కొందరికి కారం అంటే మమకారం. కారం లేకుండా భోజనం పూర్తి కాలేదనిపించే వారు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటివరకు కారం కేవలం నోటికి రుచిని, భోజనానికి స్పైసీ ఫీలింగ్ ఇస్తుందని మాత్రమే అనుకున్నారు. అయితే తాజాగా చైనాలోని సెచువాన్ ప్రావిన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం మరో సత్యాన్ని బయటపెట్టింది. ఈ పరిశోధన ప్రకారం, కారం తినడం కేవలం రుచికోసం మాత్రమే కాకుండా గుండె ఆరోగ్యం, మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని తేలింది. తరచూ కారం తినే వారిలో గుండెజబ్బులు, స్ట్రోక్స్ వంటి అనారోగ్యాలు దూరంగా ఉండటమే కాకుండా, మరణాల రేటు సుమారు 14 శాతం తగ్గిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

సెచువాన్ శాస్త్రవేత్తలు దాదాపు 50,000 మంది వృద్ధులపై తొమ్మిదేళ్లపాటు ఈ పరిశోధన చేశారు. వారంలో ఆరు రోజులు కారం తినేవారిలో గుండెజబ్బులు తక్కువగా ఉన్నాయని, మెదడులో రక్తం గడ్డకట్టే అవకాశాలు తగ్గాయని వారు గమనించారు. అంటే కారం తినడం దీర్ఘాయుష్షుకు దోహదం చేస్తుందని శాస్త్రవేత్తల అభిప్రాయం. మనము కారం తిన్నప్పుడు నాలుకపై కలిగే చుర్రుమనే అనుభూతి, కేవలం రుచికి సంబంధించినదే కాదు. అదే సమయంలో అది మన నరాల్లో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. దీనంతటికీ కారణం ‘కెప్సేసిన్’ అనే బయోయాక్టివ్ కాంపౌండ్. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ విడుదల చేస్తుంది. దాంతో గుండె కండరాలపై భారం తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం కాపాడబడుతుంది. కారంలో ఉన్న మరో విశేషం ఏమిటంటే, అది శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యం అవుతాయి. డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలను తగ్గించే అవకాశం ఉంది. అదేవిధంగా, కారంలో వాపులను తగ్గించే గుణం ఉండటం వల్ల, శరీరంలో అంతర్గత వాపులు రాకుండా నిరోధిస్తుంది. ఇవి అన్నింటి ఫలితంగానే కారం తినేవారిలో ఆయుష్షు పెరుగుతోందని సెచువాన్ శాస్త్రవేత్తల నివేదిక చెబుతోంది. క్రమం తప్పకుండా కారం తీసుకోవడం వల్ల శరీర రక్షణ వ్యవస్థ బలపడుతుంది.
అయితే ఎంత మంచిదైనా మితంగా తీసుకోవడం తప్పనిసరి. అధికంగా కారం తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్ణం, కడుపు మంట వంటి సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కారం ఆరోగ్యానికి మేలు చేసినా, మితిమీరకుండా నియంత్రణలో తీసుకోవడం మాత్రమే శ్రేయస్కరం. కారం అంటే కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికీ అని ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపితమైంది. గుండెను కాపాడే గుణం, స్ట్రోక్స్ తగ్గించే శక్తి, ఆయుష్షు పెంపు వంటి ప్రయోజనాలు కారంలో ఉన్నాయనడం భోజనప్రియులకు ఆనందకరమైన వార్తే.
