తమిళనాడు అంటేనే దేవాలయాలకు ప్రసిద్ధి. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన వందలాది ఆలయాలు అక్కడ కనిపిస్తుంటాయి. ఇందులో వేటికమే ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ప్రముఖమైనది శ్రీపురంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం. దేశంలో బంగారు దేవాలయం అంటే ఒకప్పుడు అమృతసర్‌లోని గురుద్వారానే.. ఇప్పుడు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా గుర్తుకొస్తుంది. ఇక్కడ స్థంభాలు బంగారం, వాటిపై శిల్పకళా బంగారం, గోపురం, విమానం, అర్ధ మండపం, శఠగోపం ఇలా అన్నీ బంగారంతో చేసినవే.
శ్రీపురం స్వర్ణ దేవాలయం వేలూరులోని మలైకొడి ప్రదేశంలో నిర్మించారు. దీనినే ‘ది గోల్డెన్ టెంపుల్ అఫ్ వెల్లూర్’ అని పిలుస్తారు. శ్రీ శక్తిఅమ్మ అనే భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈయన అసలు పేరు సతీశ్‌కుమార్. సొంతూరు వేలూరు. తండ్రి నందగోపాల్ ఒకమిల్లు కార్మికుడు. తల్లి టీచర్. 1976లో జన్మించిన సతీశ్‌కుమార్ చిన్నప్పటి నుంచీ అందరు పిల్లల్లా చదువూ ఆటపాటలపైన ఆసక్తి చూపకుండా గుళ్లు, గోపురాలు, పూజలు, యజ్ఞయాగాదులు అంటూ తిరిగేవారు. ప్రాథమిక విద్య అనంతరం ఆయన పూర్తి స్థాయిలో భక్తుడిగా మారిపోయారు. 16వ ఏట శక్తిఅమ్మగా పేరుమార్చుకున్నారు.
1992లో నారాయణి పీఠాన్ని స్థాపించారు. ఆయన ఓ రోజు బస్సులో వెళుతుంటే శ్రీపురం వద్ద ఆకాశం నుంచి ఓ కాంతిరేఖ కనిపించిందట. ఈ వెలుగులో నారాయణి (లక్ష్మీదేవి రూపం) దర్శనమిచ్చిందట. ఆయన అప్పటి నుంచి నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. పీఠం తరుపున ఉచిత వైద్యశాల, పాఠశాలను నిర్వహిస్తున్నారు. భక్తులకు ఉపదేశాలివ్వడం, వారి సమస్యలకు పరిష్కార మార్గాల్ని సూచించడం, అన్నదానం… ఇక్కడ నిరంతరం నిర్వహించే కార్యక్రమాలు. శక్తిఅమ్మ భక్తులు దేశవిదేశాల్లో విస్తరించారు. అమెరికా, కెనడా దేశాల్లో ఈయన ఫౌండేషన్లు రిజిస్టరై వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి. ఈ స్వర్ణదేవాలయం విరాళాల్లో ఎక్కువ శాతం విదేశాల్లో ఉన్న భక్తుల నుంచి సేకరించినవే.
ఈ ఆలయం లోపల, బయట రెండు వైపులా బంగారు పూతతో మహాలక్ష్మి ఆలయం ఉంది. ఈ దేవాలయం వ్యయ పరంగా, విస్తీర్ణం పరంగా అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం కంటే చాలా పెద్దది. ఆలయంలోని శిల్పకళకు అనుగుణంగా బంగారాన్ని తాపడం చేసేందుకు చాలా ఖర్చు పెట్టారు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయ స్థపతి సుబ్బయ్య, తిరుపతి శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాల స్థపతి శ్రీనివాసన్‌ల పర్యవేక్షణలో నిర్మాణం కొనసాగింది. సుమారు 400 మంది (తిరుమల తిరుపతి దేవస్థానానికి బంగారు తాపడంలో పాలుపంచుకున్న వాళ్లూ వీరిలో ఉన్నారు) రేయింబవళ్లు కష్టపడితే దేవాలయ నిర్మాణానికి ఆరేళ్లు పట్టింది.
తిరుమల ఆలయానికి మాదిరిగానే చుట్టూ 36 స్తంభాలున్నాయి. మధ్యలో ఉన్న షాండ్లియర్ పూర్తిగా బంగారంతో చేసిందే. ఆలయ ప్రాంగణంలో 30 వేల మొక్కలు, ఉద్యానవనాల్లో లక్ష మొక్కలు నాటారు. అందమైన ఫౌంటెన్లు అదనపు హంగుల్ని చేకూరుస్తున్నారు. ఆలయానికి ప్రత్యేకమైన లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కాంతుల్లో దేవాలయ శిల్పకళాచాతుర్యం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆలయం లోపల గర్భగుడిలో అమ్మవారి ఎదుట 27 అడుగుల ఎత్తైన పంచలోహలతో చేసిన పది అంచెల దీపస్తంభం ఉంటుంది. ఇందులో వెయ్యి వత్తులతో దీపారాధన చేస్తారు. ఆకాశం నుంచి చూస్తే ఈ ఆలయం శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది. శ్రీపురం స్వర్ణ దేవాలయంలో చేతితో చేసిన బంగారు షీట్ లు 9-15 పొరలుగా ఉన్నాయి. దీనిని 1500 కిలోల బంగారంతో కట్టించారని చెపుతారు. ఆలయంలో ఎలాంటి నామ స్మరణలు చేయకూడదు. ప్రవేశం మొదలు దర్శనం పూర్తయి బయటికి వచ్చే వరకూ భక్తులు మౌనం పాటించాలి. భక్తులు ఆలయంలోనికి ప్రవేశించేటప్పుడు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. ఈ ఆలయంలో తిరుపతి నుంచి 115 కిలోమీటర్లు, చెన్నై నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.