చిత్రం: కిష్కింధపురి
నటీనటులు: బెల్లకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, శ్రీకాంత్ అయ్యంగార్, శాండీ మాస్టర్, మర్కంద్ దేశ్‌పాండే, హినా భాటియా తదితరులు
సంగీతం: చైతన భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: చిన్మయ్ సలాస్కర్
ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే
నిర్మాత: సాహు గారపాటి
రచన, దర్శకత్వం: కౌశిక్ పెగళ్లపాటి
విడుదల: 12-09-2025

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన తొలి హారర్ చిత్రం ‘కిష్కింధపురి’. అనుపమ కథానాయిక. విజయవంతమైన ‘రాక్షసుడు’ తర్వాత ఆ ఇద్దరూ కలిసి నటించిన చిత్రమిది. థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకుడు ఓ రెండున్నర గంటల్లో ఫోన్‌కి పని చెప్పకుండా ఉన్నాడంటే.. ఆ సినిమా విజయం సాధించినట్టే. ‘కిష్కింధపురి’ అలాంటి చిత్రమే. సినిమా ఆరంభం అయిన పది నిమిషాల తరువాత నుంచి ఎవరైనా ఫోన్ పట్టుకుంటే నేను సినిమాలు చేయడమే మానేస్తా అంటూ పెద్ద స్టేట్‌మెంటే ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన ఉద్దేశంలో సినిమా అంత థ్రిల్ చేస్తుందని. మరి నిజంగానే ‘కిష్కింధపురి’ థ్రిల్ చేసిందా.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూ ద్వారా తెలుసుకుందాం…
‘కిష్కింధపురి’ ఓ రేడియో స్టేషన్‌లో జరిగిన కథ. 1989 నాటి కథ. సువర్ణమాయలో విశ్వరపుత్ర (శాండీ మాస్టర్) సృష్టించిన భయానక విధ్వంసమే ‘కిష్కింధపురి’. ప్రేతాత్మ దాని పరిచయం అనే కాన్సెప్ట్‌లో దెయ్యాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాళ్లందర్నీ.. ఓ దెయ్యాల కొంపకి తీసుకుని వెళ్లి ఆ దెయ్యం వెనుకున్న కథని పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయించడమే పనిగా ‘ఘోస్ట్ వాకింగ్ టూర్’ని నిర్వహిస్తుంటారు రాఘవ (బెల్లంకొండ), మైథిలి (అనుపమ). అలా ఓ 11 మంది బృందాన్ని అనుకోకుండా.. కిస్కిధపురి ఊరిలో ఉన్న సువర్ణమాయ అనే రేడియో స్టేషన్‌కి తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్లిన తరువాత.. ఆ బృందంలోకి ఒక్కొక్కర్నీ వేదవతి (రేడియో ఆర్టిస్ట్) అనే దెయ్యం చంపేస్తూ ఉంటుంది. ఆ దెయ్యానికి ఎదురెళ్లిన రాఘవ.. మిగిలిన వాళ్లని ఎలా కాపాడాడు? ‘సువర్ణమాయ’లో అసలేం జరిగింది? సువర్ణమాయలో ఉన్న రాక్షసశక్తి విశ్వరపుత్రని రాఘవ ఎలా ఢీ కొట్టాడు? అసలు అతని కథ ఏంటి అనేదే ‘కిష్కింధపురి’.
హారర్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాల మేళవింపుతో రాసుకున్న కథ ఇది. ప్రథమార్ధంలో దెయ్యాన్ని చూపిస్తూ భయపెట్టేందుకు.. ద్వితీయార్ధంలో ఆ దెయ్యం వెనకున్న కథని చెబుతూ థ్రిల్‌ని పంచేందుకు ప్రయత్నిస్తుందీ సినిమా. భయపెట్టడం వరకూ ఫర్వాలేదనిపిస్తుంది కానీ, ద్వితీయార్ధంలో థ్రిల్లింగ్ అనుభూతి కాస్త తగ్గింది. అయితే, థియేటర్‌లో ఉన్నంతసేపూ ఆ కథలో చోటు చేసుకునే మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. హారర్‌కి లాజిక్ ఉండదు అంటూ సినిమాలో హైపర్ ఆది ఓ డైలాగ్ చెబుతాడు. అందుకు తగ్గట్టే ఈ సినిమాలో చాలా చోట్ల లాజిక్‌ని పక్కనపెట్టి భయపెట్టే ప్రయత్నం కనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్‌లో హారర్ నేపథ్యం మంచి ప్రభావం చూపిస్తుంది. అందుకు సౌండ్, విజువల్స్, నిర్మాణ విలువలు అందుకు బాగా సహకారం అందించాయి. సువర్ణమాయ రేడియో స్టేషన్‌లోకి అడుగుపెట్టాకే అసలు కథ మొదలవుతుంది. అక్కడ వేదవతి వాయిస్ వినిపించడంతో కథలో హారర్ కోణం వెలుగులోకి వస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌గా వచ్చే సువర్ణమాయ స్టేషన్, వేదవతి, విశ్రవపుత్ర కథలు సినిమాకి కీలకం. ఆ కథంతా సినిమా చూస్తున్నంతసేపూ ఆసక్తికరంగానే అనిపించినా విశ్రవపుత్ర కథ మాత్రం రాక్షసుడు సినిమాలోని ఓ ఎపిసోడ్‌ని గుర్తు చేస్తుంది.
బెల్లంకొండ శ్రీనివాస్ ఓ కొత్త జోనర్‌ని ప్రయత్నిస్తూనే తన మార్క్ యాక్షన్ అంశాల్ని మిస్ కాకుండా చూసుకున్నారు. యాక్షన్ అవతారంతో మెప్పిస్తూనే హారర్ ప్రధానంగా సాగే సన్నివేశాల్లో మంచి నటనని ప్రదర్శించారు. అనుపమ అందంగా కనిపిస్తూనే సెకండాఫ్‌లో భయపెడుతుంది. ఆమె దెయ్యంగా మారే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. విశ్రవపుత్ర పాత్రలో నృత్య దర్శకుడు శాండీ మాస్టర్ చాలా బాగా నటించారు. ఆయన ప్రథమార్ధంలో కనిపించిన విధానమే భయపెడుతుంది. హైపర్ ఆది, సుదర్శన్ సినిమా ఆరంభంలో సందడి చేస్తారు కానీ, పెద్దగా కామెడీ పండదు. సీనియర్ కథానాయిక ప్రేమ నటన ఆకట్టుకుంటుంది. డీ గ్లామర్‌గా కనిపిస్తూ ఆమె తల్లి పాత్రకి ప్రాణం పోశారు. సినిమాటోగ్రఫీ, చైతన భరద్వాజ్ సౌండ్ ఎఫెక్ట్స్.. దర్శకుడి ఊహని కళ్లకి కట్టినట్టే అనిపిస్తాయి. సువర్ణమాయ రేడియో సెట్ రియల్ ఎక్స్‌పీరియన్స్‌ని కలిగిస్తే.. చైతన భరద్వాజ్ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా చోట్ల భయపెడతాయి. సినిమా నిడివి రెండుగంటలే కావడంతో బోరింగ్ లేకుండా సాగింది.
