మా నాన్నతో కలిసి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టడమనే ఆనందం త్రివిక్రమ్ గారిచ్చారు

*“మా నాన్నతో కలిసి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టడమనే ఆనందం త్రివిక్రమ్ గారిచ్చారు”
– ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్*

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల్ని బద్దలుకొడుతూ దూసుకుపోతోంది. పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించారు. మొదటి వారంలోనే ‘అల వైకుంఠపురములో’ మూవీ 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ నాన్-బాహుబలి2 రికార్డుల్ని సృష్టించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం ఆదివారం సాయంత్రం వైజాగ్ లో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
ఈ ఉత్సవంలో ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాష్ మాట్లాడుతూ “ఆర్ట్ డైరెక్టర్ గా నా మొదటి సినిమా ‘ఆర్య’. మళ్లీ ఇన్నాళ్లకు అల్లు అర్జున్ సినిమాకు పనిచేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు నేను వేసిన సెట్స్ అందరికీ నచ్చినందుకు హ్యాపీ” అన్నారు.
నటుడు అజయ్ మాట్లాడుతూ “ఈ సినిమా ఒక మ్యాజిక్. ప్రతి డైలాగ్, ప్రతి సీన్ నాకు చాలా బాగా నచ్చాయి. బన్నీ ఈ సినిమాని తన భుజాలపై మోసుకువెళ్లారు” అని తెలిపారు.
ఏపీ టూరిజం మినిస్టర్ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ “బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ హిట్ కొట్టిన చినబాబు గారు తనపేరును పెదబాబుగా మార్చుకోవాలి. అలాగే మా గురువు, బావగారు అల్లు అరవింద్ గారు బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. మొన్న ఆడియో ఫంక్షన్ లో బన్నీ గారు చెప్పినట్లు అరవింద్ గారు ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఇన్ని సంవత్సరాలు సినిమా రంగంలో ఉండటం, ఇన్ని విజయవంతమైన సినిమాలు నిర్మించడం, అదురూబెదురూ లేని జీవనప్రయాణం సాగించడం ఆయన తల్లితండ్రులు చేసిన పుణ్యం. మెగా అభిమానులకు చిరంజీవి గారు దేవుడైతే, అరవింద్ గారు క్షేత్ర పాలకుడు లాంటివారు. చిరంజీవి గారి జర్నీలో అరవింద్ గారి పాత్ర ఎంతో కొంత ఉంది. ఒక రైటర్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో ఇదివరకు దాసరి నారాయణరావు గారిని చూశాం, ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని చూస్తున్నాం. నంబర్ వన్ స్థానంలో ఉన్న పూజా హెగ్డే రాబోయే రోజుల్లో ఈ విజయ పరంపరను కొనసాగించాలని ఆశిస్తున్నా. అరవింద్ గారు, చినబాబు గారు విశాఖపట్నంలో ఫిల్మ్ ఇండస్ట్రీని నెలకొల్పడంలో ముందడుగు వెయ్యాలని కోరుతున్నా. సినిమా ఇండస్ట్రీని నెలకొల్పడానికి అనుకూలమైన వాతావరణం ఉన్న నగరం ఇది. అరవింద్ గారు తన అదృష్టాన్ని విశాఖ నగరానికి కూడా అందించాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.
హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ “ఈ సినిమా సక్సెస్ గురించి ఇదివరకే ఇంటర్వ్యూల్లో మాట్లాడేశాను. అదే విషయాన్ని మళ్లీ తెలుగులో చెప్తాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఒక సినిమాకి సక్సెస్ రావాలంటే అది టీం ఎఫర్ట్ వల్లే సాధ్యమవుతుంది. అందుకే మా మొత్తం బృందానికి కంగ్రాట్స్. నాకు ఇంత పెద్ద హిట్టిచ్చినందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు థాంక్స్. నన్ను ఇంత అందంగా చూపించినందుకు థాంక్స్. ‘బుట్టబొమ్మ’ పాట మొత్తం నామీద రాసినందుకు థాంక్స్. ఇప్పుడు నేను తెలుగు అమ్మాయిని అయిపోయాను. షారుఖ్ ఖాన్, సుస్మితా సేన్ లాంటి ‘ఆరా’ను అల్లు అరవింద్ గారిలో చూస్తున్నాను. చినబాబు, నాగవంశీ లాంటి అందమైన హృదయమైన నిర్మాతల్ని నేను అదివరకు కలవలేదు. బంటూ (అల్లు అర్జున్ ను ఉద్దేశించి) మీ గురించి మాట్లాడాలంటే కొంచెం ప్రాబ్లెం ఉంది. ఎందుకంటే ఆడియెన్స్ మీ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. వాళ్లు మిమ్మల్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనీ, మల్లు అర్జున్ అనీ, టిక్ టాక్ స్టార్ అల్లు అర్జున్, గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ అల్లు అర్జున్ అని అంటుంటారు. మీతో హీరోయిన్ గా రెండోసారి నటించాను. రాబోయే రోజుల్లో మీరు మరింత సక్సెస్ కావాలని ఆశిస్తున్నా. మళ్లీ మీతో కలిసి నటించాలని ఆశిస్తున్నా. కొన్ని జాతకాలంతే. తమన్ తన మ్యూజిక్ తో సినిమాని ఎలివేట్ చేశారు. ఈ సీజన్ లో అవార్డ్స్ అన్నీ అతనికే వస్తాయి. తెలుగు ఫ్యాన్స్ లాగా ఏ ఫ్యాన్స్ లేరు” అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ “జనవరికి ఎలా గెలవాలని ఆరు నెలలుగా మానసికంగా పరిగెత్తుతూ వచ్చాం. దాంతో బ్రెయిన్ కొంచెం చిక్కిపోయింది. బన్నీ, త్రివిక్రమ్ వల్లే ఈ ఆల్బం ఇలా వచ్చింది. ఈ భూగ్రహం పైనే కూలెస్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్. పదేళ్ల కాలంలో వంద సినిమాలు చేశాను. త్రివిక్రమ్ గారితో పనిచేయడానికి నాకు పదేళ్లు పట్టింది. అందుకే పదేళ్లు మించిపోయే పాట ఇచ్చాను. సాధారణంగా ఒక దర్శకుడితో పరిగెత్తడం కష్ట. అదే రైటర్ కూడా అయిన దర్శకుడితో పరిగెత్తడం మరీ కష్టం. ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ఇప్పుడు ఈ సినిమాతో బన్నీతో హ్యాట్రిక్ సాధించాను. సాధారణంగా సైకిల్ ట్యూబులు పంక్చరవడం మనం చూస్తుంటాం. ఈ సినిమాకి యూట్యూబులే పంక్చరయ్యాయి. ఇండియాని కాపాడ్డానికి బోర్డర్లో ఆర్మీవాళ్లు ఉంటారు. కానీ మన తెలుగు భాషను కాపాడే ఒకే సోల్జర్ త్రివిక్రమ్ గారు. ఆయన అమ్మలాంటి మనిషి. ఆయనను జాగ్రత్తగా కాపాడుకుందాం. నిర్మాతలు రాధాకృష్ణ, అరవింద్ గార్లు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. వంద మిలియన్ కాదు వెయ్యి మిలియన్ వ్యూస్ కొడతాం” అని తెలిపారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “మా నాన్న అల్లు రామలింగయ్య గారిని తలుచుకొని మాట్లాడుతున్నా. సినిమా అనేది అందరికంటే గొప్పది. ఇది 2020. 2060లోనూ ఈ సినిమా పాటలు పాడతారని నేను ప్రామిస్ చేస్తున్నాను. ‘శంకరాభరణం’కు నేను పనిచేశాను. ఆ సినిమా పాటలు ఇప్పటికీ పాడుకుంటున్నారు. ఒక గొప్ప సినిమాకు, ఒక గొప్ప సంగీతం తోడైతే, అది వందేళ్లు నిలిచిపోతుంది. అలాగే ఈ సినిమాని వంద సంవత్సరాలు ఉంచుతారు. ఇది వాస్తవం. నేను కర్నూలులో ఈ సెలబ్రేషన్స్ పెట్టుకుందామని బన్నీతో అంటే, నాకు ‘వైజాగే కావాలి’ అన్నాడు. కోట్లాది మంది చూసిన సినిమాలో బన్నీ ఎలా చేశాడో చెబితే అపహాస్యంగా ఉంటుంది. మాకు కడుపు నిండిపోయింది. త్రివిక్రమ్ కు మాటల మాంత్రికుడు అనే మాట తక్కువగా అనిపిస్తుంది. అతను మాటల మాంత్రికుడు కాదు, సెల్యులాయిడ్ తాంత్రికుడు. తాంత్రికుడు మనను మాయలో ఉంచేస్తాడు. మూడు గంటల సేపు అలా మనల్ని ఉంచే తాంత్రికుడు త్రివిక్రమ్. నా కొడుకుకి ఇలాంటి సినిమా ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు. ఈ వయసులో నాకు చినబాబు లాంటి మంచి మిత్రుడు దొరకడం నా అదృష్టం. మీరు (ప్రేక్షకులు) లేకపోతే మేము లేము, ఈ సినిమా లేదు, ఈ పండగ లేదు. మీకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను” అని చెప్పారు.
దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ “నేను వైజాగ్ లోనే చదువుకున్నా. వైజాగ్ అంటే నాకు గుర్తొచ్చేవి అందమైన అమ్మాయిలు, ఆంధ్రా యూనివర్సిటీ, ఆహ్లాదకరమైన బీచ్. శ్రీశ్రీ, చలం గారు, రావిశాస్త్రి గారు, సీతారామశాస్త్రి గారు వంటి సాహితీపరుల్ని అందించిన మహానగరం ఇది. ఈ సినిమాని తన భుజం మీద మోసుకుంటూ తీసుకొచ్చిన తమన్ కు థాంక్స్. విలువలతో సినిమా తియ్యండి, మేమెందుకు ఆదరించమో చూపిస్తామని మీరంతా చెప్పారు. అది మాకే కాదు, తెలుగు సినిమాకే నమ్మకాన్నిచ్చింది. పూజా హెగ్డే, టబు గారు, నివేదా పేతురాజ్, రోహిణి గారు పోషించిన గౌరవప్రదమైన స్త్రీ పాత్రల్ని మేం గుండెల్లో పెట్టుకుంటామని వాళ్లను ప్రేమించి ఈ సినిమాని మీరంతా అంత ముందుకు తీసుకువెళ్లారు. మీ సంస్కారానికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. చెన్నైలో పుట్టి పెరిగిన తెలుగువాడు సినిమాటోగ్రాఫర్ వినోద్, వైజాగ్ వాడైన ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ కలిసి ఈ సినిమాని విజువల్ గా వేరే స్థాయికి తీసుకువెళ్లారు. అన్నింటికీ మించి ఈ కథను విన్నప్పటి నుంచీ ఈ రోజు దాకా వదిలేయకుండా ముందుండి నడిపించిన మన బన్నీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఒక ఆఫీస్ బాల్కనీలో మొదలుపెట్టిన ఈ ప్రయాణాన్ని వైజాగ్ ఆర్కే బీచ్ దాకా విజయవంతంగా తీసుకువచ్చి ఈ కథకీ, ఈ సినిమాకీ తనే నాయకుడై నడిపించిన మన కథానాయకుడు బన్నీ. అతనిలో ఎంత పరిణితి కనిపించిందని, మేమేం అనుభూతికి లోనయ్యామో మీరందరూ అదే అనుభూతికి లోనయ్యామని మీరు చెబుతుంటే ఆనందించాం. తను ఇంటర్వెల్లో కనిపించే దృశ్యాల్లో కానీ, క్లైమాక్సులో యాక్ట్ చేసిన దృశ్యాల్లో కానీ, కామెడీ పండించడంలో కానీ, సెంటిమెంటులో కానీ, పాటలు కానీ, ఫైట్లు కానీ.. బంటూని ముందుపెట్టి బన్నీ వెనకాల నిల్చున్నాడు. ఇది చాలా పరిణితితో చెయ్యాల్సిన ఫీట్. కమర్షియల్ హీరోకి రేజర్ ఎడ్జ్ మీదుండే ఫీట్. కొంచెం అటైనా, ఇటైనా అభాసుపాలైపోయే ఫీట్. ఇంత రిస్కుని బలంగా నమ్మి ఈ సినిమాని ఇక్కడి దాకా తీసుకురాగలిగిన బన్నీ.. నాకు తెలిసి తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లగలడు. ఆయన సినిమాని ఎంతగా ప్రేమిస్తాడో నాకు తెలుసు కాబట్టి, మన నేల నుంచి మన కథని గొప్ప సినిమాలుగా ప్రపంచం నలుమూలలకీ చెప్పేంత శక్తిని ఆయనకు మనమందరం ఇవ్వాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ “నా ఫస్ట్ సినిమా ఇక్కడ (వైజాగ్) షూట్ చేశాను. ఇప్పటికి ఇరవై సినిమాలు చేశాను. నా విజయం, నా జర్నీ ఎప్పుడూ వైజాగ్ ప్రజలతోనే ఉంది. మళ్లీ వైజాగ్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకరు