మాస్ మహారాజా రవితేజ, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. దసరా కానుకగా ఈ మూవీ ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో.. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పటికే ట్రైలర్, టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవితేజతో పాటు రేణుదేశాయ్‌పై ప్రశంసలు కురిపించారు.
విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ చూశా. మణిరత్నం తీసిన నాయకన్ సినిమా తెలుగులో ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశా. ఆ కోరిక పుష్ప చిత్రంతో తీరిపోయింది. టైగర్ నాగశ్వరరావు మూవీలో ఒక్కొక్క ఫ్రేమ్‌ను అద్బుతంగా తీశారు. ఈ చిత్ర డైరెక్టర్‌కు చాలా మంచి భవిష్యత్తు ఉంది. దర్శకుడు వంశీ ఫోన్ నంబరు తీసుకుని ఆయనతో మాట్లాడేంత వరకు నా మనసు ఆగలేదు. రవితేజ చేసిన విక్రమార్కుడు సినిమా కన్నడ, తమిళం, హిందీలో చేశారు. నీకున్న టాలెంట్‌ను ఎవరూ అందుకోలేరు. మన తెలుగు కీర్తిని దేశమంతట విస్తరింపచేయండి. నాకు అంతకు మించిన సంతోషం ఇంకొకటి లేదు.’అని అన్నారు.
అనంతరం రేణు దేశాయ్ గురించి చెబుతూ.. ‘ మీరు సినిమా ఫీల్డ్‌కు దూరంగా ఉన్నప్పటికీ.. మాకు ఎప్పటికీ దగ్గరే. మీ అబ్బాయిని త్వరలోనే హీరోను చేయాలి. అందులో మీరే తల్లిగా నటించాలి’ అంటూ నవ్వుతూ మాట్లాడారు. ఆయన మాటలు విన్నా రేణు దేశాయ్ చాలా సంతోషంగా కనిపించింది. రేణు దేశాయ్ ఆనందం చూస్తుంటే తప్పకుండా చేస్తానంటూ చెబుతున్నట్లే కనిపించింది. కాగా.. పవన్ కల్యాణ్‌తో రేణు దేశాయ్‌కి పెళ్లి కాగా.. అకీరా నందన్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే.