‘ఓ దేవుడి సినిమా తీయాలంటే మాటలా… పైగా యానిమేషన్లో. డబ్బు పోవడం తప్ప ఏమీ లేదు…’ అన్నవాళ్లలో కొందరు ఇవాళ నా దగ్గరకు వచ్చి భలే తీశారంటూ మెచ్చుకుంటున్నారు. నిజానికి ఈ సినిమా తీయాలనే ఆలోచన రావడం నుంచీ పూర్తి చేయడం వరకూ ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. చేసిన అప్పులకు లెక్కేలేదు. రాత్రింబవళ్లు అదే ధ్యాసగా గడిపాం. నలభైకోట్ల రూపాయల వరకూ పెట్టుబడి పెడితే ఈ రోజున దాదాపు 282 కోట్ల రూపాయల లాభాల్ని అందించి ఇంకా నడుస్తుండటంతో నేనూ, నా భార్య శిల్పా ధవన్ అయిదేళ్లుగా పడుతున్న కష్టాలన్నీ మర్చిపోయాం. మాది మహారాష్ట్రలోని థానే. చిత్రలేఖనం, డిజిటల్ పెయింటింగ్స్పైన ఉన్న ఇష్టంతో దిల్లీలో క్లీం పేరుతో వీఎఫ్ఎక్స్ స్డూడియో ప్రారంభించా. మెక్‌డొనాల్డ్స్, మారుతి, లెనొవొ, ఎరోస్ ఇంటర్నేషనల్, పిక్సియాన్ సంస్థలకోసం పనిచేశా. అయితే చదువుకుంటున్న రోజుల్లో నేను దేవుడిని నమ్మేవాడిని కాదు. దేవుడనేవాడే ఉంటే.. ఒకరికి సుఖం, మరొకరికి దుఃఖం ఎందుకిస్తాడని వాదించేవాడిని. అన్నింటినీ ప్రశ్నించేవాడిని. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవుగా. కొన్ని సమస్యలూ, ఒత్తిళ్లూ తప్పలేదు. సరిగ్గా ఆ సమయంలోనే కృష్ణభక్తుడైన శ్రీలప్రభుపాద రచనలూ, ఆ తర్వాత భగవద్గీతా చదవడం మొదలుపెట్టా. కృష్ణభక్తుడిగా మారా. అప్పుడే వీఎఫ్ఎక్స్ సామర్థ్యంతో త్రీడీలో ప్రహ్లాదుడు -నరసింహస్వామి కథను తీయాలనిపించింది. అలా దాదాపు అయిదేళ్లక్రితం ‘మహావతార్-నరసింహ’ చిత్రానికి బీజం పడింది. నిజానికి ప్రారంభంలో ఈ సినిమా కోసం మా దగ్గరున్న డబ్బు సరిపోతుందనుకున్నాం. నేను వీఎఫ్ఎక్స్ వర్క్స్ద్వారా సంపాదించిన మొత్తం, పెళ్లికిముందు శిల్ప లండన్‌లో పనిచేసి ఆర్జించిన డబ్బూ చేతిలో ఉండటంతో పనులు మొదలుపెట్టాం. అయితే ఇందులోకి దిగాక బడ్జెట్ ఊహించనంత పెరిగి.. కోట్లు అవసర మయ్యాయి. ఇన్వెస్టర్లను వెతకాల్సి వచ్చింది.


