హైదరాబాద్‌ పక్కనే ‘బద్రీనాథ్’ ఆలయం.. ఎన్నో విశేషాలు

Telugu BOX Office

మంచుకొండల మధ్య కొలువై… ఆరునెలలు మాత్రమే దర్శనమిచ్చే బద్రీనాథుడిని జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకుంటారు ఎంతోమంది భక్తులు. మరి అక్కడకు వెళ్లలేనివాళ్ల పరిస్థితి ఏంటని అర్థంచేసుకున్న ఓ సంస్థ అచ్చంగా బద్రీనాథ్‌ను పోలిన ఆలయాన్ని హైదరాబాద్‌ సమీపంలో నిర్మించింది. దక్షిణ బద్రీనాథ్‌గా గుర్తింపు పొందిన ఈ ఆలయ నిర్మాణం నుంచీ ఇక్కడ నిర్వహించే పూజా కార్యక్రమాల వరకూ అన్నీ బద్రీనాథ్‌ తరహాలోనే ఉంటాయి.

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్‌లతో పాటు ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌నూ దర్శించుకోవడం పరిపాటి. మిగిలిన వాటితో పోలిస్తే బద్రీనాథ్‌కు వెళ్లడం కాస్త కష్టం. ఎందుకంటే… ఆ ఆలయం దాదాపు ఆరునెలలు మాత్రమే తెరిచి ఆ తరువాత మంచు ఎక్కువగా పడటం కారణంగా మూసేస్తారు. పైగా బద్రీనాథ్‌కు వెళ్లి అక్కడ కొలువైన మహావిష్ణువును పూజించాలంటే… ఒక విధంగా సాహస యాత్ర చేయాల్సిందేనని అంటారు. అవన్నీ సాధ్యంకాని వారికోసమే అచ్చంగా అలాంటి ఆలయాన్నే నిర్మించిందో సంస్థ. దక్షిణ బద్రీనాథ్‌గా పిలుస్తున్న ఆ ఆలయమే సిద్దిపేటలోని ములుగు మండలం, బండమైలారంలో ఏర్పాటయ్యింది. ఉత్తరాఖండ్‌ వాసులే ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి చెందిన సుమారు 30 వేల కుటుంబాలు తెలంగాణాలో స్థిరపడ్డాయట. ఆ కుటుంబాల్లో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతోపాటూ ఐటీ రంగంలో స్థిరపడిన వాళ్లూ ఉన్నారట. వీళ్లంతా ఒకప్పుడు తమకు ఇలవేల్పు అయిన మహావిష్ణువును ఏడాదికోసారి బద్రీనాథ్‌కు వెళ్లి దర్శించుకునేవారు. అయితే దూరాభారం కావడం, కొన్నిసార్లు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, ఉద్యోగబాధ్యతల్లో తీరిక లేకపోవడం… తదితర కారణాలతో ప్రతిఏటా అక్కడకు వెళ్లి స్వామిని దర్శించుకోవడం కుదిరేది కాదట. దాంతో తెలంగాణలోనే బద్రీనాథ్‌ను పోలిన ఆలయాన్ని నిర్మించేందుకు సిద్ధమవడంతో అంతా కలిసి ‘ఉత్తరాఖండ్‌ కల్యాణ్‌కారీ’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా విరాళాలను సేకరించి సుమారు పన్నెండేళ్లక్రితం ములుగు మండలంలోని బండమైలారంలో కొంత స్థలాన్ని కొనుగోలు చేసి… 2018లో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ ఆలయం ఈ సంవత్సరం జూన్‌లో ప్రారంభం కావడంతో… ఇప్పుడు ఇక్కడకు వచ్చే భక్తులు బద్రీనాథ్‌ క్షేత్రాన్ని చూసిన ఆనందాన్ని పొందుతున్నారు.

ఉత్తరాదిలోని బద్రీనాథ్‌ ఆలయం సుమారు ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. కానీ… ఈ ఆలయం ఏడాది మొత్తం భక్తులకు అందుబాటులో ఉంటుంది. సాక్షాత్తూ బద్రీనాథ్‌ ఆలయానికి ప్రతిరూపంగా వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో ఏర్పాటుచేసిన అఖండ జ్యోతిని బద్రీనాథ్‌ అలయం నుంచే తీసుకొచ్చారు కల్యాణ్‌కారీ సంస్థ సభ్యులు. అలాగే ఇక్కడ కొలువుదీరిన మహావిష్ణువు, మహాలక్ష్మీ, కేదారేశ్వర్‌, మహా గణపతి, హనుమాన్‌, నవ గ్రహాలు తదితర విగ్రహాలన్నీ బద్రీనాథ్‌ ఆలయం నుంచే వచ్చాయి. ఇక్కడ పూజలు నిర్వహించే వేదపండితులు సైతం బద్రీనాథ్‌ నుంచి రావడం విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో నిర్మించిన ఉపాలయాల్లో గణపతినీ శివపార్వతుల్నీ కూడా దర్శించుకోవచ్చు భక్తులు. ప్రతి రోజు ఉదయం ఏడుగంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలవరకూ తెరిచి ఉంచే ఈ ఆలయాన్ని మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు వరకూ మాత్రమే మూసేస్తారు.

ఇలా చేరుకోవచ్చు
ఈ ఆలయం హైదరాబాద్‌ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారంలో ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి వచ్చే భక్తులు మేడ్చల్‌ మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు. అదే సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి వచ్చే భక్తులు రాజీవ్‌గాంధీ హైవే మీదుగా ఆలయానికి రావొచ్చు. రాజీవ్‌ గాంధీ హైవే నుంచి మేడ్చల్‌ వరకూ, అక్కడినుంచి ఆలయానికి చేరుకునేందుకు బస్సులు అందుబాటులో ఉంటాయి.

Share This Article
Leave a comment