ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్ని వ్యూహలు రచిస్తున్నాయి. ఎవరికి వారు గెలుపు తమదేననిధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంపైనే అందరి కళ్లు ఉన్నాయి. వైసీపీ నుంచి వంగా గీత ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్ విజయం కోసం మెగా కుటుంబం, సినీ, టీవీ నటులు పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి చివరి రోజైన శనివారం మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తన తల్లి సురేఖ, మేనమామ అల్లు అరవింద్‌తో కలిసి పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు.
అయితే ఈ ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తన ఓటు తనకు గానీ, తన పార్టీకి గానీ వేసుకోలేని సందర్భం ఆయనకు ఎదురొచ్చింది. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండగా.. ఆయనకు ఓటు మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. కూటమి పొత్తులో భాగంగా మంగళగిరి టిక్కెట్ టీడీపీకి దక్కింది. అక్కడి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. 2019లో ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన లోకేష్ ఈసారి గెలుపు లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. ఆయనకు మద్దతుగా తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణితో పాటు సీనియర్ ఎన్టీఆర్ కుటుంబసభ్యులంతా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పవన్ కళ్యాణ్‌కి ఓటు మంగళగిరిలో ఉండటంతో సోమవారం ఆయన అక్కడే తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పిఠాపురం నుంచి
పవన్ పోటీ చివరి నిమిషంలో ఖరారు కావడంతో ఓటు బదిలీకి అవకాశం లేకుండా పోయిందని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన ఓటు తనకు వేసుకోలేకపోతున్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు.