కూటమి ప్రభుత్వ పాలనలో నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఏరోస్పేస్, డిఫెన్స్ (రక్షణ) రంగాలకు ఆంధ్రప్రదేశ్ సరికొత్త చిరునామాగా అవతరిస్తోంది. ఈ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన “ఏరోస్పేస్ & డిఫెన్స్ పాలసీ 4.0” అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో ఏకంగా రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి.
కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.27,610 కోట్ల విలువైన భారీ పెట్టుబడులకు ఆమోదం తెలపడం ఒక చారిత్రాత్మక మైలురాయి. దీని ద్వారా సుమారు 24 దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో కొలువుదీరనున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 21,349 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే అత్యధిక శాతం కంపెనీలు తమ నిర్మాణ పనులను వేగవంతం చేశాయి. మరో రెండేళ్లలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుంది.

వ్యూహాత్మకంగా 6 అత్యాధునిక క్లస్టర్లు!
పరిశ్రమలకు అవసరమైన పూర్తిస్థాయి మౌలిక వసతులు (Eco-system) కల్పించేందుకు ప్రభుత్వం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలకు అనుసంధానంగా ఉండేలా సుమారు 23,000 ఎకరాల్లో 6 ప్రత్యేక క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది:
- స్పేస్ సిటీ (తిరుపతి జిల్లా): రౌతుసురమాలలో 2,500 ఎకరాల్లో రాకెట్ లాంచింగ్, లాంచ్ వెహికల్స్ తయారీతో పాటు రీసెర్చ్ & డెవలప్‌మెంట్ (R&D) హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు.
- ఏవియేషన్ హబ్ (ప్రకాశం జిల్లా): దొనకొండ పరిధిలో విమానాల విడిభాగాల (Aircraft Components) తయారీ పరిశ్రమల ఏర్పాటు.
- మెరైన్ క్లస్టర్ (ఉత్తరాంధ్ర – కోస్తా): విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో 3,000 ఎకరాల్లో నౌకాయాన రంగ పరిశ్రమల అభివృద్ధి.
- క్షిపణుల హబ్ (ఎన్టీఆర్ జిల్లా): జగ్గయ్యపేట పరిధిలో 3,000 ఎకరాల్లో క్షిపణులు, మందుగుండు సామగ్రి తయారీ క్లస్టర్.
- డ్రోన్ వ్యాలీ (కర్నూలు జిల్లా): 600 ఎకరాల్లో అన్‌మ్యాన్డ్ డ్రోన్ల తయారీ, పరిశోధనల కోసం ప్రత్యేక జోన్.
- ఎలక్ట్రానిక్స్ హబ్ (శ్రీసత్యసాయి జిల్లా): ఏరోస్పేస్, రక్షణ రంగానికి అవసరమైన ఎలక్ట్రానిక్స్ విడిభాగాల క్లస్టర్.
జిల్లాల వారీగా తరలివస్తున్న దిగ్గజాలు:
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశీ ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి:
- శ్రీసత్యసాయి జిల్లా: పుట్టపర్తి వద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ DRDO ప్రతిష్టాత్మక ‘అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్’ (AMCA) ప్రాజెక్టును చేపట్టనుంది. అలాగే భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజీస్, HFCL, BEL, ఆస్ట్రోబేస్ స్పేస్ వంటి సంస్థలు కలిసి అత్యధికంగా రూ.21,210 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.
- నెల్లూరు జిల్లా: అనంత్ టెక్నాలజీస్, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్, సాగర్ డిఫెన్స్ వంటి సంస్థలు క్షిపణులు, మారిటైమ్ ప్రాజెక్టుల కోసం రూ.1,765 కోట్లు వెచ్చిస్తున్నాయి.
- ప్రకాశం & అనకాపల్లి: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ప్రకాశం జిల్లాలో ఎయిర్‌క్రాఫ్ట్ కాంపోనెంట్స్ కోసం రూ.978 కోట్లు, అనకాపల్లిలో రూ.489 కోట్ల పెట్టుబడులతో యూనిట్లను స్థాపిస్తోంది.
- కృష్ణా & చిత్తూరు: కృష్ణా జిల్లాలో రూ.840 కోట్లతో ఐకామ్ డిఫెన్స్ సంస్థ, చిత్తూరులో రూ.159 కోట్లతో పయనీర్ క్లీన్ ఎనర్జీస్ సంస్థలు తమ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి.
- అనంతపురం & తిరుపతి: అనంతపురంలో సరళ్ ఏవియేషన్, స్పేస్‌ఫీల్డ్స్ సంస్థలు రూ.376 కోట్లతో రాగా… తిరుపతి స్పేస్ సిటీలో స్కైరూట్, ఎథర్నల్ ఎక్స్‌ప్లోరేషన్ సంస్థలు రాకెట్ లాంచింగ్ రంగంలో అడుగుపెడుతున్నాయి.
- కర్నూలు & ఎన్టీఆర్ జిల్లా: కర్నూలులో ఆల్గోబొటిక్స్, డ్రోగో వంటి డ్రోన్ తయారీ సంస్థలు రూ.407 కోట్లతో కార్యకలాపాలు ప్రారంభించగా, జగ్గయ్యపేటలో క్షిపణుల రంగానికి అవసరమైన మౌలిక వసతులను ప్రభుత్వం వేగంగా కల్పిస్తోంది.
పారిశ్రామిక అనుకూల విధానాలు, వేగవంతమైన అనుమతులు, భౌగోళిక అనుకూలతలే రక్షణ రంగ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తున్నాయి. రాబోయే 2-3 ఏళ్లలో ఈ ప్రాజెక్టులన్నీ అందుబాటులోకి వస్తే, దేశ రక్షణ రంగ అవసరాలను తీర్చడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవడం ఖాయం.
