ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి నగర నిర్మాణం ఒక అరుదైన చారిత్రక అవకాశమని ఆర్థిక సర్వే 2025–26 స్పష్టంగా పేర్కొంది. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసే అవకాశం గ్రీన్‌ఫీల్డ్ నగరాలకే ఉంటుందని సర్వే విశ్లేషించింది. ఇప్పటికే కిక్కిరిసిపోయిన నగరాల్లో జనాభా ఒత్తిడి పెరిగాక, సేవల కొరత ఏర్పడ్డాక మార్పులు చేయడం కంటే… మొదటి నుంచే జీవన విధానాన్ని డిజైన్ చేసుకునే అవకాశం అమరావతిలాంటి నగరాలకు ఉందని తెలిపింది. సులభతర జీవనం, సమతుల్య అభివృద్ధి, భవిష్యత్‌కు అనుగుణమైన మౌలిక సదుపాయాలతో అమరావతి “నెక్స్ట్ జనరేషన్ సిటీ”గా నిలిచే సామర్థ్యం కలిగి ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది.
భారీ మౌలిక సదుపాయాల మీద మాత్రమే ఆధారపడే నగరాలకంటే… విద్య, పరిశోధన, సాంకేతికత, ఇతర రంగాల మధ్య అనుసంధానం ఉన్న నగరాలే వేగంగా అభివృద్ధి చెందుతాయని సర్వే పేర్కొంది. రోడ్లు, భవనాలు మాత్రమే కాదు… మానవ వనరులు, ఆలోచనల మార్పిడి, సృజనాత్మక వాతావరణమే నగరాల అసలైన బలమని వివరించింది. ఈ కోణంలో చూస్తే అమరావతిని ఒక అద్భుతమైన జీవనయోగ్య నగరంగా తీర్చిదిద్దుకునే అవకాశముందని, దేశంలో అభివృద్ధి చెందుతున్న ఉత్తమ ఉదాహరణగా అమరావతిని సర్వే పేర్కొనడం విశేషం.
ఇదిలా ఉండగా, దేశంలో నివాసయోగ్యమైన అగ్ర పది నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తిరుపతి, విజయవాడ నగరాలు చోటు దక్కించుకోవడం రాష్ట్రానికి మరో గర్వకారణంగా మారింది. పుణె, నవీ ముంబయి, గ్రేటర్ ముంబయి, తిరుపతి, చండీగఢ్, ఠాణె, రాయ్‌పుర్, ఇండోర్, విజయవాడ, భోపాల్ ఈ జాబితాలో ఉన్నాయి. బెంగళూరు, దిల్లీ, ముంబయి లాంటి మెట్రో నగరాల మాదిరిగా తిరుపతి, విజయవాడ తీవ్ర జనాభా ఒత్తిడిని ఎదుర్కోవడం లేదని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఇక్కడ నగరీకరణ క్రమంగా జరుగుతోందని, మౌలిక సౌకర్యాలు, ఉద్యోగావకాశాలు సులభంగా లభిస్తున్నాయని వెల్లడించింది.

నిజమైన నివాసయోగ్య నగరాలు అంటే కేవలం కొత్తవి, ధనికమైనవే కావని ఆర్థిక సర్వే ఆసక్తికరంగా విశ్లేషించింది. రోజువారీ జీవనంలో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించి, వారి వ్యక్తీకరణకు, భాగస్వామ్యానికి అవకాశం కల్పించేవే అసలైన లైవబుల్ సిటీస్‌గా అభివర్ణించింది. మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా… ప్రజల సమయాన్ని గౌరవించడం, వారి ఎంపికలకు విలువ ఇవ్వడం, సృజనాత్మకతను ప్రోత్సహించడమే జీవన సౌలభ్యానికి అసలు కొలమానం అని పేర్కొంది.
ఈ అంశాన్ని వివరిస్తూ ఆర్థిక సర్వే అంతర్జాతీయ ఉదాహరణలను కూడా ప్రస్తావించింది. అమెరికాలోని డెట్రాయిట్‌లో జాతీయ రహదారులు, పరిశ్రమలు, స్టేడియాల నిర్మాణానికి భారీ పెట్టుబడులు పెట్టినా, ఆర్థిక ఉత్పాదకత ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జనాభా తగ్గిపోయిందని తెలిపింది. మరోవైపు బోస్టన్‌లో మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్నా, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలే నగరాన్ని ఆర్థిక, బయోటెక్ వంటి ఆధునిక రంగాల వైపు నడిపించాయని పేర్కొంది. అలాగే బెంగళూరులో దిల్లీ, ముంబయితో పోలిస్తే మౌలిక సౌకర్యాలు తక్కువే అయినా, ఇంజినీరింగ్ ప్రతిభ, స్టార్టప్ సంస్కృతి కారణంగానే అది భారతదేశ సిలికాన్ వ్యాలీగా ఎదిగిందని విశ్లేషించింది.
విద్య, ఆరోగ్యం, హౌసింగ్, నీరు, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, రవాణా, భద్రత, వినోదం వంటి అంశాలే జీవన సౌలభ్య సూచీలో ప్రధాన ప్రమాణాలని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఈ ప్రమాణాలను సమతుల్యంగా అమలు చేయగలిగితే అమరావతి మాత్రమే కాదు… ఆంధ్రప్రదేశ్‌లోని నగరాలన్నీ దేశానికి మార్గదర్శకంగా నిలవగలవన్న ఆశాభావాన్ని ఈ సర్వే వ్యక్తం చేసింది.
