పట్టణ ప్రాంతాల్లో భూముల లావాదేవీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను సవరించాలని నిర్ణయిస్తూ, సవరించిన ధరలను ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తేవాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను ఏటా ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి సవరించుకునే అవకాశం ఉంది. అలాగే నిర్మాణాల విలువలను కూడా ప్రతి ఏడాది పెంచుకోవచ్చు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది ఫిబ్రవరిలోనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలను సమీక్షించింది. వైకాపా ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రాంతాల్లో అశాస్త్రీయంగా పెంచిన మార్కెట్ విలువలను పునఃపరిశీలించి, కొన్నిచోట్ల తగ్గించగా.. మరికొన్నిచోట్ల యథాతథంగా కొనసాగించారు. అదే సమయంలో అవసరమైన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా విలువలను పెంచారు.
ఈ ఏడాది మాత్రం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే భూముల మార్కెట్ విలువలను సవరించాలని నిర్ణయించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన మార్కెట్ విలువలను ఫిబ్రవరి 1 నుంచి అమలు చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జిల్లాల వారీగా స్థానిక పరిస్థితులు, లావాదేవీల స్థాయి, డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఈ సవరణలపై నిర్ణయం తీసుకోనుంది.
మార్కెట్ విలువల వ్యవస్థను మరింత పారదర్శకంగా, వాస్తవికంగా రూపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో కీలక అడుగు వేయనుంది. రెండు నెలల్లో మార్కెట్ విలువల ఆధునికీకరణకు సంబంధించి సమగ్ర విధానాన్ని రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీని ద్వారా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో స్పష్టత పెరగడంతో పాటు, ఆదాయ వృద్ధికి కూడా దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రిజిస్ట్రేషన్ ఆదాయాల పరంగా కూడా రాష్ట్రానికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ రుసుముల రూపంలో రూ.8,843 కోట్లు వసూలయ్యాయి. ఇక 2025–26 సంవత్సరానికి రూ.11,221 కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. జనవరి 9 నాటికి ఇప్పటికే రూ.8,391 కోట్లు వసూలవడం గమనార్హం. సగటు ఆదాయ వృద్ధి రేటు 27.98 శాతంగా ఉండగా, స్టాంపు రుసుముల మినహాయింపుల రూపంలో రూ.714 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరించింది.
పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ విలువల సవరణతో రియల్ ఎస్టేట్ రంగంలో స్పష్టత పెరగడమే కాకుండా, ప్రభుత్వ ఆదాయ వనరులు మరింత బలోపేతం కావాలని ప్రభుత్వం ఆశిస్తోంది. అదే సమయంలో ప్రజలపై అనవసర భారం పడకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడమే ఈ సవరణల ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.
