సౌత్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నటి మీనా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్ననాటే సినీ రంగంలో అడుగుపెట్టి, తరువాత స్టార్ హీరోయిన్గా ఎదిగిన మీనా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ పరిశ్రమల్లో దాదాపు అన్ని స్టార్ హీరోల సరసన నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, కమల్ హాసన్, రజినీకాంత్, మోహన్‌లాల్ వంటి లెజెండరీ నటులతో ఆమె చేసిన సినిమా ప్రయాణం ఇప్పటికీ గుర్తుండిపోయే పాత్రలతో నిండి ఉంది. కుటుంబ జీవితం ప్రారంభమైన తర్వాత కూడా కెరీర్‌ను ఆపకుండా కొనసాగించిన మీనా, సినిమాలు–ఫ్యామిలీ రెండింటినీ సమతూకంగా చూసుకున్నారు. అయితే భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణం ఆమె జీవితాన్ని పూర్తిగా కుదిపేసింది. కానీ ఈ దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకున్నప్పటికీ, కెమెరా ముందుకు వచ్చేటప్పుడు చిరునవ్వుతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కుమార్తె నైనికతో కలిసి సంతోషంగా జీవిస్తున్న ఆమె వ్యక్తిగత జీవితం గురించి అనేక రూమర్లు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి.

రెండో పెళ్లి వార్తలపై మీనా ఫైర్
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో మీనా రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటూ వచ్చిన రూమర్లు ఆమెను తీవ్ర అసహనానికి గురిచేశాయి. కొంతమంది హీరోలు విడాకులు తీసుకుంటే వెంటనే మీనా పేరును లాగుతూ బెంగ పెట్టే విధంగా పోస్టులు రావడం ఆమె మనసుకు గాయమైంది. అందుకే మీనా స్వయంగా స్పందిస్తూ ఇలా క్లారిటీ ఇచ్చారు “నేను నా పాపతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు. ఎవరు విడాకులు తీసుకున్నా నాకు సంబంధం లేకుండా నా పేరు లాగుతున్నారు. ఇవన్నీ పూర్తిగా తప్పు. ప్రస్తుతం నా దృష్టి అన్నీ నా కెరీర్ పైనే” మీనా చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా ఆమెకు మద్దతు తెలుపుతూ, ఇలాంటి రూమర్లు వ్యాప్తి చేయొద్దని కోరుతున్నారు.
సినిమాల పరంగా మీనా బిజీ
కొన్ని వ్యక్తిగత సమస్యలు ఎదురైనా మీనా కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘దృశ్యం 3’ మలయాళ వెర్షన్ షూటింగ్లో పాల్గొంటున్నారు. తమిళంలో ‘మూకుత్తి అమ్మన్ 2’, ‘రౌడీ బేబి’ వంటి ప్రాజెక్టుల్లో కూడా ఆమె నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె ఎంతో సన్నిహితమే. దృశ్యం తెలుగు వెర్షన్లో ఆమె చేసిన పాత్ర ఇప్పటికీ ఫ్యాన్స్‌కు గుర్తుంటుంది. అందువల్ల దృశ్యం 3 తెలుగు వెర్షన్ వస్తే ఆమె మళ్లీ ఆ పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తాను ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారన్న ప్రశ్నకు మీనా ఇలా చెప్పారు “పాప పుట్టి రెండేళ్లకే దృశ్యం కోసం అడిగారు. అప్పట్లో చేయలేకపోయా. కానీ తరువాత కథ నచ్చడంతో ఒప్పుకున్నా. ఇప్పుడూ కూడా కథ బాగుంటేనే చేస్తాను. పాత్రలో సంతృప్తి లేకపోతే నో చెబుతాను.” అంటూ మీనా స్పష్టం చేశారు. స్టార్ హీరోయిన్గా నిలిచినా, జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా… మీనా తనకంటూ ఉన్న గ్రేస్, అభినయం కోల్పోకుండా తిరిగి సినిమాల్లో బిజీ అయ్యారు. రూమర్లకు స్వయంగా క్లారిటీ ఇస్తూ, పూర్తిగా పనిపై దృష్టి పెట్టడం అభిమానులను మరింత సంతోషపరుస్తోంది. మీనా మళ్లీ స్క్రీన్‌పై అదే మెరుపు చూపుతారన్న నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉంది.
