‘మిరాయ్’ రివ్యూ.. అదిరిపోయిన గ్రాఫిక్స్, పెద్ద స్టార్లూ చూసి నేర్చుకోండి

Telugu BOX Office
3.8
చందమామ కథలాంటి ‘మిరాయ్’

చిత్రం: మిరాయ్‌

నటీనటులు: తేజ సజ్జా, మంచు మనోజ్‌, రితికా నాయక్‌, శ్రియ శరణ్‌, జగపతిబాబు, జయరామ్‌, పవన్‌ చోప్రా, రాజేంద్రనాథ్‌ తదితరులు

సంగీతం: గౌర హరి

ఎడిటింగ్‌: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌

నిర్మాత: టీజీ విశ్వప్రసాద్‌, కీర్తి ప్రసాద్‌

సినిమాటోగ్రఫీ, రచన, దర్శకత్వం: కార్తిక్‌ ఘట్టమనేని

విడుదల: 12-09-2025 

బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించిన తేజ సజ్జా ‘హనుమాన్’తో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఆయన తాజా చిత్రం ‘మిరాయి’ (Mirai) పై సహజంగానే ఆసక్తి నెలకొంది. ఊహించని విధంగా పలుమార్లు వాయిదా పడిన ఈ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సోషియో ఫాంటసీ మూవీ ఎలా ఉందో చూద్దాం…

 

సామ్రాట్‌ అశోక్‌ కళింగ యుద్ధం గెలిచాక జరిగిన విధ్వంసాన్ని తలచుకుని పశ్చాత్తాప్పడతాడు. ఆ వినాశనానికి తనలోని దైవశక్తే ఓ కారణమని భావించి.. ఆ శక్తిని తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేసి.. వాటి రక్షణ బాధ్యతను తొమ్మిది మంది యోధుల చేతుల్లో పెడతాడు. కొన్ని శతాబ్దాల తర్వాత ఆ గ్రంథాలపై దుష్టశక్తి మహావీర్‌ లామా (మంచు మనోజ్) కన్నుపడుతుంది. అతను తనకున్న తంత్ర శక్తులతో ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న ఎనిమిది మహిమాన్విత గ్రంథాల్ని.. దానికి రక్షణగా ఉన్న యోధుల్ని తుద ముట్టించి హస్తగతం చేసుకుంటాడు. అయితే అతను కోరుకున్నట్లుగా అమరత్వాన్ని సాధించి.. ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలంటే తొమ్మిదో గ్రంథం అవసరమవుతుంది. కానీ, అమరత్వానికి సంబంధించిన ఆ గ్రంథాన్ని సొంతం చేసుకోవడం అంత తేలిక కాదు. ఎందుకంటే దానికి రక్షణగా ఉండేది అంబిక (శ్రియ) . మహావీర్‌ (Mirai Villain) రూపంలో ప్రపంచానికి ఎదురు కానున్న ముప్పును ముందే జ్ఞాన దృష్టితో చూసిన అంబిక.. అతన్ని ఎదుర్కొనేందుకు తనకు పుట్టిన బిడ్డ వేదను పసికందుగా ఉన్నప్పుడే దూరం చేసుకుంటుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అనాథగా వివిధ ప్రాంతాల్లో పెరిగిన వేద తన బాధ్యతను.. తల్లి ఆశయాన్ని ఎలా తెలుసుకుంటాడు?.. మహావీర్‌ లామా నుంచి ప్రపంచానికి ఎదురు కానున్న ముప్పును తప్పించేందుకు అతనేం చేశాడు? ఇందుకు అతనికి రాముడు సృష్టించిన మిరాయ్‌ అస్త్రం ఎందుకు అవసరమైంది? చివరికి యుద్ధంలో ఎవరు గెలిచారు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

 