ఓ 2డీ కార్టూన్ చిత్రం ఉందనుకోండి… మనం ఒక్క క్షణంపాటు చూసే ఒక సీన్ కోసం 24 చిత్రాలు గీయాలి. అదే 3డీ యానిమేషన్లోనైతే… అలాంటి 24 ‘సెట్’లని సృష్టించాలి. ఆ ఒక్క సీన్‌కి కావాల్సిన 3డీ బొమ్మలూ, చుట్టూ ఉన్న వాతావరణం అన్నమాట. ఓ కంప్యూటర్లో ఆ సెట్ సృష్టించడానికి కనీసం వారం పడుతుంది. అలా కష్టపడి తీసిన ఓ ఐదు నిమిషాల సీన్ సరిగ్గా రాకపోతే మళ్లీ ‘రీ-షూట్’ చేయాలి! అది చేయడానికి మళ్లీ కొన్ని నెలలు తీసుకుంటుంది. ఈసారీ అంతే ఖర్చవుతుంది. ఓ ఆర్టిస్టుగా బొమ్మ వేసివ్వడం, తర్వాత దాన్ని గ్రాఫిక్స్‌లోకి మార్చడం, ప్రతి పాత్రనీ గమనించుకోవడం, హావభావాలు అనుకున్నట్లుగా వస్తున్నాయో లేదో చూసుకోవడం… ఇలా అన్నింటికోసం నేనూ, మా టీమ్ దాదాపు పదహారు గంటలు కష్టపడుతుంటే… నా భార్య శిల్ప ప్రతినెలా ఇరవయ్యో తారీఖు నుంచే సిబ్బందికి జీతాలు ఎలా ఇవ్వాలి, లోన్లు ఎలా తేవాలి, ఎవరిని అప్పు అడగాలి, వడ్డీలు ఎలా కట్టాలి… అని ఆలోచిస్తూ విపరీతంగా టెన్షన్పడేది. ఎందుకంటే… కొందరు పెట్టుబడి పెడతామని చివరి నిమిషంలో ఆగిపోయేవారు. అలా దాదాపు వందమందికి పైగా ఇన్వెస్టర్లనూ, నిర్మాతల్నీ కలిశాం. ఓ వైపు ఆ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు మా ఫిక్స్డ్ డిపాజిట్లను బయటకు తీశాం. అవన్నీ అయిపోయాక ఇష్టంగా కట్టుకున్న ఇంటిని తాకట్టుపెట్టాం. నగలు, కారు… ఇలా ఒక్కొక్కటిగా అన్నింటినీ అమ్మేయాల్సి వచ్చింది. అమ్మానాన్నలు ఇచ్చిన డబ్బూ సరిపోలేదు. చివరకు శిల్ప… తన పుట్టింటివాళ్ల సాయం కోరింది. ‘ఈసారి ఇన్వెస్టర్లు దొరికారు. ఈ ఒక్క నెల మాత్రమే సర్దండి. ఇదే ఆఖరుసారి. ఎలాగైనా తిరిగిచ్చేస్తాం’ అంటూ వాళ్లను బతిమాలడం ఎన్నోసార్లు విన్నాను.

మా అవస్థలేవో మేం పడుతుంటే మరికొందరేమో ‘దేవుడి సినిమా ఇక్కడ ఆడదు. సినిమా పోతే తర్వాత మీ పరిస్థితి ఏంటని భయపెట్టేవారు. నేనూ, నా భార్యా ఒకటే అనుకున్నాం… మా ప్రయత్నం ఒక విధంగా సాహసమే. అయినా కూడా సినిమా పోయినా మా ఖర్మవల్లే అలా అయ్యిందని అనుకోవాలనుకున్నాం. ఇక, వీఎఫ్ఎక్స్ పని ఎలాగూ తెలుసు. ఈ సినిమా ద్వారా మరికొన్ని నైపుణ్యాలు నేర్చుకున్నాం కాబట్టి మళ్లీ ఎప్పటిలా ఏదో ఒకటి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే, మా నమ్మకం వృథాపోలేదు. ముంబయికి చెందిన విద్యుదుత్పత్తి సంస్థ అపార్ గ్రూప్ వాళ్లు మాకు సహనిర్మాతలుగా మారడానికి ఒప్పుకున్నారు. అప్పటినుంచీ మా ఇబ్బందులు కాస్త తగ్గాయి. ఆ తర్వాత దీన్ని మార్కెట్ చేయడానికి కేజీఎఫ్, సలార్ చిత్రాల్ని నిర్మించిన హొంబలె సంస్థ ముందుకొచ్చింది. అలా బాలారిష్టాలన్నీ దాటుకుని జులై 25న రిలీజైన ‘మహావతార్ నరసింహ’ ఆబాలగోపాలాన్నీ కట్టిపడేసింది. మొదటి పదిరోజుల్లోనే వందకోట్లు తెచ్చిపెట్టింది. ఇంకా ఆడుతూనే… ప్రస్తుతం దాదాపు 300 కోట్ల రూపాయలతో దేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన యానిమేషన్ చిత్రంగా నిలిచిపోయింది!
