ఆమె ఇక లేదని వైద్యులు నిర్ధారించారు. కుటుంబసభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె అభిమానులు, నాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశాలు కూడా పెట్టేశారు… స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ బయలుదేరింది. కానీ, దారిలో జరిగిన ఒక చిన్న కుదుపు ఆ కుటుంబాన్ని మహదానందంలో ముంచెత్తింది. చనిపోయిందనుకున్న మహిళలో ఒక్కసారిగా ఊపిరి పోసి, మృత్యుంజయురాలిగా నిలబెట్టింది. సినిమాలను తలపించే ఈ అద్భుత సంఘటన ఏలూరు జిల్లాలో వెలుగుచూసింది.

ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నం గ్రామానికి చెందిన మాజీ సర్పంచి, రాజకీయ నాయకురాలు గురజాల రామతులసి గతకొంతకాలంగా తీవ్ర కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఆమె ఆరోగ్యం విషమించడంతో ఏలూరులోని ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, పరిస్థితి క్షీణించడంతో బుధవారం నాడే వైద్యులు ఆమె కోలుకోవడం కష్టమని వెల్లడించారు. గురువారం తెల్లవారుజామున వెంటిలేటర్‌పై సీపీఆర్‌తో సహా అందుబాటులో ఉన్న అన్ని అత్యవసర వైద్య సేవలు అందించినప్పటికీ, పల్స్ పూర్తిగా పడిపోవడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయి, భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు ప్రైవేటు అంబులెన్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. రామతులసి మరణవార్త తెలుసుకున్న పలువురు నాయకులు, గ్రామస్థులు సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తూ పోస్టులు పెట్టారు.
రోడ్డు గుంతే… వరంలా మారింది
కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగి మృతదేహంతో భుజబలపట్నం వైపు బయలుదేరారు. అంబులెన్స్ మండవల్లి మండలం పులపర్రు సమీపానికి వచ్చేసరికి, ఎదురుగా వస్తున్న ఒక బైక్‌ను తప్పించే క్రమంలో డ్రైవర్ వాహనాన్ని పక్కకు తిప్పగా.. అంబులెన్స్ రోడ్డుపై ఉన్న ఒక పెద్ద గుంతలో పడి గట్టిగా కుదుపునకు గురైంది. ఆ కుదుపు దెబ్బకు అప్పటివరకు చలనం లేకుండా ఉన్న రామతులసి శరీరంలో ఒక్కసారిగా కదలికలు రావడం గమనించి కుటుంబసభ్యులు తీవ్ర ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి లోనయ్యారు.
గంటల వ్యవధిలోనే శోకం నుండి ఆనందం
ఆమెలో జీవం ఉందని గ్రహించిన వెంటనే బంధువులు దగ్గర్లోని మరొక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమికంగా పరీక్షించిన వైద్యులు కొన ఊపిరితో ఉన్నారని చెప్పడంతో, వెంటనే ఏలూరు సర్వజన ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ జీజీహెచ్ వైద్య బృందం వెంటనే అత్యవసర చికిత్స ప్రారంభించింది. వైద్యుల నిరంతర శ్రమతో సాయంత్రానికి ఆమె ఆరోగ్యం నిలకడగా మారి, సాధారణ స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వైద్యులు తెలిపారు. చనిపోయారనుకున్న తమ ఇంట్లోని వ్యక్తి ప్రాణాలతో తిరిగొచ్చి కోలుకోవడంతో రామతులసి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందబాష్పాలతో పండుగ చేసుకుంటున్నారు.
