అనుకున్నది సాధించిన చంద్రబాబు… విశాఖ ఉక్కుకు భారీ ప్యాకేజీ

Telugu BOX Office

 

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న   విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రంలోని మోదీ సర్కారు కొత్త ఊపిరిలూదింది. కొడిగట్టిన దీపంలా మిణుకుమిణుకుమంటున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఉజ్వలంగా వెలిగించేందుకు ఆర్థిక ఇంధనాన్ని అందించింది. ఎలాంటి ఒడుదొడుకులూ లేకుండా ప్లాంట్‌ను పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించేందుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ దీన్ని ఆమోదించింది. తద్వారా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను నిలబెట్టడంలో ‘ఉక్కు’ సంకల్పాన్ని చాటింది. ఈ ప్యాకేజీ వివరాలను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి.. పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఉక్కు, భారీపరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మలతో కలిసి ప్రకటించారు.

 

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ని నిలబెట్టడానికే ఈ ప్యాకేజీ ప్రకటించినట్లు కుమారస్వామి తెలిపారు. ఇకపై విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అన్నదే ఉండదని భరోసా ఇచ్చారు. ప్రైవేటీకరించకూడదన్న లక్ష్యంతోనే ఈ కసరత్తు అంతా చేసినట్లు చెప్పారు. సెయిల్‌లో వైజాగ్‌ స్టీల్‌ విలీనం అంశం ప్రస్తుతానికి తమ ముందు లేదని పునరుద్ఘాటించారు. తిరుమల శ్రీనివాసుడి ఆశీస్సులతో విశాఖపట్నం ప్లాంట్‌ను ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే నం.1గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈ ప్యాకేజీలో రూ.10,300 కోట్లు ఈక్విటీ కేపిటల్‌గా, రూ.1,140 కోట్ల వర్కింగ్‌ కేపిటల్‌ లోన్‌ను 7% నాన్‌క్యుములేటివ్‌ ప్రిఫరెన్స్‌ షేర్‌ కేపిటల్‌గా సమకూరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ యథాతథంగా నడవడానికి వీలుగా ఈ మొత్తాన్ని 10 ఏళ్ల తర్వాత రిడీమ్‌ చేయనున్నట్లు ప్రకటించారు.

ఏపీ ప్రజలు ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పును ఇలా గౌరవించుకుంటున్నామని కుమారస్వామి అన్నారు. ‘విశాఖ ఉక్కు బ్యాంకులకు రూ.18 వేల కోట్లు, మెటీరియల్‌ సరఫరాదారులకు రూ.17 వేల కోట్ల దాకా చెల్లించాల్సి ఉంది. వాటన్నింటినీ అధిగమించడానికి తొలి ప్యాకేజీ ప్రకటించామని తెలిపారు. ఈ సంస్థకు ఇప్పటికే ఒడిశాలో కేప్టివ్‌ మైన్‌ ఉన్నా అక్కడ ఇంకా తవ్వకాలు ప్రారంభించలేదన్నారు. వచ్చే ఆగస్టు నాటికి 3 ఫర్నేస్‌లతో 92% ఉత్పత్తి సామర్థ్యంతో నడపడాన్ని సవాల్‌గా తీసుకున్నామని… మూడు ఫర్నేస్‌లు ప్రారంభమైతే ఆరు నెలలుగా తాము పడిన కష్టానికి ఫలితం దక్కుతుందన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారం కోసం కేంద్రప్రభుత్వం రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజి ప్రకటించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున ఆయన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రత్యేక శ్రద్ధతో దీన్ని సాకారం చేశారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో డబుల్‌ ఫలితాలు వస్తాయనడానికి ఇది నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేల కుటుంబాలకు కొత్త ఆశను కలిగిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల నిబద్ధత, ఆత్మనిర్భర్‌ భారత్‌పై ప్రధాని మోదీ దార్శనికతకు రాష్ట్ర ప్రజలమంతా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు.

Share This Article
Leave a comment