టీ20లకు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ రిటైర్మెంట్

Telugu BOX Office

ఆధునిక క్రికెట్లో దిగ్గజాలుగా పేరొందిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. బార్బడోస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై థ్రిల్లింగ్ విక్టరీతో.. టీమిండియా విశ్వవిజేత నిలిచింది. మ్యాచ్ అనంతరం వీరిద్దరూ పొట్టి ఫార్మాట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఫైనల్లో 76 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన కోహ్లి ముందుగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. బార్బడోస్‌లోనే తాను భారత్ తరఫున చివరి టీ20 మ్యాచ్ ఆడేశానని చెప్పుకొచ్చాడు.

‘ఈ టీ20 వరల్డ్ కప్ నా చివరి గేమ్. మే అనుకున్నది సాధించాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ సాధ్యం కాదనే పరిస్థితి ఇది. భారత్ తరఫున చివరి టీ20 గేమ్ ఆడేశాను. ఇది ఓపెన్ సీక్రెట్. ఒక వేళ ఓడినా సరే నేను టీ20లకు వీడ్కోలు పలికేవాణ్ని. యువ ఆటగాళ్లు టీ20ల్లో జట్టును ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. ఐసీసీ ట్రోఫీ గెలవాలనే మా సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఇది నాకు ఆరో టీ20 వరల్డ్ కప్, రోహిత్‌కు 9వది. మా జట్టులో టైటిల్ సాధించడానికి అతడికే ఎక్కువ అర్హత ఉంది’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు.

అనంతం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తాను సైతం టీ20 ఫార్మాట్‌ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ‘ఇదే నా చివరి మ్యాచ్. వీడ్కోలు పలకడానికి ఇంతకు మించిన మంచి సమయం ఉండదు. ఈ ట్రోఫీ గెలవాలని ఎంతగానో పరితపించాను. నా మనస్సులోని భావాలను వ్యక్తపరచడానికి మాటలు సరిపోవడం లేదు’ అని రోహిత్ తెలిపాడు. ‘నేను అనుకున్నదే జరిగింది. ఈ కప్ గెలవడం కోసం ఎంతగానో పరితపించాను. ఈసారి మేం ఫైనల్లో గెలుపు గీత దాటగలిగాం’ అని రోహిత్ తెలిపాడు.

ద్వైపాక్షి సిరీస్‌ల్లో ప్రత్యర్థి జట్లను చిత్తు చేసే భారత్ ఐసీసీ టోర్నీల దగ్గరికి వచ్చేసరికి చేతులెత్తేయడం సర్వసాధారణమైపోయిన సంగతి తెలిసిందే. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం, 2023 జూన్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి.. గత ఏడాది నవంబర్లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో పరాజయం.. ఇలా ఐసీసీ టోర్నీలలో భారత్‌ పరాజయాలు అభిమానులకు మనోవేదనను మిగులుస్తున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కెరీర్ చివరి దశకు చేరుకున్న తరుణంలో వీరిద్దరు ప్రపంచకప్ ముద్దాడకుండానే క్రికెట్ వీడ్కోలు పలకాల్సిన పరిస్థితి వస్తుందేమోనని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా ఎంతో వేదన అనుభవిస్తున్నారు. వీటన్నింటికీ తెరదించుతూ భారత్ రెండోసారి టీ20 ప్రపంచకప్ అందుకోవడంతో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లకు ఘనంగా రిటైర్మెంట్ ప్రకటించారు.

భారత్ తరఫున 159 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 4231 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా రోహిత్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచి పొట్టి ఫార్మాట్లో ప్రస్థానం ప్రారంభించిన హిట్ మ్యాన్.. 2024లో సారథిగా టీమిండియాకు కప్ అందించడం ద్వారా తన ప్రయాణాన్ని ముగించాడు. ఇక 2010లో జింబాబ్వేపై టీ20 అరంగేట్రం చేసిన కోహ్లి.. 124 మ్యాచ్‌లు ఆడిన 48.38 స‌గ‌టుతో 4112 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 37 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

Share This Article
Leave a comment