‘గాండీవ‌ధారి అర్జున‌‘ మూవీ రివ్యూ

Telugu BOX Office
బాక్సాఫీస్ వద్ద గురి తప్పిన అర్జునుడు
2.5

చిత్రం: గాండీవధారి అర్జున; నటీనటులు: వరుణ్‌ తేజ్‌, సాక్షి వైద్య, నాజర్‌, విమలా రామన్‌, వినయ్‌ రాయ్‌, బర్నాబాస్ రెటి,లీ నికోలస్ హారిస్,వినయ్ నలకడి, తదితరులు; సినిమాటోగ్రఫీ: ముఖేశ్‌; ఎడిటింగ్‌: ధర్మేంద్ర కాకరాల; కళ: శివ కామేశ్‌; సంగీతం: మిక్కీ జె.మేయర్‌; నిర్మాణ సంస్థ: శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర; నిర్మాతలు: బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రవీణ్‌ సత్తారు; విడుదల తేదీ: 25-08-2023

యాక్షన్ చిత్రాల‌కి త‌గ్గ క‌థానాయ‌కుడు వ‌రుణ్‌తేజ్. ప్రవీణ్ స‌త్తారు కూడా ఈ మ‌ధ్య వ‌రుస‌గా యాక్షన్ క‌థ‌ల‌తోనే ప్రయాణం చేస్తున్నారు. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ప‌ట్టాలెక్కిన ‘గాండీవ‌ధారి అర్జున‌’ ప్రేక్షకుల్లో అంచ‌నాల్ని పెంచింది. ‘గ‌ని’ పరాజయం తర్వాత త‌ర్వాత వ‌రుణ్‌తేజ్ న‌టించిన సినిమా ఇదే. అసలు సినిమా ఎలా ఉంది? ఈ సినిమాతోనైనా వ‌రుణ్ విజ‌యాన్ని అందుకున్నాడా..? తెలుసుకునే ముందు క‌థేమిటో తెలుసుకుందాం.

భారత్‌కు చెందిన పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య రాజ్ (నాజర్) లండన్‌లో జరిగే యూఎన్ క్లైమేట్ సమావేశాలకు వెళ్తాడు. మంత్రి పీఏగా ఐరా ఉంటుంది. అక్కడ యూనివర్సిటీకి చెందిన ఓ అమ్మాయి మంత్రిని కలిసి ‘ఫైల్ 13’ గురించి చెప్పాలని అనుకుంటుంది. ఆ ‘ఫైల్ 13’ కోసం క్లీన్ అండ్ గ్రీన్ (సీ అండ్ జీ)కంపెనీ అధినేత రణ్వీర్ (వినయ్ రాయ్) ప్రయత్నిస్తాడు. తన కంపెనీ సీక్రెట్లు అందులో ఉండటంతో దాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. అసలు ఆ ఫైల్‌లో ఏముంది? రణ్వీర్‌కు మంత్రికి ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలోకి అర్జున్ వర్మ (వరుణ్ తేజ్) ఎలా వస్తాడు? అర్జున్ వర్మ, ఐరా (సాక్షి వైద్య)కి ఉన్న రిలేషన్ ఏంటి? చివరకు అర్జున్ వర్మ ఏం చేశాడు? అనేది మిగతా కథ.

ఏం చెప్పామ‌నే విష‌యం కంటే ఎలా చెప్పామ‌న్నదే సినిమాకి కీల‌కం. క‌థ‌లో ఎంత మంచి అంశం ఉన్నా స‌రే.. దాన్ని ఆస‌క్తిక‌రంగా చెప్పక‌పోతే అంతా వృథానే. సినిమాకి ఎన్ని హంగులు జోడించారు? హీరో ఎంత స్టైలిష్‌గా క‌నిపించాడు? మేకింగ్ ఎంత స్టైల్‌గా ఉంద‌నే విష‌యాలు కొంత‌వ‌ర‌కు ప్రభావం చూపించొచ్చు కానీ.. సినిమాను గ‌ట్టెక్కించాల్సింది మాత్రం ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాలే . కానీ ఈ సినిమాలో లోటుపాట్లన్నీ కీల‌క‌మైన ఆ క‌థ‌, క‌థ‌నాల విష‌యంలోనే. ట్రైల‌ర్ చూస్తేనే ఈ క‌థ తెలిసిపోతుంది. తెర‌పై అద‌నంగా చూపించింది ఏమిటంటే.. స్టైల్‌గా క‌నిపించే హీరో, విల‌న్ గ్యాంగ్ అంతే స్టైల్‌గా ఒక‌రినొక‌రు కాల్చుకోవ‌డం. అమ్మ నేప‌థ్యంలో స‌న్నివేశాలు, అమ్మాయితో ప్రేమ నేప‌థ్యం ఉన్నా ఆ స‌న్నివేశాలు ఏమాత్రం హ‌త్తుకునేలా లేవు. ఉన్న క‌థ‌నైనా మంచి మ‌లుపుల‌తో ఆస‌క్తిక‌రంగా చెప్పారా అంటే అదీ లేదు. ఒక దాని వెనుక ఒక‌టి స‌న్నివేశాలు అలా సాగిపోతుంటాయంతే. ప్రపంచ దేశాల వ్యర్థాల నిర్వహ‌ణ‌, పర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ నేప‌థ్యాన్ని ఎంచుకుని దానికి సెంటిమెంట్ కూడా జోడించే ప్రయత్నం చేసినా అది అనుకున్నట్లుగా కుద‌ర‌లేదు. దాంతో ఏ ద‌శ‌లోనూ సినిమా ఆస‌క్తి రేకెత్తించ‌దు. . ప్రథ‌మార్ధం త‌ర్వాత చాలా స‌న్నివేశాలు లాజిక్ లేకుండా సాగిపోతుంటాయి. ప‌తాక స‌న్నివేశాలు.. క‌లుషిత‌మ‌వుతున్న ప‌ర్యావ‌ర‌ణంపై తీసిన ఓ డాక్యుమెంట‌రీని చూపెడుతూ, ఉప‌దేశం ఇస్తున్నట్టే ఉంటాయి. హీరో స్టైల్‌గా క‌నిపించ‌డం, అంద‌మైన లొకేష‌న్ల‌లో సినిమాని చిత్రీక‌రించ‌డం మిన‌హా ఇందులో ఆక‌ట్టుకున్న విష‌యాలేవీ లేవనే చెప్పాలి.

