కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం. ఏదో అనర్థం జరుగుతుందని భయపడిపోతాం. ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా?.. అనర్థమా? చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా ? కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ?.. ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరికాయ కొట్టినప్పుడు సరిగ్గా పగలకపోయినా, చెడిపోయినా మీరు అనుకుంటున్నంత అపచారమేమీ లేదు. అసలు భయపడాల్సిన పనేలేదు. అయితే కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసివుండాలి. అప్పుడే అది అడ్డంగా..చూడటానికి అందంగా రెండు చెక్కలుగా పగులుతుంది. కొబ్బరికాయ సమానంగా పగలడం వలన, మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని చెబుతుంటారు. కొత్తగా పెళ్లైన వాళ్లు కొట్టిన కొబ్బరికాయలో ‘పువ్వు’ వస్తే, అది సంతాన యోగాన్ని సూచిస్తుందని అంటారు. కుటుంబంలో ఎవరు కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే, ఆ కుటుంబంలోని కూతురు గానీ, కోడలు గానీ సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనగా భావిస్తుంటారు. ఇలా కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెబుతుందనే విశ్వాసం.
పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్లితే ఎలాంటి దోషమూ ఉండదు. అపచారం అంతకంటే ఉండదు. ఆలయంలో కొబ్బరికాయ కుళ్లిపోతే ఆ కాయను నీటితో శుభ్రంచేసి మళ్లీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు. ఈ పక్రియ దోషం చెడిపోయిన కొబ్బరికాయదని, భక్తుడిది కాదని సూచిస్తుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్లిపోతుంది. అప్పుడు ఏదో పూజలో అపచారం జరిగిందని చాలామంది కంగారు పడతారు. అయితే ఇందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొబ్బరికాయ చెడిపోయి ఉంటే.. కుళ్లిన భాగాన్ని తీసేసి.. కాళ్లూ, చేతులు, ముఖం శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని మళ్లీ శుభ్రం చేసి పూజ ప్రారంభిస్తే దోషం పోయినట్లే. వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టిపోయినట్టే అని అర్థం. కాబట్టి మళ్లీ వాహానాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది.
భగవద్గీతలో చెప్పినట్టుగా, భక్తితో అర్పించిన పండుగానీ, పువ్వుగానీ, ఆకుగానీ, ఆ స్వామి స్వీకరిస్తాడు. ఇక్కడ భక్తి ముఖ్యంగానీ తెచ్చిన వస్తువు కాదు. భక్తితో తెచ్చిన పండైనా, ఆకైనా, పూవైనా, నీరైనా సరే, నేను ప్రేమతో స్వీకరిస్తాను అని భగవద్గీతలో చెప్పినట్టుగా, కొబ్బరికాయ చెడిపోయినా సరే! ఆస్వామీ ప్రేమతో స్వీకరిస్తాడని పండితులు చెబుతున్నారు.