నాతో ‘ప్రతి ఒక్కరికీ ఒక కంచుకోట ఉంటుంది. మీ కంచుకోట వైజాగ్ అండీ’ అన్నారు. నిజంగా అది కలెక్షన్లు చూస్తే తెలుస్తుంది. థాంక్యూ వెరీ మచ్ వైజాగ్. నా మొట్టమొదటి థాంక్యూ తెలుగు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ఫోన్లో వొచ్చేస్తున్నాయ్, టీవీలో వచ్చేస్తున్నాయ్, థియేటర్లకు జనం రావట్లేదు అనే టైంలో.. మీరు మంచి సినిమా ఇవ్వండి, మేం తెలుగువాళ్లం అందరం కలిసికట్టుగా థియేటర్లకు వచ్చి చూస్తాం.. అని చెప్పిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎలాంటి ఆల్బం కావాలని తమన్ అడిగాడు. 1 బిలియన్ వ్యూస్ వచ్చే ఆల్బం కావాలన్నాను. నిజంగా తను 1 బిలియన్ వ్యూస్ వచ్చే ఆల్బమే ఇచ్చాడు. మాట నిలబెట్టుకున్నందుకు అతనికి థాంక్స్. ‘సామజవరగమన’ పాటతో ‘సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అనిపించుకున్నాడు. ప్రపంచమంతా ఇది అతనికిచ్చిన బిరుదు. అలాగే ‘రాములో రాములా’తో ‘చార్ట్ బస్టర్ ఆఫ్ ది ఇయర్’ అనిపించుకున్నాడు. అలాగే ఒక దాన్ని మించి ఒకటి అన్నట్లుగా ‘ఓ మైగాడ్ డాడీ’, ‘బుట్టబొమ్మ’, ‘అల వైకుంఠపురములో’, ‘సిత్తరాల సిరపడు’ పాటలు ఇచ్చి, ‘ ఆల్బం ఆఫ్ ద డికేడ్’ అనిపించుకున్నాడు. నిజంగా తమన్ నేను ఇష్టపడే మ్యూజిక్ డైరెక్టర్. ఎంతో కష్టపడుతూ వచ్చి ఈ సినిమాతో టాప్ మ్యూజిక్ డైరెక్టరుగా కిరీటం పెట్టుకున్నాడు. ఆ కిరీటాన్ని ఈ డికేడ్ అంతా దింపకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మిగతా టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఆర్టిస్టులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేడం సార్ మేడం అంతే అన్నట్లు పూజ తెలుగులో బాగా మాట్లాడింది. టబు గారు, ఈశ్వరీరావు, రోహిణి వంటి చాలామంది ఆడవాళ్లు చేశారు. వాళ్లందరికీ నీరాజనంగా ఈ సినిమాలోని డైలాగ్.. ‘దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది.. ఒకటి నేలకి, రెండు వాళ్లకి. అలాంటివాళ్లతో మనకు గొడవేంటి సార్. సరండరైపోవాలంతే’. ‘జులాయి’తో మేం మొదలుపెట్టిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో ఇప్పుడు మూడో సినిమా చేశాను. తన హీరోని ఒక మెట్టు పైకెక్కించాలనే ప్రేమతో నిర్మాత రాధాకృష్ణ గారు సినిమాలు తీస్తారు. ఆయనకు థాంక్స్. ఇక నన్ను ‘గంగోత్రి’తో హీరోగా పరిచయం చేసిన మా నాన్న, ఆ తర్వాత ‘బన్నీ’, ‘హ్యాపి’, ‘బద్రినాథ్’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ తీశారు. ఆయనకు థాంక్స్. టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఎంత బాగా చేసినా హిట్టు మాత్రం ఒక్క డైరెక్టర్ గారే ఇస్తారు. మా అందరికీ హిట్టిచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. సినిమాని ఒక పెయింటింగ్ అనుకుంటే, దానికి హీరో ఒక కాన్వాస్ కావచ్చు. ఆ కాన్వాస్ నిలిపే ఫ్రేం ఒక ప్రొడ్యూసర్ అవ్వొచ్చు. ఆ పెయింటింగ్ వేసే బ్రష్షులు టెక్నీషియన్స్ అవ్వొచ్చు. ఆ పెయింటింగ్ మీద మేగ్నిఫిసియంట్ కలర్స్ ఆర్టిస్టులు అవ్వొచ్చు. కానీ ఈ మొత్తం పెయింటింగును ఊహించి, తనొక్కడే గీసి,దానికి ఒక రూపం తీసుకొచ్చే ఆర్టిస్టే డైరెక్టర్. అలాంటి త్రివిక్రమ్ గారి గురించి నేనెంత చెప్పినా తక్కువే. నేను చాలా సినిమాలు చేశాను. అందులో నేను అది బాగా చేశాను, ఇది బాగా చేశానని చెప్తారు. కానీ నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎవరు ఫోన్ చేసినా నా పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పారు. అంతటి గిఫ్ట్ నాకిచ్చారు త్రివిక్రమ్ గారు. మా నాన్నగారు ఎన్నో హిట్లు తీశారు. చిరంజీవి గారితో కొల్లలుగా హిట్లు తీశారు. ఇండస్ట్రీ హిట్లు తీశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టారు. చరణ్ తో ‘మగధీర’ తీసి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టారు. హిందీలో ఆమిర్ ఖాన్ తో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టారు. ఎప్పటికైనా మా నాన్నగారితో ఒక్క ఇండస్ట్రీ రికార్డ్ సినిమా కొట్టాలి అనుకొనేవాడ్ని. నిజంగా ఈ సినిమాతో ఫస్ట్ టైం ఇండస్ట్రీ హిట్ కొడుతున్నా. ఇది నాకు స్వీటెస్ట్ మెమరీ. మా నాన్నతో కలిసి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టడమనే ఆనందం త్రివిక్రమ్ గారిచ్చారు. ఇదొక్కటి చాలు.. థాంక్యూ సో మచ్. ఎవరితో రికార్డ్ కొట్టినా ఇంత ఆనందం సంపూర్ణంగా ఉండేది కాదు. మా మొత్తం ఫ్యామిలీ తరపున థాంక్యూ సర్. చివరగా నా ఫ్యాన్స్ కు థాంక్యూ. ఇవాళ పొద్దున వైజాగ్ కు వస్తుంటే 500 బైకులు ర్యాలీగా వచ్చాయి. వాటిని చూసి పూజ ‘హౌ డు ఫీల్ అర్జున్?’ అనడిగింది. పూజా.. ఒకటిన్నర సంవత్సరం గ్యాప్ తీసుకొని, ఒక రూములో ఒక ఖాళీ గోడమీద ఏమీ లేనిచోట నేనది ఊహించా.. వాళ్లలా వస్తారని. అదివాళ నా కళ్లారా చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. మొన్న చెప్పిందే మళ్లీ చెప్తున్నా. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. మీరందరూ గర్వించే స్థాయివరకూ నేను వెళ్తాను. ఇది నా మొదటి మెట్టు. ఈ మొత్తం దశాబ్దం ఎలా చేశానని చూసుకుంటే నాకు సంతృప్తి కలగలేదు. ఇలా చేశానేమిటి, ఇంకా గొప్పగా చెయ్యాలి కదా.. అనుకున్నాను. ఏదైనా బలం కావాలనిపించింది. 