తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయ స్వామికి అనేక ప్రసిద్ధ ఆలయాలున్నాయి. అందులో మొదటిటి కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆలయం. అంజన్న అంటూ భక్తులు భక్తితో కొలిచే ఈ ఆంజనేయుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని నమ్మకం. కొండగట్టు పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 35 కి.మీ.లు, వేములవాడ క్షేత్రానికి కేవలం 30 కి.మీల దూరంలో ఉంది. ఆలయ ప్రాంగణంలో ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తుంటారు.
స్థల పురాణం
సుమారు 500 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరగణాలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టలో తన పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది. దాన్ని వెతికి వెతికి విసిగిపోయిన సంజీవుడు చెట్టుకింద సేదతీరుతూ నిద్రలోకి జారుకోగా ఆంజనేయస్వామి కలలోకి వచ్చి కోరంద పొదల్లో వెలసిన తనకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జాడ చెప్పాడట. కళ్లు తెరచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుడి ఆనందానికికి అవధుల్లేకుండా పోయాయి. భక్తిభావంతో కోరంద ముళ్లపొదల్లో వెతగ్గా స్వామివారి విగ్రహం కనిపించింది. దీంతో ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి చిన్న ఆలయం నిర్మించి పూజలు నిర్వహించేవాడని చరిత్రకారులు చెబుతారు.
నారసింహ వక్త్రంతో వెలసిన కొండగట్టు అంజన్న ఆలయానికి ఈశాన్య భాగంలోని గుహల్లో మునులు తపస్సు ఆచరించినట్లు ఆధారాలున్నాయి. శ్రీరాముడు సీత కోసం లంకకు వెళ్లే సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోగా ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వస్తుండగా అందులోంచి ఓ ముక్కరాలిపడి కొండగట్టుగా ప్రసిద్ధి పొందిందని మరికొందరు చెబుతుంటారు. ఆలయానికి వెళ్లే దారి పక్కన సీతాదేవి రోదించినట్టు చెప్పే కన్నీటి గుంతలు భక్తులకు దర్శనమిస్తాయి.
ఏటా చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ చిన్న జయంతి, వైశాఖ బహుళ దశమి నాడు వచ్చే పెద్ద హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి దీక్ష తీసుకున్న లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని ముడుపులు కట్టి వెళ్తుంటారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మూడ్రోజులపాటు హోమం నిర్వహిస్తారు. ఉగాది పండుగ రోజు స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది.
చైత్ర శుద్ధ నవమి రోజు శ్రీరావమనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండువగా జరుగుతుంది. శ్రావణ మాసంలో సప్తాహ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఏటా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నెల రోజుల పాటు తిరుప్పావై, గోదారంగనాయకుల కల్యాణం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం గావిస్తారు. దీపావళి పర్వదినం సందర్భంగా సహస్ర దీపాలంకరణతో ఆలయాన్ని తీర్చిదిద్దుతారు.
కొండగట్టుకు ఇలా చేరుకోవచ్చు..
హైదరాబాద్‌కు 160 కి.మీ.ల దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్లేందుకు ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి జగిత్యాలకు వెళ్లే బస్సు ఎక్కితే కొండగట్టులో దిగొచ్చు. కరీంనగర్ నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు సర్వీసు ఉంది. కరీంనగర్ నుంచి క్యాబ్‌లు, ఆటో సౌకర్యం కూడా ఉంటుంది.