జూనియర్ ఎన్టీఆర్‌ని నేను తిట్టలేదు.. టీడీపీ ఎమ్మెల్యే వీడియో వైరల్

Telugu BOX Office

అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయాన్ని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. అర్బన్ టీడీపీ కార్యాలయం ముందు బైఠాయించిన జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆఫీస్ వద్దకు వచ్చిన అభిమానులు.. దగ్గుపాటి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ని దూషిస్తూ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానితో మాట్లాడిన ఆడియో కాల్ రికార్డ్ గురించి ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి చేజారుతుండటంతో అక్కడి చేరుకున్న పోలీసులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దగ్గుపాటి లేరని కార్యాలయ సిబ్బంది సమాధానం ఇవ్వడంతో ఆఫీస్ ముందు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బైఠాయించారు.

అసలు తమ హీరోని అంత అసభ్యకరంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేకపోతే టీడీపీ లేదని, ఆయన అభిమానులు ఓటేయకుండానే దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే అయ్యారా? అని నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళన విరమించాలని పోలీసులు కోరగా వారు అంగీకరించలేదు. ఎమ్మెల్యే ప్రెస్‌మీట్ పెట్టి తమ హీరోకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, అంతవరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వారంతా ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్‌ పై తాను అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు వైరల్ అవుతోన్న ఆడియో కాల్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ స్పందించారు. ఆ ఆడియో తనది కాకపోయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చల్లార్చేందుకు క్షమాపణ చెబుతున్నానంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర అని ఆరోపించారు. తాను నారా, నందమూరి కుటుంబాలకు అభిమానినని. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానమని తెలిపారు. తన పేరు, ప్రతిష్ఠలని దిగజార్చడానికి ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ ఆడియో వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఆడియోలో ఉన్నది తాను కాదని, ప్రజలెవరూ అసత్యాల్ని నమ్మొద్దని కోరారు. ఈ వీడియో నాకు సంబంధించినది కాకపోయినా.. ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అయినందుకు వారందరికీ క్షమాపణలు చెబుతున్నానని ఎమ్మెల్యే దగ్గబాటి ప్రసాద్ అన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్ వైరల్ చేసినవారిపై కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Share This Article
Leave a Comment