హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్… మెగా ప్రాజెక్టుతో ట్రాఫిక్ నరకానికి ఎండ్ కార్డ్!

Telugu BOX Office

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నిత్యం ట్రాఫిక్ నరకం చూస్తున్న వాహనదారులకు అద్భుతమైన శుభవార్త. నగరంలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ గచ్చిబౌలి ప్రాంతంలో మొట్టమొదటి ‘డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్’ (రెండు అంతస్తుల పైవంతెన) అందుబాటులోకి రాబోతోంది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ  జంక్షన్‌ను పూర్తిగా సిగ్నల్ రహితంగా మార్చేందుకు సైబరాబాద్ నగరపాలక సంస్థ (GHMC) ప్రతిష్టాత్మకంగా ఈ మెగా ప్రాజెక్టును డిజైన్ చేసింది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సగం పిల్లర్ల నిర్మాణం ఇప్పటికే శరవేగంగా పూర్తయింది. ఐటీ హబ్‌లో ట్రాఫిక్ కష్టాలను శాశ్వతంగా దూరం చేసే ఈ పనులను మే 2027 నాటికి ట్రిపుల్ ఐటీ చౌరస్తాలో, అలాగే ఏప్రిల్ 2027 నాటికి ఖాజాగూడ జంక్షన్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కమిషనర్ జి.సృజన స్పష్టం చేశారు. ఇంజినీర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆమె వెల్లడించారు.

బడ్జెట్ వివరాలు

  • ట్రిపుల్ ఐటీ చౌరస్తా ప్రాజెక్టు (3 ఫ్లైఓవర్లు, 1 అండర్ పాస్): రూ. 459 కోట్లు.
  • ఖాజాగూడ చౌరస్తా ప్రాజెక్టు (1 ఫ్లైఓవర్, 1 అండర్ పాస్): రూ. 220 కోట్లు.

ట్రిపుల్ ఐటీ కూడలి వద్ద నాలుగు వైపులా సిగ్నల్స్ లేకుండా వాహనాలు దూసుకెళ్లేలా నిర్మిస్తున్న నిర్మాణాలు:

  • మొదటి అంతస్తు ఫ్లైఓవర్: ISB రోడ్డు నుంచి DLF వైపు ఇరువైపులా (టూ-వే) వాహనాలు వెళ్లేలా 720 మీటర్ల పొడవుతో 4 లైన్ల పైవంతెన.
  • రెండో అంతస్తు ఫ్లైఓవర్ (A): DLF రోడ్డు నుండి లింగంపల్లి వైపు వెళ్లే ప్రయాణికుల కోసం రెండో అంతస్తులో 948 మీటర్ల పొడవుతో 3 లైన్ల పైవంతెన.
  • రెండో అంతస్తు ఫ్లైఓవర్ (B): ISB రోడ్డు నుండి గచ్చిబౌలి వైపు వెళ్లేందుకు వీలుగా రెండో అంతస్తులోనే మరో 1.2 కిలోమీటర్ల పొడవుతో 3 లైన్ల పైవంతెన.
  • భూగర్భ మార్గం (అండర్ పాస్): గచ్చిబౌలి మరియు లింగంపల్లి మధ్య రాకపోకలు సాగించే వారి కోసం 520 మీటర్ల పొడవుతో భారీ 6 లైన్ల అండర్ పాస్.

ఖాజాగూడ జంక్షన్ వద్ద

  • నానక్‌రామ్‌గూడ నుంచి షేక్‌పేట్ వైపు వెళ్లే వాహనాల కోసం 1.08 కిలోమీటర్ల పొడవున 3 లైన్ల ఫ్లైఓవర్.
  • షేక్‌పేట్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లేందుకు 540 మీటర్ల పొడవుతో ఒక అండర్ పాస్.

ప్రయాణికులకు కలిగే లాభాలు

ఈ మెగా ప్రాజెక్ట్ పూర్తిగా అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి, లింగంపల్లి, విప్రో సర్కిల్, కొండాపూర్ ప్రాంతాల మధ్య ప్రయాణించే ఐటీ ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు కనీసం 10 నుండి 15 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. సిగ్నళ్ల వద్ద వేచి ఉండే అవసరం లేకుండా ఐటీ కారిడార్‌లో వాహనాలు సాఫీగా దూసుకెళ్లవచ్చు.

Share This Article
Leave a Comment