ఖమ్మం: మహిళా కానిస్టేబుళ్లు ట్రిపుల్ రైడింగ్… కమిషనర్ సీరియస్, భారీగా ఫైన్


తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ఒకే స్కూటీ ఎక్కారు. పైగా హెల్మెట్ ధరించలేదు. రోడ్డు మీద వాహనం దూసుకెళుతుండగా వారిలో ఇద్దరు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌ సమీపంలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు స్కూటీపై ఈ విధంగా వెళ్తుండగా కొందరు ఫోటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ ఫోటో వైరల్‌ కావడంతో నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు కేవలం సామాన్యులకేనా.. పోలీసులకు వర్తించవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఖమ్మం పోలీస్‌ కమిషనర్ విష్ణు ఎస్‌.వారియర్‌ వద్దకు వెళ్లడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి రూ.3,300 జరిమానా విధించడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.