హిందూ పురాణాల్లో ఏకాదశి నాడు చేసే ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి సంవత్సరం 24 ఏకాదశులు వస్తాయి. అందులో సఫల ఏకాదశి ఒకటి. కొత్త సంవత్సరం తొలి నెల జనవరి 7వ తేది సఫల ఏకాదశి పండుగ వచ్చింది. సఫల ఏకాదశి రోజు కఠిక ఉపవాసం ఉండి విష్ణువుని పూజించడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. సకల పాపాలు పోగొట్టుకుని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. మరణించిన తర్వాత విష్ణు లోకంలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుందని చెప్తారు. సఫల అంటే అభివృద్ధి అని అర్థం. సఫల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు.
ఏకాదశి రోజు తెల్లవారుజామున లేచి స్నానం ఆచరించాలి. గంగాజలం చల్లి విష్ణువుని ఆరాధించాలి. దేవుడి ముందు దీపం పెట్టాలి. పండ్లు, పంచామృతాలు సమర్పించాలి. కొబ్బరి, ఉసిరి, దానిమ్మ, లవంగం వంటి వాటితో స్వామి వారిని పూజించాలి. ఉపవాసం ఉంటే చాలా మంచిది. రాత్రి నిద్రపోకుండా జాగారం చేస్తూ విష్ణు సహస్ర నామం చదువుకుని కీర్తనలు పాడుకుంటూ ఉండాలి. మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత బ్రాహ్మణుడికి ఆహారం పెట్టాలి. వారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఉపవాసం విరమించాలి.
ఉపవాసం చేస్తున్న రోజు మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి. మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ముందు రోజు నుంచి తినడం మానేయాలి. సఫల ఏకాదశి ఉపవాసం చేసిన వ్యక్తి ప్రతి పనిలో విజయాన్ని పొందుతారని నమ్మకం.
సఫల ఏకాదశి ప్రాముఖ్యత
సఫల ఏకాదశి ప్రాముఖ్యత గురించి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ధర్మరాజు, యుధిష్టిరునికి బోధించారు. ఎన్ని యాగాలు, ఉపవాసాలు, యజ్ఞాలు చేసిన లభించని సంతృప్తి సఫల ఏకాదశి రోజు చేసే ఉపవాసం వల్ల లభిస్తుందని కృష్ణుడు చెప్పాడు. అందుకే చాలా మంది ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. పుణ్యఫలం, మోక్షం లభిస్తుందని విశ్వాసిస్తారు. సఫల ఏకాదశి పవిత్రతని ఛాటి చెప్పే కథని కృష్ణుడు పాండవులకి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి.
సఫల ఏకాదశి వ్రత కథ
పూర్వం చంపావతి నగరాన్ని మహిష్మంతుడు అనే రాజు పాలించేవాడు. అతనికి లుంభకుడు అనే కుమారుడు ఉండేవాడు. అధర్మాన్ని పాటిస్తూ ప్రజల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు. అది తెలుసుకున్న రాజు కొడుకుని రాజ్యం నుంచి బహిష్కరించాడు. అడవుల పాలైన లుంభకుడు ఆహారం దొరకపోవడంతో ఒక చెట్టు కింద పడుకున్నాడు. తనకి పట్టిన పరిస్థితి తలుచుకుని చింతిస్తూ రోజంతా ఏమి తినకపోవడంతో స్పృహ తప్పి పోయాడు.
ఆరోజు ఏకాదశి కావడంతో తనకి తెలియకుండానే అతడు ఉపవాసం పాటించినట్టు అయ్యింది. విష్ణువు ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ధర్మబద్ధమైన పాలన చేసిన లుంభకుడు మరణానంతరం విష్ణు లోకాన్ని చేరుకున్నాడని పురాణ గాథ. ఈ ఏకాదశి వ్రత మహత్యం గురించి శివుడు పార్వతీ దేవికి చెప్పినట్టు పద్మ పురాణం చెబుతోంది. అందుకే సఫల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు ఆరాధన చేస్తే విష్ణు లోక ప్రవేశం ఉంటుంది. సంపద, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.