‘అన్‌స్టాప‌బుల్ 2’ ప్రోమో… బావగారు, అల్లుడితో బాలయ్య సందడి

ఆహా ఓటీటీలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న అన్‌స్టాప‌బుల్ 2కు రంగం సిద్ధమైపోయింది. టాలీవుడ్ అగ్ర హీరో, టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్యవ‌హ‌రిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గెస్ట్ రానున్నారు. ఈ షోకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా… మంగ‌ళ‌వారం సాయంత్రం ఆహా యాజ‌మాన్యం ప్రోమోను విడుద‌ల చేసింది.

5.31 నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రోమోలో బాల‌య్య చాలా క్లిష్టమైన ప్రశ్నలు సంధించ‌గా… చంద్రబాబు ఏమాత్రం తగ్గకుండా అదిరిపోయే సమాధానాలు చెప్పారు. స‌ర‌దా ప్రశ్నల‌తో పాటు సీరియ‌స్ ప్రశ్నల‌ను కూడా బాల‌య్య సంధించారు. 1995లో టీడీపీ చీలిక‌పైనా ప్రశ్న రాగా చంద్రబాబు ఏమాత్రం త‌డుముకోకుండానే స‌మాధానం ఇచ్చారు. నాడు తాను చేసిన ప‌ని త‌ప్పంటారా?అంటూ బాల‌య్యను ఎదురు ప్రశ్నించారు.

ఈ షో నారా లోకేష్ ఎంట్రీ ఇచ్చారు. బాలయ్య అడిగిన ప్రశ్నలకు ఎలాంటి బేషజాలకు పోకుండా సమాధానాలు చెప్పి ఆకట్టుకున్నారు. మంగ‌ళ‌గిరిలో ఓట‌మిపైనా హుందాగా స్పందించారు. కాసేపు హోస్ట్ సీటులో కూర్చున్న లోకేశ్ తండ్రితో పాటు మామ‌య్యకు కూడా ప్రశ్నలు వేసిన తీరు ఆక‌ట్టుకుంది. ఈ షో ఈ నెల 14న ఆహాలో టెలికాస్ట్ కానుంది.