త్రేతాయుగం నాటి రాముడి ఆయుధం ‘మిరాయ్’. దాన్ని పొందగలిగితే విజయం తధ్యం. మిరాయ్ ను అందుకోవడానికి వేద ఎలాంటి సాహసాలు చేశాడు? తన మీద తనకే నమ్మకం లేని అతను… ప్రజల కోసం, బ్లాక్ స్వార్డ్ తాంత్రిక శక్తుల నుండి వారిని కాపాడటం కోసం ప్రాణాలకు తెగించి ఎలా పోరాటం చేశాడనేది ఆసక్తికరంగా తెరకెక్కించాడు కార్తీక్ ఘట్టమనేని. హిమాలయాల్లో జన్మించి, కాశీ, కోల్‌కతా లో పెరిగి హైదరాబాద్ లో జీవితాన్ని సాగించే వేదను వెతుక్కుంటూ విభ (రితికా నాయక్) రావడం, అతని మనసును లక్ష్యం దిశగా మరల్చడం కూడా ఇంట్రస్టింగ్ గానే ఉంది. మిరాయ్ కోసం సాగించే అన్వేషణతో ప్రథమార్థం సాగితే, బ్లాక్ స్వార్డ్ కు చరమగీతం పాడటంతో ద్వితీయార్థం ముగిసింది. ‘హనుమాన్’ మూవీలో హనుమంతుడి సాయంతో ఓ సాధారణ యువకుడు విలన్ పని పట్టినట్టుగానే ఇందులోనూ క్లయిమాక్స్ లో శ్రీరాముని సాయం అతనికి లభించిందన్నట్టుగా చూపించారు. నేపథ్య గీతం, సంగీతంతో క్లైమాక్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్ళే ప్రయత్నం సంగీత దర్శకుడు గౌరహరి చేశాడు. సినిమా ఆసాంతం చందమామ కథను వెండితెరపై చూస్తున్నట్టు అనిపిస్తుంది. జటాయువు సోదరుడు సంపాతితో చేసే పోరాటం, రాముడు ధ్యానం చేసిన స్థలంలో జరిగే ఫైటింగ్‌, క్లైమాక్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక ప్రతినాయకుడు మంచు మనోజ్ పాత్ర నేపథ్యం, అతను అలా తయారు కావడానికి చూపించే కారణాలు ఇంకా బాగా చూపించి ఉంటే బాగుండేది. కథను.. వి.ఎఫ్.ఎక్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్‌ చేసే ప్రయత్నం సక్సెస్‌ అయిందనే చెప్పాలి.

తేజ సజ్జా తన పాత్ర వరకూ బాగా చేశాడు. మంచి ఈజ్‌తో నటించాడు. అతని ముందు సినిమా ‘హనుమాన్’లోని పాత్రతో పోల్చినా ఏమాత్రం తగ్గదనిపిస్తుంది. అయితే ఎంతో పాపులర్ అయిన ‘వైబ్ ఉంది బేబీ… వైబ్ ఉందిలే’ పాట లేకపోవడం నిరాశ కలుగుతుంది. నటి శ్రియా శరణ్ పుట్టినరోజు మర్నాడే రావడం ఓ రకంగా ఆమెకు ఇది బర్త్ డే గిఫ్ట్ అనుకోవచ్చు. జయరామ్ పాత్రను సీరియస్‌గా మొదలు పెట్టి కామెడీగా ఎండ్ చేశారు. అలానే జగపతి బాబు పాత్ర ఇంకా బాగా చూపించాల్సింది. ఇతర ప్రధాన పాత్రలను కిశోర్ తిరుమల, వెంకటేశ్ మహా, గెటప్ శ్రీను తదితరులు పోషించారు. ఈ సినిమాపై మంచు మనోజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దానికి తగ్గట్టే కొన్ని సన్నివేశాలలో హీరో కంటే మంచు మనోజ్ పాత్రకే ఎక్కువ ఎలివేషన్స్ లభించింది. తను కూడా బాగా కష్టపడ్డాడు. ఇక సీక్వెల్ తీయవచ్చనే ఆలోచనతో రానాతో తదుపరి భాగానికి లీడ్ ఇవ్వడం బాగుంది.  బేసికల్ గా సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్ ఘట్టమనేని తానే సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. దానికి నూటికి నూరుశాతం న్యాయం చేశాడు. ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌ గౌర హరి సంగీతం, వీఎఫ్‌ఎక్స్‌ అని చెప్పాలి. నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ కూడా ఏ విషయంలోనూ రాజీ పడకుండా నిర్మించారు. దాని ఫలితం తెర మీద కనిపిస్తోంది.

చందమామ కథలాంటి ‘మిరాయ్’
3.8
Acting 3
Visual Effets 4
Direction 4
Productions 4
Share This Article
Leave a review