రాయలసీమకి మహర్దశ… 23 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు

Telugu BOX Office

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో కొడికొండ చెక్‌పోస్టు సరిహద్దులో లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు గతంలో కేటాయించిన భూములు కలుపుకుని 23 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్, ఐటీ, పరిశ్రమలు.. ఇలా మొత్తం 16 క్యాటగిరీల పరిశ్రమల ఏర్పాటుకు అనుగుణంగా జోన్లుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. విశాఖ నగరానికి మాస్టర్‌ప్లాన్‌ అందించిన లీ అండ్‌ అసోసియేట్స్‌కు ఈ పారిశ్రామిక పార్క్‌ మాస్టర్‌ ప్లాన్‌ తయారీ బాధ్యతను అప్పగించారు. గతంలో లేపాక్షికి అప్పగించిన 8,844 ఎకరాలు పోగా మిగిలిన భూములను అధికారులు సేకరిస్తున్నారు. టేకులోడు దగ్గర 2 వేల ఎకరాలను సేకరించేందుకు ఏపీఐఐసీ ఇప్పటికే ప్రక్రియ మొదలు పెట్టింది. భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి సుమారు 14 వేల ఎకరాలు సేకరించే బాధ్యతలను ఏపీఐఐసీ చేపట్టగా ఎకరానికి రూ.7-14 లక్షల వరకు రైతులకు పరిహారం కింద చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన సుమారు రూ.800 కోట్లు అవసరమవుతుందని అంచనా వేసిన ఏపీఐఐసీ రుణం కోసం వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. సుమారు రూ.2 వేల కోట్లు రుణాన్ని సమీకరించుకునేందుకు ఏపీఐఐసీకి ప్రభుత్వం ఇటీవల అనుమతించింది. భూములు అవసరమైన ప్రాంతాన్ని బట్టి రైతులకు చెల్లించాల్సిన పరిహారాన్ని నిర్దేశిస్తున్నారు

బెంగళూరు జాతీయ రహదారికి ఇరువైపులా లేపాక్షి సెజ్‌ కోసం ప్రతిపాదించిన భూములు ఉన్నాయి. గతంలో లేపాక్షి సంస్థకు కేటాయించిన 8,844 ఎకరాలకు మధ్యలో ప్రైవేటు భూములు ఉండగా వాటిని అధికారులు సేకరిస్తున్నారు. దీనికి అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించే పని డిసెంబరు నాటికి కొలిక్కి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఏపీఐఐసీ సేకరించే భూములకు మధ్యలో గతంలో లేపాక్షి సంస్థకు కేటాయించిన భూములున్నాయి. దీంతో భారీ పారిశ్రామిక పార్కులో వాటినీ భాగస్వామ్యం చేయాలని ఏపీఐఐసీ భావిస్తోంది. భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి ప్రతిపాదించిన ప్రాంతం బెంగళూరు దేవనహళ్లి విమానాశ్రయానికి సుమారు 75 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా భూముల కోసం ఐటీ, పరిశ్రమలు అన్వేషిస్తున్నాయి. ఇక్కడ భూములను అందుబాటులో ఉంచడం ద్వారా రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి గంటన్నర వ్యవధిలో విమానాశ్రయానికి చేరుకోవచ్చు.

Share This Article
Leave a Comment