పుణ్య నదీ జలాలు.. పారవశ్యం చెందే కోట్లాది మంది భక్తులు… త్రివేణీ సంగమ తీరాన పరిమళించే ఆధ్యాత్మిక సౌరభాలు.. ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సమ్మేళనమది.. అణువణువునా ప్రసరించే భక్తి భావంతో భారతీయ ఆత్మకు ప్రతిరూపంగా నిలిచే ఆ ఆధ్యాత్మిక వేడుకే.. మహా కుంభమేళా. భారతీయులకు నదులంటే జల ప్రవాహాలు మాత్రమే కాదు.. జీవిత సారాన్ని తాత్వికంగా బోధించే జ్ఞాన కెరటాలని నిరూపిస్తూ పన్నెండేళ్లకోసారి జనం అర్పించే నీరాజనాలే ఈ కుంభమేళాలు.. గంగ, యమునలతోపాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది కలిసే త్రివేణీ సంగమంలో సాగే ఈ మహా కుంభమేళా.. భూమండలంపై జరిగే మహత్తర వేడుక. ఈ నెల 13వ తేదీ నుంచి 45 రోజులపాటు సాగే ఈ బృహత్తర క్రతువు గురించి మనమూ తెలుసుకుందామా…
పురాణ గాథ
అమృతభాండం కోసం దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని చిలికారని పురాణాలు చెబుతున్నాయి. ఆ క్షీరసాగర మథనానికి ఈ కుంభమేళాకు సంబంధం ఉంది. అమృతం కోసం దానవులు, రాక్షసులు వాసుకిని మందరపర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం ఇలా ఒక్కొక్కటీ పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే హాలాహలం కూడా వస్తే.. పరమేశ్వరుడు దానిని కంఠంలో నిలుపుకొన్నాడు. ఆ తర్వాత అమృతం రాగా.. దాని కోసం దేవతలు, రాక్షసులు పోట్లాడుకుంటారు. ఈ సమయంలోనే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తి.. అమృతభాండం రాక్షసులకు చిక్కకుండా పట్టుకుపోతున్న సమయంలో.. ఓ నాలుగు చుక్కలు హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, ఉజ్జయిని, నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయట. అందువల్లే అక్కడ పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి పునీతులవుతారని భక్తుల నమ్మకం. అందుకే గ్రహభ్రమణాలను అనుసరించి.. ప్రతి 12 ఏళ్లకోసారి ఆయా చోట్ల మహాకుంభ మేళా నిర్వహిస్తారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం.. ఎవరూ ఆహ్వానించకుండానే అక్కడికి కోట్ల మంది వస్తారు.. ఎవరూ సూచించకుండానే ఆధ్యాత్మిక కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఎటుచూసినా ఇసుకేస్తే రాలనంత జనం.. ఇసుమంతైనా చోటులేని త్రివేణీ సంగమ తీరం.. అదే కోట్ల మంది ఆధ్యాత్మిక భావనలో మునిగే మహా కుంభమేళా. భూమండలంమీద అత్యంత భారీగా భక్తులు హాజరయ్యే గొప్ప ఆధ్యాత్మిక వేడుక. అంతమంది ఒకేచోట చేరే ఈ ధార్మిక మేళా అంతరిక్షం నుంచీ కనిపించే అరుదైన వేదిక. ఇది అతి పెద్ద హిందువుల సమీకరణే అయినా దేశ విదేశాల నుంచి లెక్కలేనంత మంది ఇతరులూ ఇందులో పాలుపంచుకోవడం విశేషం. ఈ కారణంగానే యునెస్కో గుర్తింపు పొందిన ఈ మహా కుంభమేళా ప్రపంచానికే మహత్తర పండగగా నిలుస్తోంది. 12 ఏళ్లకోసారి భక్తజన కోటిని పలకరిస్తోంది. సంక్రాంతి నుంచి శివరాత్రి దాకా 45 రోజులపాటు భక్త జన పారవశ్యంతో ఈ ప్రాంతం కళకళలాడనుంది.
కుంభమేళా సమయంలో దేవుళ్లు సరాసరి భూమి మీదకు వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. గుప్తుల హయాం.. అంటే క్రీస్తు శవం నాలుగో శతాబ్దం నుంచి ఆరో శతాబ్ద కాలంలోనూ కుంభమేళా నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారు. నది ఒడ్డున పెద్దపెద్ద ఆలయాలు, ఘాట్లు నిర్మించి పుణ్యస్నానాలకు ఏర్పాటు చేసేవారు. ఈ కాలంలోనే కుంభమేళా.. స్థానిక వేడుక నుంచి ఓ దేశస్థాయికి ఎదిగింది. 12వ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ఠ మరింత పెరిగింది. వివిధ రాజ్యాలకు చెందిన రాజులు, చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని తగిన ఆర్థికసాయం, వసతి ఏర్పాట్లు కల్పించేవారు. ముఖ్యంగా అక్బర్ కాలంలో మహా కుంభమేళా కోసం ప్రత్యేక నిధులు, భూ కేటాయింపులు జరిగాయి.