తల్లీకొడుకు ఎమోషన్ వర్కౌట్ అవ్వదు.. హీరో హీరోయిన్ ట్రాక్‌లోనూ ఎమోషన్ కనిపించదు.. ఇలా ఏ పాత్రను కూడా సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. ఏ ఒక్క పాత్రకు కూడా ఆడియెన్ కనెక్ట్ అవ్వడు. సీన్లకు ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడం పక్కన పెడితే.. ఎన్నో లాజిక్ లేని సన్నివేశాలు కనిపిస్తాయి. ఇంటర్ పోల్ అధికారులు హీరోను పట్టుకోవడంలో చూపించే శ్రద్ద, వేగం.. విలన్‌ను పట్టుకోవడంలో చూపించరు. అసలు ఇంటర్ పోల్ అధికారులు అంతగా హీరో వెనక ఎందుకు పడతారు అన్నది కూడా ఆశ్చర్యం వేస్తుంది. విలన్‌ను ఎంతో భయంకరంగా చూపిస్తారని అనుకుంటాం. కానీ చివరకు హీరో ఆ విలన్లను టపీటపీమని కాల్చుకుంటూ వెళ్తూనే ఉంటాడు. చివరి వరకు తన స్థావరానికి హీరో వచ్చాడని కూడా విలన్ కనిపెట్టలేకపోతాడు. ఇలా ఎన్నో సీన్లు ప్రేక్షకుడు తలపట్టుకునేలా ఉంటాయి. అసలు హీరో చేసేది ఏ పని.. ఏ డిపార్ట్మెంట్.. ఆర్మీ, రా.. ప్రైవేట్ ఏజెన్సీ ఇలా ఏంటన్నది కూడా క్లారిటీగా అనిపించదు. చాలా చోట్ల క్లారిటీ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా కోసం ప్రవీణ్ సత్తారు ఎంచుకున్న పాయింట్ ఆలోచింపజేసేదే అయినా.. తెరపై ఆకట్టుకునేలా, అందరూ మెచ్చేలా, ప్రశంసించే సినిమాగా మాత్రం మలచలేకపోయినట్టు అనిపిస్తుంది.

అర్జున్ వర్మ పాత్రలో వరుణ్ తేజ్ చేసే యాక్షన్ సీక్వెన్సులు బాగుంటాయి. సాక్షి వైద్యకు స్కోప్ ఉన్న పాత్ర దక్కినా కూడా ప్రవీణ్ సత్తారు సరిగ్గా ప్రజెంట్ చేయలేదనిపిస్తుంది. గ్లామర్ పరంగా సాక్షి మెప్పిస్తుంది. విలన్‌గా వినయ్ రాయ్ ఏ మాత్రం ప్రభావం చూపించడు. నాజర్‌కు తన సత్తాను చాటే పాత్రేమీ కాదు. అభినవ్ గోమఠంది సడెన్‌గా సెకండాఫ్‌లో అలా కనిపించి హీరోకు సాయం చేసి వెళ్లిపోయే మామూలు పాత్ర. ప్రియా (విమలా రామన్), రియా, రవి వర్మ, స్టూడెంట్ పాత్రలు బాగానే అనిపిస్తాయి.

బాక్సాఫీస్ వద్ద గురి తప్పిన అర్జునుడు
2.5
Acting 3 out of 5
Music 2 out of 5
Production 2 out of 5
Direction 3 out of 5
Share This Article
Leave a review