తెలంగాణలో అన్ని రకాల వాహనాల సంఖ్య 1.77 కోట్లు దాటినట్లు రాష్ట్ర రవాణా శాఖ వెల్లడించింది. ఇందులో ప్రతి మూడు వాహనాల్లో రెండు మోటారు సైకిళ్లు కావడం గమనార్హం. కార్లు రెండో స్థానంలో, మూడో స్థానంలో ట్రాక్టర్లు, నాలుగో స్థానంలో గూడ్సు వాహనాలు, ఆటోలు ఐదో స్థానంలో ఉన్నాయి. 2014లో ఉన్న 71.52 లక్షల వాహనాలతో పోలిస్తే ప్రస్తుతం 150 శాతం పెరిగాయి. 2025 మార్చి 31 వరకు రాష్ట్రంలో మొత్తం వాహనాలు 1.73 కోట్లు ఉండగా ఆగస్టు 31 నాటికి ఆ సంఖ్య కోటి 77 లక్షలు దాటింది. రాష్ట్రంలో ఏటా సగటున 9.3 లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. అంటే నెలకు సుమారు 77,500 వాహనాలు వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.. సరకుల్ని రవాణా చేసే గూడ్సు బండ్ల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 6.56 లక్షల వాహనాలు ఉండగా సింహభాగం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నాయి. మోటారు సైకిళ్లలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి తర్వాత కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో రవాణా శాఖకు ఆదాయం కూడా భారీగానే వస్తోంది. ప్రధానంగా వ్యక్తిగత వాహనాల నుంచి లైఫ్ ట్యాక్స్ రూపంలో, రవాణా వాహనాల ద్వారా త్రైమాసిక పన్నుల రూపంలో వస్తోంది. 2023-24లో రవాణా శాఖకు రూ.6,990.29 కోట్ల ఆదాయం లభించింది. 2014-15లో వచ్చిన 1,854.48 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం రూ.ఐదువేల కోట్ల కన్నా ఎక్కువే. ఆదాయవృద్ధి 2023-24లో 9.38 శాతం రాగా అది 2022-23లో 60.92 శాతానికి చేరింది. ఇది 2021-22లో 23 శాతం మాత్రమే.