బ్రిటిష్ పాలన సమయంలోనూ కుంభమేళా ఖ్యాతి మరింత పెరిగింది. కేవలం సాధువులు, అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనే వారు. 1918లో జరిగిన మహాకుంభమేళాలో మహాత్మాగాంధీ కూడా పాల్గొన్నారు. అయితే, ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్ని ఏకతాటి మీదికి తీసుకొస్తున్నాయన్న కారణంలో క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది. పన్నులు విధించి అణగదొక్కే ప్రయత్నం చేసింది. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా 1954లో తొలి కుంభమేళా నిర్వహించారు. అక్కడి నుంచి ఈ పుణ్యకార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రతిసారీ భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
మహాకుంభమేళా జరిగే అన్ని రోజులూ.. ఆ ప్రాంతం దైవ నామస్మరణతో మార్మోగుతుంది. ఎముకలు కొరికే చలిలోనూ నూలుపోగైనా ధరించని నాగసాధువులు, ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు, అన్ని బంధాలను తెంచుకొని దేవుడి కోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు. ఈ అపూర్వ వేడుకను చూసేందుకు రెండు కళ్లూ సరిపోవంటే అతిశయోక్తి కాదు.
నదీస్నానం
మహా కుంభమేళాలో ముఖ్యమైనది పవిత్ర నదీ స్నానం. కోట్ల మంది గంగా, యమునా, సరస్వతి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తారు. ఈ మూడు నదుల త్రివేణీ సంగమంగా.. తీర్థరాజంగా పేరొందిన ప్రయాగ్‌రాజ్ ఇందుకు వేదికగా నిలుస్తోంది. కుంభమేళాకు సంస్కృతి, భాష, సంప్రదాయాలకు అతీతంగా అందరూ హాజరవుతారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శిస్తారు. సోదర భావం ద్వారా సామాజిక సరిహద్దులను చెరిపేస్తారు. కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు.. వెలుగులీనే సాంస్కృతిక పండగ కూడా. ఒకవైపు ఆధ్యాత్మికత ఉట్టిపడుతుండగానే మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తిస్తుంటాయి. భారతీయ వారసత్వ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తారు. ప్రస్తుతం మహా కుంభమేళా అంతర్జాతీయ యాత్రా స్థలంగా ఖ్యాతి సంపాదించింది. దీంతో విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, యాత్రికులు వస్తుంటారు. నాలుగేళ్లకోసారి నాలుగు చోట్ల కుంభమేళా జరుగుతుంది. హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్‌రాజ్‌లలో ఈ వేడుక నిర్వహిస్తారు. ఇప్పుడు జరిగే మహా కుంభమేళా 12 ఏళ్లకోసారి జరిగేది. మహా కుంభమేళా ఈసారి ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే ఫిబ్రవరి 26వ తేదీ వరకూ ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనుంది. ఇందుకోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. సాధువులు, సాధ్వీలు, నాగా సాధువులు, కల్పవాసీలు భారీగా హాజరుకానున్నారు.
మహా కుంభమేళాకు తరలివచ్చే కోట్ల మంది భక్తుల కోసం రైల్వేశాఖ ఏకంగా మూడువేల ప్రత్యేక రైళ్లతోపాటు మొత్తంగా 13 వేల రైళ్లను నడుపుతోంది. సుమారు 2 కోట్ల మంది రైళ్ల ద్వారా వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇవి నిరంతరం ఆ మార్గంలోనే ప్రయాణిస్తుంటాయి. తొమ్మిది కీలకమైన రైల్వే స్టేషన్లలో 560 టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. కుంభమేళాలో పాల్గొనేవారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతోపాటు వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు 1.6 లక్షల టెంట్లు, 1.5 లక్షల మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
మహా కుంభమేళాలో ముఖ్యమైన కార్యక్రమాలు
త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం
గంగా హారతి
కల్పవాస్
దైవపూజ
దీప దానం
పంచక్రోశ్ పరిక్రమ
సంకీర్తన, భజన
యోగా, మెడిటేషన్
అఖాడాల ప్రదర్శన