ప్రపంచంలోనే ఒంటరి ఇల్లు.. 100ఏళ్లుగా ఒక్క మనిషీ అక్కడ లేడు

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, ఆశ్చర్యకరమైన ప్రదేశాలున్నాయి. కొన్ని చోట్ల జనం కిక్కిరిసిపోయి ఉంటే మరికొన్ని చోట్ల ఒక్క మనిషి కూడా ఉండరు. అయితే 100 సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్న ఒక ఇల్లును ఇటీవలే ఇటలీలో గుర్తించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి ఈ ఇల్లు భారీ డోలమైట్ పర్వతాల మధ్యలో నిర్మించారు. దీనిని ‘ప్రపంచంలోని ఒంటరి ఇల్లు’ అని పిలుస్తారు. ఈ ఇల్లు సముద్ర మట్టానికి దాదాపు 9వేల అడుగుల ఎత్తులో నిర్మించడం విశేషం. ఇంత ఎత్తులో ఇల్లు ఎలా నిర్మించారు.. ఎందుకు నిర్మించారు ఇక్కడ ఎవరు ఉండేవారు తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

ఈ ఇంటిని మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించారని తెలుస్తోంది. ఆస్ట్రో-హంగేరియన్ సైన్యంతో జరిగిన యుద్ధంలో ఇటాలియన్ సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి ఇంత ఎత్తులో నిర్మించారని చరిత్ర కారులు చెప్పారు. అప్పట్లో సైనికులు ఈ ఇంటిని స్టోర్ రూమ్‌గా కూడా ఉపయోగించారు. సైనికుల కోసం తీసుకువచ్చిన వస్తువులు ఇప్పటికీ భద్రంగా ఉండటం విశేషం. ఈ ఇల్లు పూర్తిగా భిన్నమైన రీతిలో నిర్మించారు. దీని నిర్మాణంలో చెక్క, తాడు, కేబుల్ ఉపయోగించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఇల్లు నిర్మించి 100 సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ ఈ ఇల్లు చెక్కుచెదరకుండా అలాగే ఉంది. పర్వతం మధ్యలో ఈ ఇల్లు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈ ఇంటి చుట్టూ పర్వతాలు తప్ప ఇంకెమీ కనిపించవు. దీంతో ప్రజలెవరూ ఇక్కడికి రావడం లేదు. ఇక్కడికి చేరుకునే మార్గం కూడా చాలా కష్టంతో కూడుకున్నది. ఒక పాత చెక్క వంతెనను దాటితేనే ఇక్కడికి చేరుకోగలం. గొప్పదనం ఏంటంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత మరో లోకంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ప్రమాదం కారణంగా ప్రజలు ఇక్కడికి రాకుండా సాధారణంగా నిషేధించినా సాహసాలను ఇష్టపడే వ్యక్తులు ఇక్కడికి వెళ్లాలని అనుకుంటే సొంత పూచీతో అనుమతిస్తున్నారు.