపిస్తాయి.
ఎలా చేరుకోవాలి?
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరం నుండి శ్రీరంగం 324 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీరంగానికి తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఉంది. అక్కడి నుంచి శ్రీరంగానికి 15 కిలోమీటర్ల దూరం. క్యాబ్ లేదా ప్రైవేటు వాహనాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ విమానాశ్రయానికి చెన్నై, సింగపూర్, దుబాయ్, షార్జా, కొలంబో, ముంబై, కౌలాలంపూర్ వంటి అనేక ప్రాంతాల నుండి విమాన రాకపోకలు జరుగుతుంటాయి.
రైలు మార్గం ద్వారా వెళ్లాలనుకునేవారు దేశంలోని అన్ని నగరాల నుండి చెన్నై రైల్వే స్టేషన్‌కు సులభంగా చేరుకోవచ్చు. చెన్నై నుండి కన్యాకుమారి ట్రాక్‌పై వెళ్లే రైళ్ల ద్వారా మీరు శ్రీరంగం వెళ్లవచ్చు. 320 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి 5 గంటల సమయం పడుతుంది. శ్రీరంగంలో కొన్ని రైళ్లు మాత్రమే ఆగుతాయి. మిగతా రైళ్లు తిరుచిరాపల్లి జంక్షన్ లో ఆగుతాయి. తిరుచిరాపల్లి జంక్షన్ నుండి శ్రీరంగంకు ప్రతి ఐదు నిమిషాలకు బస్సులు నడుస్తుంటాయి. రోడ్డు మార్గం ద్వారా వెళ్లే ప్రయాణికులు చెన్నై నగరానికి చేరుకుని అక్కడి నుండి శ్రీరంగం వెళ్లే బస్సులను అందుకోవచ్చు.