మాట నిలబెట్టుకున్న ‘అయ్యగారు’…. అఖిల్‌ను కలిసి కన్నీటి పర్యంతమైన వీరాభిమాని నాగరాజు

Telugu BOX Office

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన వీరాభిమానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ‘అయ్యగారే నెంబర్ వన్’ అనే డైలాగ్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న గుంటూరుకు చెందిన అభిమాని నాగరాజు కల ఎట్టకేలకు నెరవేరింది. బుధవారం రాత్రి (జూలై 15) హీరో అఖిల్‌ను నాగరాజు స్వయంగా కలుసుకున్నారు. తన ఆరాధ్య దైవం లాంటి హీరో కళ్లముందు కనిపించడంతో నాగరాజు భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. అఖిల్ వద్దంటున్నా వినకుండా కాళ్లపై పడి, గట్టిగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ జన్మకు ఈ క్షణం చాలంటూ ఆయన ఉద్వేగానికి లోనైన దృశ్యాలు నెటిజన్లను కదిలిస్తున్నాయి.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అక్కినేని హీరో

గుంటూరుకు చెందిన నాగరాజు అఖిల్ సినిమా విడుదలైన ప్రతిసారీ థియేటర్ల వద్ద చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇటీవల అఖిల్ నటించిన లెనిన్ సినిమా విడుదల సమయంలోనూ నాగరాజు థియేటర్ వద్ద కటౌట్లకు పూజలు చేస్తూ, కొబ్బరికాయలు కొడుతూ చేసిన హంగామా వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ వైరల్ వీడియోలను గమనించిన అఖిల్, గతంలోనే నాగరాజును కలుస్తానని ప్రామిస్ చేశారు. తాజాగా ఆ భేటీకి ముహూర్తం పెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా షేర్ చేసిన ఈ ఎమోషనల్ మీటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

నాగరాజు కేవలం అఖిల్ సినిమా సమయాల్లో మాత్రమే కెమెరాల ముందుకు వస్తుంటారు. మిగతా రోజుల్లో గుంటూరులో రోడ్డు పక్కన పండ్ల వ్యాపారం చేసుకుంటూ చాలా సాదాసీదాగా తన కుటుంబాన్ని పోషించుకుంటారు. సాధారణంగా సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య జరిగే ట్రోలింగ్స్, గొడవలకు నాగరాజు చాలా దూరంగా ఉంటాడు. తనకు వచ్చిన సోషల్ మీడియా పాపులారిటీతో ఈజీగా డబ్బు సంపాదించే అవకాశాలున్నా, నాగరాజు మాత్రం వాటి జోలికి వెళ్లలేదు. ఒక స్వచ్ఛమైన, సాధారణ అభిమానిగానే ఉండడానికి ఇష్టపడే నాగరాజును అఖిల్ ప్రత్యేకంగా పిలిపించి గౌరవించడం పట్ల అక్కినేని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share This Article
Leave a Comment