Amaravati: అమరావతికి రూ.15వేల కోట్లు.. బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు

Telugu BOX Office

ఐదేళ్లుగా కేంద్ర బడ్జెట్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌’ అన్న మాటే గట్టిగా వినిపించలేదు. తాజాగా ఏపీలో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడం.. కేంద్రంలోనూ టీడీపీ మద్దతుతోనే ఎన్డీయే మూడోసారి అధికారంలోకి రావడంతో పరిస్థితులు మారాయి. ఇన్నేళ్లకు తొలిసారిగా కేంద్ర బడ్జెట్‌లో ‘ఆంధ్రప్రదేశ్‌’ మాట పలుమార్లు మార్మోగింది. ఎప్పుడో అటకెక్కించిన ‘రాష్ట్ర పునర్విభజన చట్టం’… రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లకు మళ్లీ లోక్‌సభలో తెరపైకి వచ్చింది. నవ్యాంధ్రకు రెండు కళ్లలాంటి రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఆర్థిక అభయం లభించింది. విభజన చట్టంలో ప్రస్తావించినట్లుగా… వెనుకబడిన జిల్లాలకు ఆపన్న హస్తం అందిస్తామని కేంద్రం ప్రకటించింది. మొత్తంగా చూస్తే… ఐదేళ్లలో తొలిసారిగా కేంద్ర బడ్జెట్‌ రాష్ట్ర ప్రజలకు ఆనందాన్ని పంచిందనే చెప్పాలి.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఓట్లు కుమ్మరిస్తే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో వరాల వాన కురిపించారు. ఎన్డీయే కూటమికి కనీవినీ ఎరగని విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్‌కు.. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గతంలో ఏ బడ్జెట్‌లో లేని విధంగా ఒక ప్రత్యేక పేరా పెట్టి మరీ నిధులు కేటాయించింది. రాష్ట్రానికి రెండు కళ్లలాంటి అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు వెన్నుదన్నుగా నిలుస్తామని ఘనంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 4న తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలను కలిసి చేసిన విజ్ఞప్తులను దాదాపు యథాతథంగా ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో చేర్చి, నిధులు కేటాయించడం విశేషం. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఈ ఏడాది రూ.15 వేల కోట్లు సమకూరుస్తామని, పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన మద్దతుగా నిలిచిన బిహార్, ఆంధ్రప్రదేశ్‌లకు ఈ బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసి, అక్కడి ప్రజల రుణం తీర్చుకొనే ప్రయత్నం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేయడానికి మా ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రయత్నాలు చేసిందని చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. వివిధ అభివృద్ధి ఏజెన్సీల ద్వారా ఈ ఏడాదే ఈ నిధులు అందిస్తామని చెప్పారు. రానున్న సంవత్సరాల్లో అదనపు నిధులు కూడా సమకూరుస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు, ఆ రాష్ట్ర రైతులకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించడానికి.. వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తిచేయడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం కింద పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించడానికి వీలుగా విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని కొప్పర్తి నోడ్, హైదరాబాద్‌- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లోని ఓర్వకల్లు నోడ్‌లకు అత్యవసర మౌలిక వసతులైన నీరు, విద్యుత్తు, రైల్వే, రహదారి కల్పనకు నిధులు అందిస్తాం. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు అవసరమైన మూలధన వ్యయం కోసం ఈ ఏడాది అదనపు కేటాయింపులు చేస్తామన్నారు. విభజన చట్టంలో చెప్పినట్లుగా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రల్లో వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు అందిస్తామని ప్రకటించారు.

గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు చేసినంత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదే ప్రకటించడం విశేషం. ఇదివరకు ఐఐటీకి రూ.1,022, ఐఐఎస్‌ఈఆర్‌కు రూ.1,183 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.24 కోట్లు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.135 కోట్లు, ఎయిమ్స్‌కు రూ.1,320 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు, వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.1,050 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.15,146 కోట్లు కలిపి రూ.22,380 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఒక్క ఏడాదిలోనే అమరావతికి రూ.15 వేల కోట్లు సమకూరుస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తికి అవసరమైన రూ.12,157 కోట్లు ఇవ్వడానికీ కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదివరకు వెనుకబడిన జిల్లాల జాబితాలో రాయలసీమలోని నాలుగు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు కలిపి మొత్తం ఏడు జిల్లాలకు ఏటా రూ.50 కోట్ల చొప్పున రూ.350 కోట్లు మాత్రమే సమకూర్చారు. ఇప్పుడు ప్రకాశం జిల్లాను కూడా చేర్చడంతో మరో రూ.50 కోట్లు అదనంగా లభించే అవకాశం ఉంది. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక నోడ్‌లకు అవసరమైన రైలు, రోడ్డు, విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పడం వల్ల ఆ ప్రాంతంలో పారిశ్రామికీకరణ వేగం పుంజుకోనుంది. పూర్వోదయ ప్రణాళిక కింద రాష్ట్రాన్ని చేర్చడం వల్ల తీరప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దఎత్తున నిధులు లభించే అవకాశం ఉంది. మచిలీపట్నం బీపీసీఎల్‌ రిఫైనరీపై ఆ సంస్థ త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉందని ఎంపీలు పేర్కొంటున్నారు.

2014 ఎన్నికల్లో ఎన్టీయే కూటమితో కలిసి పోటీచేసిన చంద్రబాబు.. పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేస్తేనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని పట్టుదల ప్రదర్శించారు. దీంతో మోదీ తన తొలి కేబినెట్లోనే ముంపు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. వెనువెంటనే రెండుసార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి నిధులపై ప్రధానమంత్రి, ఇతర కేంద్రమంత్రులతో చర్చించారు. చంద్రబాబు చేసిన కృషి ఈ బడ్జెట్లో స్పష్టం కనిపించింది.

 

ఈ నెల 4న ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడు అంశాలతో వినతిపత్రం అందజేశారు.

1. కొంతకాలం పాటు రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనందించాలి.
2. పోలవరం ప్రాజెక్టు ప్రారంభానికి కేంద్రం మద్దతు ఇవ్వాలి.
3. రాజధాని నగరం అమరావతిలో ప్రభుత్వ కార్యాలయ సముదాయాలు, కీలకమైన మౌలిక వసతుల నిర్మాణం పూర్తి చేయడానికి సమగ్రమైన ఆర్థిక మద్దతు అందించాలి.
4. పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
5. రహదారులు, వంతెనలు, సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల్లాంటి ముఖ్యమైన పనులు చేపట్టడానికి అవసరమైన మూలధన వ్యయం కోసం అదనపు నిధులు కేటాయించాలి.
6. బుందేల్‌ఖండ్‌ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక మద్దతు ఇవ్వాలి.
7. దుగరాజపట్నం పోర్టు అభివృద్ధి కోసం రాష్ట్రానికి సహకారం అందించాలి.

ఇందులో చివరి అంశం తప్ప మొదటి ఆరు అంశాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.

కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు స్పందిస్తూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉందని, ఇది ప్రగతిశీల బడ్జెట్ అని కొనియాడారు. తన ఢిల్లీ పర్యటనల సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కేంద్రం ముందు ఉంచిన ప్రతిపాదనలు ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి నిధులు ప్రకటించడం వల్ల ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయని వెల్లడించారు. కేంద్రం అండగా ఉంది అనే భావనతో యాక్టివిటీ మరింత పెరుగుతుందని…ఈ కారణంగా రాష్ట్రానికి పన్నుల రూపేణా ఆదాయం లభిస్తుందని, నిధులు ఏ రూపేణా వచ్చినా, అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం వేగం పుంజుకోవాలంటే ఈ నిధులు ఎంతో ఉపయోగ పడతాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంత మేర నిధులు అని బడ్జెట్‌లో పెట్టకపోయినా పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్రం వెల్లడించడం సంతోషమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Share This Article
Leave a comment