ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఇది ఎవరికి ప్లస్ అవుతుందో.. మైనస్ అవుతుందో పక్కనబెడితే పోలింగ్‌లో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా చోటు చేసుకున్నాయి. వైసీపీ నాయకుడు, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి ఓటేశారని తెలుస్తోంది. అయితే ఇది కావాలని చేయలేదట.. పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ హడావిడిగా సైకిల్‌కి ఓటేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై వైసీపీ శ్రేణుల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.. వైసీపీ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయబోయి హడావుడిలో ఎన్డీఏ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటేసినట్టు సమాచారం. ఆ వెంటనే పొరబాటును గ్రహించిన ప్రతాప్ కుమార్ రెడ్డి.. తాను సైకిల్‌కి ఓటేశానని.. మళ్లీ మార్చమని పోలింగ్ సిబ్బందిని అడిగారని తెలుస్తోంది. ఒకసారి ఓటేశాక తిరిగి మార్చుకోవడం సాధ్యం కాదని ఎన్నికల సిబ్బంది చెప్పడంతో ఆయన ఓటు టీడీపీ ఖాతాలో పడిపోయింది. ఈ విషయం ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వరకూ వెళ్లిందో లేదో.. వెళితే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏంటనే దానిపై వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి ప్రతాప్‌కుమార్ రెడ్డి నిర్వాకంపై సోషల్‌మీడియాలో పెద్దయెత్తున ట్రోలింగ్ నడుస్తోంది. కొందరైతే వైఎస్ జగన్ కూడా టీడీపీకే ఓటేశారంటూ కామెంట్లు చేస్తున్నారు.