గత ప్రభుత్వంలో వైసీపీ నాయకుల వేధింపులతో ఇబ్బందులకు గురైన బాధితురాలు ఆరుద్ర తాజాగా తన కూతురితో కలిసి సీఎం చంద్రబాబును కలిశారు. దివ్యాంగురాలైన తన కుమార్తెకు న్యాయం చేయాలని, వైసీపీ నాయకులు కబ్జా చేసిన తన ఇంటి సమస్యను పరిష్కరించాలని ఆమె వేడుకున్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆరుద్రకు అభయహస్తం ఇచ్చారు. దివ్యాంగురాలైన తన కుమార్తెకు రూ. 10 వేలు పింఛన్తో పాటు వైద్యం ఖర్చుల కోసం రూ. 5 లక్షలు సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఆమె ఆస్తి వివాదాన్ని కూడా పరిష్కరిస్తామని ఆరుద్రకు చంద్రబాబు హామీ ఇచ్చారు.
కాకినాడ జిల్లా రాయుడుపాలెంకు చెందిన ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మి చంద్ర కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతున్నారు. అయితే కుమార్తె వైద్యం ఖర్చులకోసం తమకున్న ఇంటిని అమ్మేందుకు తల్లి ఆరుద్ర ప్రయత్నం చేశారు. కానీ వైసీపీ నాయకులు అడ్డుపడ్డారు. ఈ విషయాన్ని అప్పటి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆరుద్ర తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. జగన్ను కలిసేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో చేసేదేమీలేక ఆరుద్ర ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. కానీ జగన్ మోహన్ రెడ్డిగానీ, వైసీపీ నాయకులు కానీ స్పందించలేదు. దీంతో తన సమస్యను ఆరుద్ర అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆరుద్రకు సాయం చేసి అండగా నిలిచారు. సీఎం అయిన రెండు రోజులకే ఆరుద్రకు న్యాయం చేసిన చంద్రబాబుకు ప్రశంసల జల్లు కురుస్తోంది.