వాహనదారులకు బిల్ అలర్ట్… ఐదుకి మించి చలాన్లు ఉంటే లైసెన్సు రద్దు!

Telugu BOX Office

వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇకపై తగిన మూల్యం చెల్లించక తప్పదు. చలాన్‌ పడితే పోలీసులు ఆపినప్పుడు చూద్దాంలే అనుకుంటే కుదరదు. ఇక నుంచి 45 రోజుల్లోగా కట్టేయాలి లేదా మీ తప్పేమీ లేకుంటే అప్పీల్‌ చేసుకోవాలి. అంతకుమించి ఆలస్యం చేస్తే మీ బండిని అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు.. డ్రైవింగ్‌ లైసెన్సు రెన్యువల్‌ కాకపోవచ్చు. ఐదుకి మించి చలాన్లు ఉంటే ఏకంగా లైసెన్సే రద్దవ్వచ్చు. సెంట్రల్‌ మోటారు వెహికిల్స్‌ రూల్స్‌-1989లో కేంద్ర రవాణాశాఖ ఈ కీలక సవరణలను ప్రతిపాదించింది. గతంలో చలాన్లపై చర్యల అంశం సవివరంగా లేకపోవడంతో కొత్తగా పలు కఠిన నిబంధనల్ని కేంద్ర రవాణాశాఖ తీసుకొచ్చింది. ఈ మేరకు డ్రాఫ్ట్‌ రూల్స్‌ నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్‌ చేయడం వంటి అంశాలను డిజిటల్‌ మానిటరింగ్, ఆటోమేషన్‌ ఆధారంగా వేగవంతం చేయాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారుకు సంబంధిత అధికారులు మూడురోజుల్లోగా ఎలక్ట్రానిక్‌ రూపంలో నోటీసు జారీ చేయాలని, ఫిజికల్‌ రూపంలో 15 రోజుల్లోగా నోటీసు పంపాలని స్పష్టం చేసింది.

 ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే దిల్లీలో రహదారి రవాణా మంత్రిత్వశాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. comments-morth@gov.in కు ఈ-మెయిల్‌ కూడా చేయొచ్చని తెలిపింది.

 

కొత్తగా ప్రతిపాదించిన రూల్స్‌

  • ఎంవీ(మోటారు వెహికిల్‌) యాక్టు కింద ఒక వాహనంపై ఐదు, అంతకంటే ఎక్కువ చలాన్లు జారీ అయితే డ్రైవింగ్‌ లైసెన్సును సంబంధిత అథార్టీ సస్పెండ్‌ చేయొచ్చు. ఇప్పటికే ఉన్న నిబంధనలూ కొనసాగుతాయి.
  • ప్రస్తుతం 90 రోజుల్లోగా చలాన్‌ కట్టాలి. కొత్త నిబంధనల్లో చలాన్‌ చెల్లింపు గడువును 45 రోజులకు తగ్గించారు.
  • ఆలస్యం చేస్తే.. ఆ వాహనంపై రవాణాశాఖ ఎలాంటి లావాదేవీలను అనుమతించదు. దీనివల్ల దానిని ఎవరికీ విక్రయించలేరు. లైసెన్సులో చిరునామా, పేరు మార్పుతోపాటు రెన్యువల్‌ కూడా కుదరదు.
  • చలాన్‌ కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ప్రస్తుతం చలాన్లు వాహన యజమాని పేరుతో జారీ అవుతున్నాయి. ఇకపై ఆ సమయంలో యజమాని వాహనం నడపలేదని నిరూపిస్తే.. డ్రైవింగ్‌ చేసిన వ్యక్తిని బాధ్యుడిని చేస్తారు.
Share This Article
Leave a Comment