ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. యుఎస్ హోంలాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) విద్యార్థుల నివాస కాలపరిమితిపై సరికొత్త మార్గదర్శకాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై విద్యార్థులు అమెరికాలో ఉండటానికి గరిష్టంగా నాలుగేళ్ల కాలపరిమితిని మాత్రమే విధిస్తున్నారు. దీనివల్ల ప్రస్తుతం అమెరికాలో వివిధ కోర్సులు అభ్యసిస్తున్న సుమారు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

‘Duration of Status’ రద్దు.. వీసా పొడిగింపు తప్పనిసరి!
గతంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. ఎఫ్1 (F1) వీసాపై అమెరికా వెళ్లిన విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేంత వరకు ‘డ్యురేషన్ ఆఫ్ స్టేటస్’ కింద నిరభ్యంతరంగా అక్కడే నివసించే వీలుండేది. కోర్సు కాలపరిమితితో సంబంధం లేకుండా చదువు ముగిసేవరకు వీసా చెల్లేది. అయితే తాజాగా ఈ పాత విధానానికి స్వస్తి పలికారు. కొత్త రూల్స్ ప్రకారం, చదువు పూర్తి కావడానికి నాలుగేళ్లకు మించి సమయం పడితే (ఉదాహరణకు పీహెచ్‌డీ లేదా మెడికల్ కోర్సులు), విద్యార్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మళ్లీ ప్రత్యేకంగా అనుమతి (వీసా ఎక్స్‌టెన్షన్) తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం విద్యార్థులకే కాకుండా, జే1 (J1) వీసాలపై వచ్చే ఎక్స్ఛేంజ్ విజిటర్లకు, అలాగే ఐ (I) వీసాలపై వచ్చే అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు కూడా ఇకపై నిర్దిష్ట కాలపరిమితి నిబంధనలను వర్తింపజేయనున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన యూఎస్ కాంగ్రెస్ పరిశీలనలో ఉందని, అక్కడ పూర్తిస్థాయి ఆమోదం పొందిన తర్వాత ఇది అధికారికంగా అమల్లోకి రానుందని తెలుస్తోంది.
ప్రభుత్వ పథకాలు పొందితే గ్రీన్‌కార్డ్ కష్టమే!
ఇదే సమయంలో వలసదారులకు షాక్ ఇస్తూ గ్రీన్‌కార్డ్ జారీ ప్రక్రియలోనూ ట్రంప్ ప్రభుత్వం పాత కఠిన నిబంధనలను పునరుద్ధరించింది. ‘పబ్లిక్ ఛార్జ్’ (Public Charge) పేరుతో తీసుకొచ్చిన ఈ విధానం ప్రకారం.. అమెరికాలో నివసిస్తూ అక్కడి ప్రభుత్వ ఉచిత ప్రయోజనాలను పొందే వలసదారులకు గ్రీన్‌కార్డులను తిరస్కరించనున్నారు. అమెరికా ప్రభుత్వం అందించే ఉచిత ఆహార స్టాంపులు (Food Stamps), మెడికెయిడ్ (ఉచిత వైద్య సహాయం), హౌసింగ్ వోచర్లు లేదా ఇతర సంక్షేమ పథకాలను ఉపయోగించుకునే సదరు వ్యక్తులు భవిష్యత్తులో గ్రీన్‌కార్డులు పొందడానికి అర్హులు కారని ఈ పాలసీ స్పష్టం చేస్తోంది. ఈ రెండు కీలక నిర్ణయాలు ఒకేసారి వెలుగులోకి రావడంతో అమెరికాలో స్థిరపడాలని చూస్తున్న వలసదారుల్లో, విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
