పూతరేకులకి ఫేమస్ అయిన కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయం ఎంతో చరిత్ర.. మరెన్నో పాశస్త్యం ఉంది. అందుకే దీన్ని కోనసీమ తిరుమలగా భక్తులు పిలుస్తుంటారు. గోదారమ్మ రెండు పాయలుగా విడిపోయి ఒకటి వశిష్ఠ మరొకటి గౌతమి పాయలు గా పయనిస్తోంది. పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయ నందు వాడపల్లి గ్రామంలో శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఇక్కడ స్వయంభూ వెలిశారని చెబుతారు.
వాడపల్లి గ్రామాన్ని పూర్వం” నౌకాపురి”గా పిలిచేవారు. నది ఒడ్డున వెలసిన స్వామి వారిని నారద మహర్షి వారు కనుగొని తన స్వహస్తాలలో ప్రతిష్టించి వెంకటేశ్వరునిగా నామకరణం చేశారు. గోదావరి నదిలో వరద ముంచెత్తడం వలన నారదుడు నిర్మించిన ఆలయం నది గర్భంలో కలిసిపోయింది. ఆ రోజుల్లో పినుబోతు గజేంద్రుడు అనే వ్యాపారి కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవారు ఒకసారి పెద్ద తుఫాన్ సంభవించడంతో ఆ పడవలు అన్ని సముద్రంలో కలిసిపోగా … స్వామి నా పడవలు సముద్ర గర్భం నుండి తీయిస్తే నిన్ను గోదావరి నది నుండి వెలికి తీసి నీకు ఆలయం నిర్మించి ప్రతిష్టిస్తానని మొక్కుకున్నారట. అంతే ఆ మరుసటి రోజే పడవలన్నీ ఒడ్డుకి చేరడంతో ఆయన మొక్కు ప్రకారం స్వామివారికి ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం.
కాలక్రమేనా ఆలయ పూజలు అర్చకులకు భారంగా మారడంతో స్వయంగా స్వామివారు పెద్దాపురం సంస్థాన రాజైన రాజా శ్రీ వత్సవాయి పెమ్మ గజపతి మహారాజుకి కలలో కనిపించి దైవ సమాన పూజలతో నువ్వు పునితుడివై వైకుంఠానికి చేరువుతావని చెప్పారట. దీంతో ఆయన స్వామివారి గురించి అడిగి తెలుసుకుని వాడపల్లి వెళ్లారు. స్వామివారి నిత్య నైవేద్య పూజల నిమిత్తం 1759వ సంవత్సరంలో తన ఆస్తిలో 270 ఎకరాలు ఆలయానికి రాసిచ్చేశారు. ఈ క్షేత్రం మూల విరాట్ రాతితో చేసినది కాదు చెక్కతో చేసినది. ఇక్కడ ఏడు వారాలు వ్రతం చేసి ఎనిమిదో వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిదని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి శనివారం వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలివస్తుంటారు. ఎంత కష్టమైనా సరే ఏడు శనివారాలు స్వామివారిని దర్శించుకుంటే కష్టాలన్ని తొలగిపోతాయని భక్తుల్లో బలమైన నమ్మకం ఏర్పడింది.
ఈ ఆలయంలో స్వామి వారికి కుడి వైపున వేణుగోపాల స్వామి వారు, ఉత్తరం వైపు అలివేలు మంగతాయారు అమ్మవారు, ఆగ్నేయంలో శ్రీ రామానుజులు వారు వారి శిష్యులు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారు దర్శనం ఇస్తారు. వాడపల్లి గ్రామం ఆత్రేయపురానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి శనివారం ఈ ఆలయంలో 108 లేదా 7 ప్రదక్షిణాలు చేసే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. ఈ ఆలయ మహత్యం తెలుసుకున్న ఇతర జిల్లాలు, రాష్ట్రాల వారు ఎక్కువగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు.