తేనెటీగల పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది తీయని తేనె. ఆరోగ్యానికి మేలు చేసే ఆ తేనె కోసం తేనెటీగలు చేసే కష్టం తెలిసిందే. కానీ అదే తేనెటీగలు తయారుచేసే మరో ఉత్పత్తి… ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌ను ఆశ్చర్యపరుస్తోంది. తేనె కాదు… విషం! అవును, తేనెటీగల విషం అంటేనే భయపడతాం. కానీ అదే విషం ఇప్పుడు బంగారానికన్నా ఖరీదైన విలువను సంపాదించుకుంది. పేరు ‘బీ వీనమ్’ లేదా ‘ఎపిటాక్సిన్’. దీని ధర వింటే నోరు తెరుచుకోవాల్సిందే… ఎందుకంటే కిలో బీ వీనమ్ ధర రూ. కోటికి పైమాటే!

సాధారణంగా కిలో తేనె ధర ఐదొందల నుంచి వెయ్యి, మరీ నాణ్యమైనదైతే రెండు వేల రూపాయల వరకే ఉంటుంది. కానీ తేనెటీగ కుట్టినప్పుడు మనల్ని విలవిల్లాడించే ఆ విషం మాత్రం గ్రాముకు పదివేల నుంచి పాతికవేల రూపాయల వరకు పలుకుతోంది. అంటే కిలో లెక్కన చూసుకుంటే బంగారం ధరను కూడా దాటిపోతోంది. విషాన్ని ఇంత ఖరీదుగా ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? దీనిలో అంత ప్రత్యేకత ఏముంది? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.
బీ వీనమ్ అంటే ఏమిటి?
తేనెటీగ మనల్ని కుట్టినప్పుడు దాని ముల్లు ద్వారా మన శరీరంలోకి ప్రవేశించే విషాన్నే బీ వీనమ్ అంటారు. శాస్త్రీయంగా దీన్ని ఎపిటాక్సిన్‌గా పిలుస్తారు. ఇదే విషం మనకు తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. కానీ సరైన మోతాదులో, సరైన విధానంలో ఉపయోగిస్తే అదే విషం ప్రాణాలను కాపాడే ఔషధంగా మారుతుంది. చూడటానికి ఇది తెల్లని పాలపొడిలా కనిపిస్తుంది.
విషాన్ని ఎలా సేకరిస్తారు?
తేనెటీగలను చంపకుండా, వాటికి హాని కలగకుండా ఈ విషాన్ని సేకరించడం అత్యంత కష్టమైన ప్రక్రియ. దీనికోసం తేనెటీగల గూట్ల దగ్గర ‘వీనమ్ ఎక్స్‌ట్రాక్టర్’ అనే ప్రత్యేక పరికరాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది అతి తక్కువ కరెంట్‌తో పనిచేస్తుంది. తేనెటీగలు గూట్లోకి వెళ్లే దారిలో ఈ పరికరాన్ని ఉంచుతారు. స్వల్ప షాక్ ఇవ్వగానే తేనెటీగలు తమను తాము రక్షించుకోవడానికి విషాన్ని విడుదల చేస్తాయి.
సాధారణంగా తేనెటీగ మనల్ని కుట్టిన తర్వాత అది కూడా చనిపోతుంది. కానీ ఈ పద్ధతిలో మాత్రం తేనెటీగకు ఎలాంటి నష్టం జరగదు. అవి విడుదల చేసిన విషం కొద్ది సేపటికి తెల్లని క్రిస్టల్‌లా మారుతుంది. చిన్న బ్లేడ్‌లాంటి పరికరంతో దాన్ని జాగ్రత్తగా సేకరిస్తారు. ఇదే బీ వీనమ్. ఈ ప్రక్రియ గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీనియర్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ వి. సునీత వివరించారు.
ఎందుకు ఇంత ఖరీదు?
బీ వీనమ్ తయారీ అంత సులువైన పని కాదు. ఒక్కో తేనెటీగ ఒక్కసారి కేవలం 0.1 మిల్లీగ్రాముల విషాన్ని మాత్రమే విడుదల చేస్తుంది. పైగా ఈ సేకరణ వారానికి ఒక్కసారే చేయాలి. ఇరవై పెట్టెలు ఉన్నా మొత్తం కలిపి ఒక్క గ్రాము బీ వీనమ్ మాత్రమే లభిస్తుంది. ఈ శ్రమ, ఓపిక, సమయం కారణంగానే దీని ధర ఆకాశాన్ని తాకుతోంది.
వైద్యం, కాస్మెటిక్స్‌లో అద్భుత వినియోగం
ఇంత ఖరీదైన బీ వీనమ్‌లో మెలిటిన్ అనే శక్తివంతమైన పెప్టైడ్ ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. అందుకే క్యాన్సర్ చికిత్సలో, ఆర్థరైటిస్ వంటి వ్యాధుల నివారణలో, నొప్పి తగ్గించే మందుల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, యాంటీ ఏజింగ్ క్రీమ్‌లు, సీరమ్‌లు, మాయిశ్చరైజర్లు, పెయిన్ రిలీఫ్ క్రీమ్‌లు, ఫేస్‌మాస్క్‌లు, టూత్‌పేస్ట్‌లు, ప్యాచ్‌లు వంటి అనేక కాస్మెటిక్ ఉత్పత్తుల్లోనూ బీ వీనమ్ కీలకంగా మారింది. వైద్యుల పర్యవేక్షణలో వాడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.
రైతులకు బంగారు గని
అమెరికా, చైనా వంటి దేశాల్లో బీ వీనమ్ ఉత్పత్తిలో రైతులు ముందంజలో ఉన్నారు. అక్కడ కొందరు రైతులు ఏడాదికి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. భారత్‌లోనూ ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. గుజరాత్, కేరళ, కర్ణాటక రైతులు ఇప్పటికే బీ వీనమ్ తయారీలో మంచి ఆదాయం పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌లోని కృషి విజ్ఞాన్ కేంద్రాల ద్వారా దాదాపు ఐదొందల మంది రైతులు శిక్షణ పొంది ఈ రంగంలోకి అడుగుపెట్టారు.
తేనెతో మొదలైన తేనెటీగ ప్రయాణం… ఇప్పుడు విషంతో రైతుల జీవితాలను తీపిగా మారుస్తోంది. తేనెటీగ కుట్టిందంటే నొప్పి అనుకునే రోజులు పోయాయి. అదే కాటు ఇప్పుడు కోట్ల విలువైన అవకాశంగా మారింది.
