ఆ ఒక్క ఘటనే జీవితాన్ని మార్చేసింది.. జుట్టు ఊడి, గొంతు మారినా తగ్గని పట్టుదల

Telugu BOX Office

సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడికి గుర్తింపు రావడం అంత సులువు కాదు. అందులోనూ విలక్షణమైన రూపం, విభిన్నమైన మేనరిజమ్‌తో సౌత్ ఇండియా అంతటా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మొట్ట రాజేంద్రన్. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ సీనియర్ నటుడు, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లోని చేదు అనుభవాలను, ఆ తర్వాత సాధించిన విజయాలను పంచుకున్నారు.

కెమికల్ వాటర్ వల్ల ఊడిపోయిన జుట్టుః

ఒకప్పుడు స్టంట్ మ్యాన్‌గా పనిచేసిన రాజేంద్రన్, నాన్ కడువల్ (తెలుగులో ‘నేనే దేవుడా’) చిత్రంతో పూర్తిస్థాయి నటుడిగా మారారు. అయితే ఆయన ఈ రూపంలోకి మారడం వెనుక ఒక పెద్ద ఘటనే ఉంది. ఒక మలయాళ సినిమా షూటింగ్ సమయంలో సుమారు 15 అడుగుల ఎత్తు నుంచి ఒక నీటి కుంటలోకి దూకాల్సి వచ్చింది. అయితే అది ఫ్యాక్టరీల నుంచి వచ్చిన తీవ్రమైన రసాయన వ్యర్థాలు కలిసిన నీరని ఆయనకు తెలియదు. ఆ నీటిలో మునిగిన కొద్దిరోజులకే శరీరంపై ఉన్న జుట్టుతో పాటు కనుబొమ్మలు కూడా పూర్తిగా ఊడిపోయాయి. అంతేకాకుండా ఆయన గొంతు స్వరంలో కూడా తీవ్రమైన మార్పు వచ్చింది.

దేవుడిలా మారిన దర్శకుడు బాలాః

జుట్టు పోయి, గొంతు మారడంతో తొలుత తీవ్ర మానసిక వేదనకు గురైనప్పటికీ, అదే మార్పు ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. దర్శకుడు బాలా తన ‘నాన్ కడువల్’ చిత్రంలో రాజేంద్రన్‌లోని కొత్త లుక్‌ను చూసి ప్రధాన విలన్ పాత్రను ఇచ్చారు. ఈ సినిమా ఆయనకు నటుడిగా పెద్ద బ్రేక్ ఇచ్చింది. దర్శకుడు బాలాను ఈ సందర్భంగా ఆయన దేవుడితో సమానంగా అభివర్ణించారు. మొదట తన బలహీనత అనుకున్న రూపాన్నే, తర్వాత తన అతిపెద్ద బలంగా మార్చుకున్నట్లు తెలిపారు.

విలన్ నుంచి టాప్ కమెడియన్‌గా

‘నాన్ కడువల్’ చిత్రంతో భయంకరమైన విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజేంద్రన్, ఆ తర్వాత తనలోని కామెడీ యాంగిల్‌ను కూడా పరిచయం చేశారు. ‘బాస్ ఎంగిర భాస్కరన్’ (నేనే అంబానీ), ‘రాజారాణి’ వంటి చిత్రాలతో కామెడీ నటుడిగా ప్రేక్షకులను విపరీతంగా అలరించారు. ప్రత్యేకించి ‘రాజా రాణి’లో ఆయన పండించిన హాస్యం, చెప్పిన సంభాషణలు ప్రేక్షకుల్లో బాగా పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం 67 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ, రాజేంద్రన్ ఇప్పటికీ సిక్స్ ప్యాక్ బాడీతో, అద్భుతమైన ఫిట్‌నెస్‌తో నేటి తరం నటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా చేసే పొట్ట వ్యాయామాలు  తన దినచర్యలో భాగమైపోయాయని, మనం చేసే పనిపై శ్రద్ధ ఉంటే ఫలితం దానంతటదే వస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Share This Article
Leave a Comment