2020 మొదట్లో ఆ బలం చూపించిన ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కచ్చితంగా ఇది నా మొదటి అడుగుగా భావించి, మీ దీవెనలు తీసుకొని, మీ అందరికీ దండం పెట్టుకొని ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఎప్పట్నించో నన్ను సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. మెగా అంటే అందరం. ఇవాళ సినిమా ఇండస్ట్రీలోనే ఒక బిగ్గెస్ట్ సినిమాగా నిలవబోతోంది. ఒక గొప్ప సినిమా చూసిన ఫీలింగ్ శాశ్వతం. రికార్డులనేవి వెరీ వెరీ టెంపరరీ. ఇప్పుడు నేను కొడతాను, ఆర్నెల్ల తర్వాత ఇంకొకరు కొడతారు. అలా కొడుతూనే ఉంటారు. మీ మనసుకి ఎంజాయ్మెంట్ ఇచ్చాను కదా, అది అమూల్యమైంది. దానిముందు రికార్డులనేవి నథింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే రికార్డ్స్ ఆర్ టెంపరరీ, ఫీలింగ్స్ ఆర్ ఫరెవర్” అని చెప్పారు.

హైలైట్స్
* శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ విజయోత్సవంలో స్టేజిపై హుషారుగా సింగర్స్ పాడిన అల్లు అర్జున్ సినిమాల్లోని పాటలు, డాన్సర్ల పర్ఫార్మెన్సులు అమితంగా అలరించాయి.
* హీరోయిన్ పూజా హెగ్డే ‘సామజవరగమన’ పాటలోని “నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి నా కళ్లు.. నా చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు” అనే లైన్ పాడి అలరించింది.
* హీరో డైరెక్టర్లు అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఒకేసారి వేదిక వద్దకు రావడంతో ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు.
* ‘సిత్తరాల సిరపడు’ పాటను ఆలపించిన గాయకుడు సూరన్నను స్టేజిపైకి వచ్చి అల్లు అరవింద్ కౌగలించుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
* ‘ఓ మై గాడ్ డాడీ’ పాటకు ప్రఖ్యాత సంగీతకారుడు డ్రమ్స్ శివమణి పర్ఫార్మెన్స్ ఇవ్వగా, రోల్ రైడా బృందం ఆ పాటను ఆలపించింది.
* హీరోయిన్ పూజా హెగ్డే “వైజాగ్ సార్.. వైజాగ్ అంతే” అంటూ తన స్పీచ్ ను మొదలుపెట్టడంతో కింద కుర్చీలో కూర్చున్న బన్నీ ‘వ్వావ్’ అంటూ గట్టిగా నవ్వేశారు.
* సూరన్న కోసం బన్నీ తెచ్చిన కోటును తమన్ స్వయంగా ఆయనకు తొడగగా, తనకు ఈ సినిమాలో పాడే అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ కు, తమన్ కు థాంక్ చెప్పి మరో గాయకుడు సాకేత్ తో కలిసి ‘సిత్తరాల సిరపడు’ పాటను ఆలపించారు.
* డ్రమ్మర్ శివమణి ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఆహూతులను మెస్మరైజ్ చేసింది. సూట్ కేసు, వాటర్ క్యాన్ వంటి వస్తువులపై కూడా స్వరాలు పలికించడమే కాకుండా అరవింద్, త్రివిక్రమ్, పూజా హెగ్డేల చేత కూడా డ్రమ్స్ పై స్వరాలు పలికింపజేశారు. కిందికి వెళ్లి మరీ బన్నీని స్టేజిపైకి తీసుకు వచ్చారు. అయితే బన్నీ పూజతో కలిసి ‘రాములో రాములా’ సాంగ్ సిగ్నేచర్ స్టెప్ వేసి అలరించారు.