హీరోల సంగతి ఎలా ఉన్నా హీరోయిన్స్ మాత్రం రకరకాల పాత్రలు చేస్తుంటారు. తొలినాళ్లలో హీరోయిన్‌గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత తల్లిగా, వదినగా.. వయసు మీద పడే కొద్దీ పాత్రల ఎంపిక పూర్తిగా మారిపోతూ ఉంటుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఏ సినీ పరిశ్రమ అయినా ఇందుకు అతీతం కాదు. కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయలేక సినిమాలకు ముగింపు పలికినవాళ్లూ ఉన్నారు.
అసలు విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవితో హీరోయిన్‌గా స్టెప్పులేసి ఓ వెలుగు వెలిగిన అగ్రనటి కాలక్రమంలో చెల్లి, అమ్మగా నటించింది. ఆమె మరెవరో కాదు సీనినర్ నటి సుజాత. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో జత కట్టిన సుజాత దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించింది. 1980లో కృష్ణంరాజు, చిరంజీవి కాంబినేషన్‌లో ప్రేమతరంగాలు అనే మల్టీస్టారర్ మూవీ వచ్చింది. ఇందులో చిరుకు జోడీగా నటించింది సుజాత.
రెండేళ్ల తర్వాత 1982లో సీతాదేవి చిత్రంలో చిరుకు చెల్లిగా నటించింది. దీంతో అవాక్కైన ప్రేక్షకులు ప్రేయసి కాస్తా చెల్లెలు అయిపోయిందేంటి అనుకోగా… 13ఏళ్లు తిరిగాక ఏకంగా మెగాస్టార్‌కు తల్లిగా మారిపోయింది సుజాత. 1995లో బిగ్‌బాస్ మూవీలో చిరు తల్లిగా కనిపించింది. చిరుకు చెల్లెలిగా నటించి రొమాంటిక్ స్టెప్పులేసినవారు ఉన్నారు కానీ ఇలా హీరోయిన్, చెల్లి, అమ్మ.. అన్ని రకాల పాత్రలను పోషించిన ఏకైక నటి సుజాత కావడం విశేషం. నటిగా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆమె అనారోగ్యంతో బాధపడుతూ 2011 ఏప్రిల్ 6న కన్నుమూసింది.